వారి చదువు ఆగరాదు

Supreme Court orders Telangana Govt For Education Corona Orphan Children - Sakshi

పాఠశాల యాజమాన్యాలతో మాట్లాడండి 

లేదంటే సగం రుసుము రాష్ట్రాలు భరించాలి 

సుప్రీంకోర్టు ఆదేశాలు 

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో తల్లిదండ్రులిద్దరినీ లేదా ఒకరిని కోల్పోయిన చిన్నారుల చదువు మధ్యలో ఆగరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ ఏడాది వారి చదువులు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఆయా చిన్నారుల ఫీజులు మాఫీ చేయాల్సిందిగా ప్రైవేటు యాజమాన్యాలను కోరాలని సూచించింది. లేదంటే సగం ఖర్చు ప్రభుత్వాలు భరించాలంది. ‘చిన్నారుల సంరక్షణ నిలయాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తి’ సుమోటో కేసును గురువారం జస్టిస్‌ ఎల్‌ నాగేశ్వరరావు, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. దేశంలో మార్చి 2020 నుంచి అనాథలైన లేదా తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన చిన్నారుల విద్యా భద్రత పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఇవ్వాలని ధర్మాసనం పేర్కొంది. కనీసం ప్రస్తుత విద్యాసంవత్సరమైనా ఆయా చిన్నారుల చదువు కొనసాగేలా చూడాలని తెలిపింది.  

‘ఈ విద్యా సంవత్సరంలో ఆయా చిన్నారుల విద్యకు ఆటంకం రాకుండా చూసేలా వారు చదువుతున్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో మాట్లాడటానికి బాలల సంక్షేమ కమిటీలు, జిల్లా విద్యాశాఖాధికారులతో సమన్వయం చేసుకోవాలి’ అని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ సందర్భంగా అమికస్‌ క్యూరీ గౌరవ్‌ అగర్వాల్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం రాష్ట్రాలకు సుప్రీంకోర్టు పలు సూచనలు చేసింది.  

తెలంగాణలో 221 మందికి లబ్ధి 
కరోనా వల్ల అనాథలైన 221 మంది చిన్నారులకు ఇంటిగ్రేటెడ్‌ చైల్డ్‌ ప్రొటెక్ట్‌ (ఐసీపీ) స్కీం ద్వారా  తెలంగాణ ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తోందని సుప్రీంకోర్టు పేర్కొంది. సోషల్‌ ఇన్వెస్టిగేషన్‌ రిపోర్ట్‌ (ఎస్‌ఐఆర్‌) ఆధారంగా 914 మంది చిన్నారులు తల్లిదండ్రుల్లో ఒకరు కోల్పోయారని, వారికి లబ్ధి చేకూర్చాల్సి ఉందని చెప్పింది. ‘ఎస్‌ఐఆర్‌ను త్వరగా ఫైనలైజ్‌ చేయాలి. మూడు వారాల్లో బాల్‌స్వరాజ్‌ పోర్టల్‌లో సమాచారం అప్‌లోడ్‌ చేయాలి. 221 మంది అనాథల్లో 96 మందిని ప్రైవేటు పాఠశాలల్లో చేర్చారు. వీరి చదువు పట్ల ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. 914 మందిని కూడా ప్రైవేటు పాఠశాలల్లో చేర్చాలి’ అని ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top