
Surendra Puri creator kunda satyanarayana died: యాదాద్రికి సమీపంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం సురేంద్రపురి కళాధామం సృష్టికర్త, ప్రముఖ పారిశ్రామికవేత్త కుందా సత్యనారాయణ బుధవారం కన్నుమూశారు. 1938 జూన్ 15వ తేదీన జన్మించిన ఆయనకు భార్య హైమావతి, కుమారులు శ్రీనివాస్, ప్రతాప్, కుమార్తె సూర్యకుమారి ఉన్నారు.మూడు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతోన్న సత్యనారాయణ బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్ మహాప్రస్థానంలో కుందా సత్యనారాయణ భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లా బస్వాపురం గ్రామానికి చెందిన కుందా సత్యనారాయణ మూడో కుమారుడు సురేంద్రబాబు 1991లో మరణించగా.. ఆయన జ్ఞాపకార్థం 1998లో యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో స్థలం కొని ఆ ప్రాంతా నికి సురేంద్రపురి ప్రాంగణంగా నామకరణం చేశారు. కాశీ నుంచి కన్యాకుమారి వరకు గల ఆలయాలన్నింటినీ ఒకే ప్రదేశంలో చూసిన అనుభూతి కలగాలన్న ఉద్దేశంతో 2008లో వివిధ ప్రముఖ ఆలయాల పోలికతో దేవాలయాలు, దేవుళ్ల విగ్రహాలు కట్టించారు. రామాయణ, మహాభారత, భాగవత సన్నివేశాలను విగ్రహాల రూపంలో ఏర్పాటు చేయించారు. ఈ ప్రాంతానికి ‘కుందా సత్యనారాయణ కళాధామం' పేరు పెట్టారు.