రూ.5 వేల కోట్ల నిధులు పెండింగ్‌లోనే | Stringent regulations hindering access to 16th Finance Commission funds | Sakshi
Sakshi News home page

రూ.5 వేల కోట్ల నిధులు పెండింగ్‌లోనే

Jul 2 2026 4:19 AM | Updated on Jul 2 2026 4:19 AM

Stringent regulations hindering access to 16th Finance Commission funds

స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం నుంచి నిలిచిన రూ.1,090 కోట్ల బకాయిలు 

గ్రామీణ స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్‌ గ్రాంట్లు రూ.2,979 కోట్లు పెండింగ్‌లోనే.. 

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రూ.1,200 కోట్లు 

16వ ఆర్థిక సంఘం నిధులు పొందేందుకు అడ్డొస్తున్న కఠిన నిబంధనలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు రూ.5,000 కోట్లకు పైగా నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. 15వ ఆర్థిక సంఘం నిబంధనల ప్రకారం కేంద్రం నుంచి రావాల్సిన రూ.1,090 కోట్ల బకాయి లు నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు విడుదల చేయాల్సిన వాటా (మ్యాచింగ్‌ గ్రాంట్లు) రూ.2,979 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రూ.1,200 కోట్లు ఉన్నాయి. 2026–27 ఆర్థిక సంవత్సరంలో స్థానిక సంస్థలకు ఒకవైపు భారీ నిధుల కేటాయింపులు జరిగినా, క్షేత్రస్థాయిలో నిధుల బదిలీ నెమ్మదిగా సాగుతోంది. 

మే 2026లో కేంద్ర ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘం కింద రాబోయే ఐదేళ్ల కాలానికి (2026–31) గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.9,968 కోట్లు కేటాయించింది. ఈ నిధులు ఏటా జూన్, అక్టోబర్‌ నెలల్లో రెండు విడతలుగా విడుదల కావాల్సి ఉంది. అయితే, కేంద్రం విధించిన కఠినమైన ముందస్తు నిబంధనల వల్ల క్షేత్రస్థాయిలో నిధులు పూర్తిగా డ్రా చేసుకోవడం ఒక సవాలుగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు విడుదల చేయకపోవడంతో.. ఈ సంవత్సరంలో 16వ ఆర్థిక సంఘం మొదటి విడత నిధుల్లో కేంద్రం ఒక్కపైసా విడుదల చేయలేదు.  

జెడ్పీ, ఎంపీపీల్లో పాలకవర్గాలు లేక... 
16వ ఆర్థిక సంఘం నిధులు తెలంగాణకు భారీగా మంజూరైనా, వాటిని పొందడంలో రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ సమస్యలు ఎదురవుతున్నాయి  
» కేంద్ర నిబంధనల ప్రకారం రాజ్యాంగంలోని పార్ట్‌  ఐగీ ప్రకారం ఎన్నికైన ప్రజాప్రతినిధులు (పాలకవర్గాలు) ఉన్న స్థానిక సంస్థలకు మాత్రమే నిధులు నిరంతరాయంగా విడుదలవుతాయి.  
» తెలంగాణలో కొత్త సర్పంచ్‌లు వచ్చినా, మండల పరిషత్, జిల్లా పరిషత్‌ ఎన్నికల నిర్వహణలో ఆలస్యం కారణంగా కొన్ని నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఏర్పడింది. 
»  2026–27 మొదటి విడత నిధులు పొందాలంటే గత ఆర్థిక సంవత్సరం (2025–26)కి సంబంధించిన స్థానిక సంస్థల ఆడిట్‌ నివేదికలను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో సమర్పించాలి. రాష్ట్రంలో ఆడిటింగ్‌ ప్రక్రియలు ఆలస్యం కావడం నిధుల విడుదలకు అడ్డంకిగా మారింది. 
» ప్రతి పైసా ఖర్చును ఈ–గ్రామ్‌స్వరాజ్‌ పోర్టల్‌లో నమోదు చేయాలి. పంచాయతీ కార్యదర్శులు, అధికారుల ‘మేకర్‌ అండ్‌ చెక్కర్‌’డిజిటల్‌ కీలు సరిగ్గా అప్‌డేట్‌ కాకపోవడం వల్ల ఆన్‌లైన్‌ పేమెంట్లు నిలిచిపోతున్నాయి. 
» 16వ ఆర్థిక సంఘం నిధులను కేవలం మౌలిక వసతులు, తాగునీరు, పారిశుధ్యానికి మాత్రమే వాడాలని కేంద్రం నిబంధన పెట్టింది. దీనివల్ల పంచాయతీల్లో మల్టీపర్పస్‌ వర్కర్ల జీతాల చెల్లింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధుల ఎస్‌ఎఫ్‌సీపై అదనపు భారం మోయాల్సి వస్తోంది. 
»  స్థానిక సంస్థలు తమ సొంత పన్నుల వసూళ్లను (ఆస్తిపన్నులు మొదలైనవి) పెంచుకుంటేనే అదనపు ప్రోత్సాహక (పనితీరు ఆధారిత 20%) నిధులు విడుదల చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement