స్టడీ సర్కిళ్లలో ప్రత్యక్ష శిక్షణ 

Study Circles Are Preparing For Direct Training In Telangana - Sakshi

నవంబర్‌ రెండో వారం నుంచి తరగతుల ప్రారంభానికి అవకాశం 

సాక్షి, హైదరాబాద్‌: ప్రత్యక్ష శిక్షణకు స్టడీ సర్కిళ్లు సిద్ధమవుతున్నాయి. కోవిడ్‌ నేపథ్యంలో మూతబడ్డ విద్యాసంస్థలన్నీ ఇప్పుడు తెరుచుకోవడంతో, స్టడీ సర్కిళ్లను సైతం తెరిచి ప్రత్యక్ష శిక్షణ తరగతులు నిర్వహించాలని సంక్షేమ శాఖలు నిర్ణయించాయి. ఈ క్రమంలో త్వరలో జరగనున్న ఐబీపీఎస్‌ పరీక్షలతో పాటు ఇతర ఉద్యోగ ప్రకటనలకు తగినట్లు శిక్షణ ఇవ్వనున్నాయి.

ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలో హైదరాబాద్‌లో మూడు ప్రధాన స్టడీ సర్కిళ్లు ఉన్నాయి. వీటికి అనుబంధంగా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో కూడా సంక్షేమ శాఖల వారీగా ఒక్కో స్టడీ సర్కిల్‌ను నిర్వహిస్తున్నాయి. కోవిడ్‌తో ఈ కేంద్రాలు మూతపడడంతో ఆన్‌లైన్‌ శిక్షణ తరగతులు నిర్వహించారు. స్టడీ సర్కిళ్లను వచ్చే నెలలో తెరిచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 

బ్యాంకు ఉద్యోగాలకు శిక్షణ... 
జాతీయ బ్యాంకుల్లో పెద్దఎత్తున ఉద్యో గ ఖాళీల భర్తీకి ఇటీవల ఐబీపీఎస్‌ ప్రకటన విడుదల చేసింది. ఇందుకు సంబంధించి నవంబర్‌ మొదటి వారంలో శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. రైల్వేలో ఉద్యోగాలకు సైతం త్వరలో ప్రకటనలు వెలువడే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే ఖాళీలను గుర్తించింది. శిక్షణ కోసం ఆశావహులు సిద్ధమవుతున్నారు. దీంతో స్టడీ సర్కిళ్లను పూర్తిస్థాయిలో తెరిచి ప్రత్యక్ష శిక్షణ చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే బీసీ స్టడీ సర్కిల్‌ పరిధిలో ఎస్సై, కానిస్టేబుల్‌ రాత పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 11 స్టడీ సర్కిళ్లలో తాజాగా ప్రత్యక్ష శిక్షణను ప్రారంభిస్తోంది. ఈ మేరకు దరఖాస్తుల స్వీకరణ సైతం పూర్తి చేసింది. కాగా, సివిల్స్‌కు సిద్ధమవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తుండగా, ప్రత్యక్ష శిక్షణ కోసం అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో వచ్చే నెల రెండో వారం లేదా చివరి వారంలో ప్రత్యక్ష బోధన ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top