సీఎం రేవంత్‌రెడ్డితో భేటీలో సునీల్ భారతి మిట్టల్
సాక్షి, హైదరాబాద్: ఎయిర్‌టెల్‌కు రెండో హెడ్‌క్వార్టర్‌గా హైదరాబాద్‌ను చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామని ప్రముఖ పారిశ్రామికవేత్త, భారతీ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ వెల్లడించారు. మంగళవారం ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా ఆయన తన అభిప్రాయాన్ని సీఎంతో పంచుకున్నారు. తెలంగాణలో ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీని పెంచడానికి ఆయన ఆసక్తి కనపర్చారు. అలాగే డేటా సెంటర్ల సామర్థ్యాన్ని మరింత పెంచనున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యావ్యవస్థలో తీసుకొస్తున్న సంస్కరణలను సీఎం ఆయనకు వివరించారు. ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిరుద్యోగుల్లో నైపుణ్యాలను పెంపొందించడానికి స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని, ఐటీఐలను అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లు (ఏటీసీ)గా మారుస్తున్నామని, పాలిటెక్నిక్ కళాశాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. చందన్‌వెల్లిలోని డేటా సెంటర్‌ను వీలైనంత త్వరగా ప్రారంభించాలని ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి సూచించారు.
తెలంగాణలో మరింత పెద్ద సమగ్ర డేటా సెంటర్, ఏఐ మౌలిక సదుపాయాల క్యాంపస్‌ను ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని, హైదరాబాద్‌లో ఎయిర్‌టెల్ డిజిటల్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ ఏఐ కార్యకలాపాలపైనా పెట్టాలని కోరారు. భవిష్యత్ పెట్టుబడి అవకాశాలు, సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేలా ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ను నామినేట్ చేసి సమన్వయం చేసుకోవాలని సీఎం సూచించారు. భారతీ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, ఏటీసీల్లో చదువుకునే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేస్తామని సునీల్ మిట్టల్ తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్నారు.


