
హైదరాబాద్: బిల్డింగ్‌పై వాకింగ్ చేస్తుండగా..మూర్ఛ వ్యాధి రావడంతో అదుపుతప్పి విద్యార్థి మూడో అంతస్తు నుండి కిందపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన ఐఎస్ సదన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..దుర్గా భవానీనగర్ ప్రాంతానికి చెందిన వ్యాపారి బద్రీనాథ్ రావు కుమారుడు గౌరవ్ రావు (17) ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో భోజనం చేసిన అనంతరం వాకింగ్ చేసేందుకు మూడో అంతస్తుకు వెళ్లాడు. అక్కడ వాకింగ్ చేస్తుండగా ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో అదుపుతప్పి భవనం నుంచి కిందపడిపోయాడు. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు తీవ్ర గాయాలకు గురైన గౌరవ్‌ను చికిత్స నిమిత్తం అపోలో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.