‘గాంధీ’లో అరుదైన శస్త్రచికిత్స: సినిమా చూపిస్తూ సర్జరీ చేసేశారు!

Surgery Done While Showing The Movie To Patient - Sakshi

స్పృహలో ఉన్న రోగి మెదడులోంచి కణితి తొలగింపు 

‘గాంధీ’లో విజయవంతంగా అరుదైన శస్త్రచికిత్స

గాంధీఆస్పత్రి: సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. రోగికి సినిమా చూపిస్తూ విజయవంతంగా సర్జరీ చేసి ప్రాణాలు కాపాడారు. స్పృహలో ఉన్న రోగి మెదడులోని కణితి(ట్యూమర్‌)నితొలగించి శభాష్‌ అనిపించుకున్నారు. ఈ రకమైన సర్జరీని వైద్యపరిభాషలో అవేక్‌ క్రేనియటోమీ అంటారని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు, న్యూరోసర్జరీ హెచ్‌వోడీ డాక్టర్‌ ప్రకాశరావు, అనస్తీషియా వైద్యురాలు ప్రొఫెసర్‌ శ్రీదేవి తెలిపారు. యాదాద్రి జిల్లాకు చెందిన ఓ వృద్ధురాలు(60) అస్వస్థతతో ఇటీవల గాంధీ ఆస్పత్రిలో చేరింది. న్యూరాలజీ వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించి మెదడులో ప్రమాదకరమైన రీతిలో కణితి(ట్యూమర్‌) పెరుగుతున్నట్లు గుర్తించారు.

సాధారణ సర్జరీ చేస్తే రోగి ప్రాణానికే ప్రమాదమని భావించి న్యూరోసర్జరీ, అనస్తీషియా వైద్యులు సంయుక్తంగా అవేక్‌ క్రేనియటోమీ శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. గురువారం ఉదయం సంబంధిత వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది సుమారు గంట సమయం వెచ్చించి ఆమెలో నమ్మకం కల్పించారు. అనంతరం ఆపరేషన్‌ థియేటర్‌లోని టేబుల్‌పైకి తీసుకువెళ్లి మత్తుమందు ఇచ్చారు. మెదడు పైభాగాన్ని తెరిచి సర్జరీ చేస్తున్న సమయంలో ఫిట్స్, పెరాలసిస్‌తోపాటు పలు రకాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉండటంతో స్పృహలో ఉన్న ఆమెతో నిరంతరాయంగా మాట్లాడుతూ యాక్టివ్‌గా ఉంచారు. తనకు చిరంజీవి, నాగార్జున అంటే అభిమానమని, చిరంజీవి నటించిన అడవిదొంగ సినిమా అంటే చాలా ఇష్టమని చెప్పడంతో కంప్యూటర్‌ ట్యాబ్‌లో ఆ సినిమాను చూపించారు. ఆమె సినిమా చూస్తుండగా వైద్యులు సుమారు రెండు గంటలు తీవ్రంగా శ్రమించి మెదడులోని ఇతర భాగాలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ట్యూమర్‌ను తొలగించారు.

వైద్యుల హర్షం
తొలిసారిగా గాంధీ ఆస్పత్రిలో చేపట్టిన అవేక్‌ క్రేనియటోమీ సర్జరీ విజయవంతం కావడంతో వైద్యులు హర్షం వ్యక్తం చేశారు. శస్త్రచికిత్స నిర్వహించిన న్యూరోసర్జరీ, అనస్తీషియా వైద్యులు ప్రకాశరావు, ప్రతాప్‌కుమార్, నాగరాజు, శ్రీదేవి, సారయ్య, ప్రతీక్ష, అబ్బయ్య, పీజీలు కిరణ్, గిరీశ్, యామిని, స్ఫూర్తి, నర్సింగ్‌ సిబ్బంది రాయమ్మ, సవిన, రజిని, సుమ, వార్డ్‌బాయ్‌ నవీన్, వెంకన్నను వైద్యమంత్రి హరీశ్‌రావు, డీఎంఈ రమేశ్‌రెడ్డి, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజారావు, డిప్యూటీలు శోభన్‌బాబు, నర్సింహనేత, టీజీజీడీఏ గాంధీ యూనిట్‌ అధ్యక్షకార్యదర్శులు రాజేశ్వరరావు, భూపేందర్‌ రాథోడ్‌ తదితరులు అభినందించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top