
న్యాస్ సర్వేలో రాష్ట్రానికి మెరుగైన స్థానం
9వ తరగతిలో 17, 6లో 26వ స్థానం కైవసం
మొత్తంగా మూడేళ్లలో పది పాయింట్లు పురోగతి
3, 6, 9 తరగతుల విద్యార్థులపై జాతీయ ఫరఖ్ సర్వే
తెలంగాణలో పాఠశాల విద్య కొంత మెరుగుపడిందని రాష్ట్రీయ సర్వేక్షణ్–ఫరఖ్ –2024 (న్యాస్) జాతీయ సర్వేలో తేలింది. ప్రాథమిక విద్యలో 2021లో దేశంలో 36వ స్థానంలో ఉన్న తెలంగాణ, ఇప్పుడు 26వ స్థానానికి ఎగబాకింది. ఆరో తరగతిలో 26వ స్థానం, తొమ్మిదో తరగతిలో 17వ స్థానాన్ని దక్కించుకుంది. 6, 9 తరగతుల్లో ఆంధ్రప్రదేశ్ కంటే మెరుగైన ప్రతిభను కనబరిచింది. విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్సీఈఆర్టీ ప్రతి మూడేళ్లకు ఒకసారి జాతీయ స్థాయిలో సర్వే నిర్వహిస్తుంది.
గతంలో దీన్ని నేషనల్ అచీవ్‌మెంట్ సర్వేగా పిలిచేవారు. 2024లో రాష్ట్రీయ సర్వేక్షణ–ఫరఖ్ పేరుతో సర్వే నిర్వహించారు. ఫరఖ్ అంటే.. ‘పెర్ఫార్మెన్స్, అసెస్‌మెంట్, రివ్యూ, అనాలిసిస్, నాలెడ్జ్, హోలెస్టిక్, డెవలప్‌మెంట్’. దేశవ్యాప్తంగా 781 జిల్లాల్లో 74,229 పాఠశాలల్లోని 3, 6, 9 తరగతులకు చెందిన 21,15,022 మంది విద్యార్థులకు ఈ సర్వేలో భాగంగా పలు పరీక్షలు నిర్వహించారు.
తెలంగాణవ్యాప్తంగా 33 జిల్లాల్లో 3,342 స్కూళ్ల నుంచి లక్ష మంది విద్యార్థులు ఈ సర్వేలో పాల్గొన్నారు. భాష, గణితం, సైన్స్, సోషల్, పరిసరాల విజ్ఞానం పాఠ్యాంశాలకు సంబంధించి ఐచ్ఛిక ప్రశ్నలు ఇచ్చారు. మూడో తరగతిలో 45, ఆరో తరగతిలో 51, తొమ్మిదిలో 60 ప్రశ్నలు ఇచ్చారు.
10 పాయింట్లు మెరుగు
న్యాస్ సర్వే–2021లో జాతీయ సగటు కన్నా మన విద్యార్థులు తక్కువ స్కోర్ నమోదు చేశారు. ఈ సారి పరిస్థితి మెరుగైంది. మూడేళ్ల క్రితం చేపట్టిన సర్వేలో 3, 5, 8 తరగతుల విద్యార్థులకు సామర్థ్య పరీక్ష నిర్వహించారు. ఈసారి 3, 6, 9 తరగతులకు నిర్వహించారు. 3వ తరగతి భాష, మేథమెటిక్స్‌లో ఈసారి 10 పాయింట్ల మేర పురోగతి ఉందని విద్యాశాఖ తెలిపింది. ప్రభుత్వ స్కూళ్లు ఈసారి ప్రైవేటు సంస్థలతో పోటీగా మెరుగైన ఫలితాలు కనబరిచాయి.
3వ తరగతిలో అత్యధిక సామర్థ్యం కనబరిచిన జిల్లాలుగా వనపర్తి 14, జనగాం 16వ స్థానంలో నిలిచాయి. 6వ తరగతిలో జనగాం 35వ స్థానంతో అత్యధిక సామర్థ్యం కనబరిచన జాబితాలో ఉంది. ములుగు 47వ స్థానంతో అతి తక్కువ సామర్థ్యం గల జాబితాలో చేరింది. 9వ తరగతిలో జనగాం 33వ స్థానంలో అత్యధిక సామర్థ్యం గల జాబితాలో చేరింది.
అతి తక్కువ సామర్థ్యం ఉన్న జాబితాలో ఈ తరగతిలో తెలంగాణ జిల్లాలేవీ లేవు. దేశవ్యాప్తంగా భాషలో 64 శాతం, మేథ్స్‌లో 60 శాతం మంది సామర్థ్యం కనబరిచారు. అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా 49 శాతం మాత్రమే సామర్థ్య పరీక్షలో ప్రతిభ ఉన్నట్టు సర్వే పేర్కొంది.
