బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య 

Student Commits Suicide in Basara IIIT Nirmal - Sakshi

వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య: ఎస్పీ 

గంజాయి పేరిట వేధింపులే కారణమంటున్న విద్యార్థులు

బాసర/నిర్మల్‌/డిచ్‌పల్లి: వరుస ఘటనలతో నిత్యం వార్తల్లో ఉంటున్న బాసర ట్రిపుల్‌ ఐటీలో మంగళవారం మరో విషాదం చోటుచేసుకుంది. కళాశాలలో ఇంజనీరింగ్‌ ఫస్ట్‌ ఇయర్‌ (ఈ–1) చదువుతున్న రాథోడ్‌ సురేశ్‌(22) గోదావరి హాస్టల్‌ భవనంలోని తన గదిలో మంగళవారం ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. సురేశ్‌ ఉదయం సహచర విద్యార్థులతో కలిసి బ్రేక్‌పాస్ట్‌ చేశాడు.

అనంతరం అందరూ తరగతులకు వెళ్లగా, సురేశ్‌ మాత్రం హాస్టల్‌లోనే ఉండిపోయాడు. మధ్యాహ్న భోజనానికి హాస్టల్‌కు వచ్చిన సహచరులకు సురేశ్‌ కనిపించకపోవడంతో అతడి గదికి వెళ్లారు. తలుపుతట్టినా లేవకపోవడంతో కిటికీలో నుంచి చూడగా సురేశ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. వ్యక్తిగత కారణాలతోనే సురేశ్‌ ఆత్మహత్య చేసుకున్నారని జిల్లా ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌ ప్రకటించారు. సురేశ్‌ సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.  

మృతదేహానికి చికిత్స చేశారు...
గంజాయిపై విచారణ పేరిట పోలీసులు, అధికారులు వేధించడంతోనే సురేశ్‌ ఆత్మహత్య చేసుకున్నాడని వర్సిటీలోని డిస్పెన్సరీ ఎదుట విద్యార్థులు ఆందోళన చేశారు. ‘పోలీస్‌ గో బ్యాక్‌’అంటూ నినదించారు. పోలీస్‌ వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు. ఘటనపై అధికారులు వ్యవహరించిన తీరుపై విద్యార్థులు మంగళవారం రాత్రి ప్రెస్‌నోట్‌ విడుదల చేశారు. సురేశ్‌ మంగళవారం గదిలోనే పడుకున్నాడని, స్నేహితులు మధ్యాహ్నం వచ్చి చూడగా, గదికి గడియపెట్టి ఉందన్నారు. తలుపు తెరిచేసరికి గదిలో ఫ్యాన్‌కు వేలాడుతున్నాడని, అప్పటికే అతడిలో పల్స్‌ కూడా లేదని, కానీ అధికారులు డిస్పెన్సరీలో మృతదేహానికి చికిత్స చేశారని ఆరోపించారు.

తమనెందుకు మోసం చేశారంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాత్రి 10 గంటల సమయంలో వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద విద్యార్థులు బైఠాయించారు. సురేశ్‌ మృతికి నిరసనగా అన్ని వర్సిటీలు బుధవారం బంద్‌కు  ట్విట్టర్‌లో పిలుపునిచ్చారు. నిర్మల్‌ జిల్లా ఆçస్పత్రిలో సురేశ్‌ మృతదేహాన్ని సందర్శించేందుకు వచ్చిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవితోపాటు బీజేపీ, కాంగ్రెస్‌ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.  

గంజాయితో సంబంధం లేదంటూ ఆవేదన 
రాథోడ్‌ సురేశ్‌ స్వస్థలం నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి తండా. రాథోడ్‌ గంగారాం, సరోజ దంపతులకు సురేశ్‌తోపాటు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఇటీవల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు చేసిన ఉద్యమంలో సురేశ్‌ సైతం పాల్గొన్నాడు. ఈ నేపథ్యంలో క్యాంపస్‌లో గంజాయి తాగుతున్నారంటూ సురేశ్‌తోపాటు కొందరు విద్యార్థులను వారం క్రితం పిలిపించి పోలీసులు విచారణ జరిపారు. పోలీసుల వేధింపులతోనే సురేశ్‌ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.   

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

చదవండి: (డ్యామిట్‌ కథ అడ్డంతిరిగింది.. రేవంత్‌కు కష్టాలు.. తెలివిగా తప్పుకున్న కోమటిరెడ్డి)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top