ఈ మార్గం.. మూసీకి శాపం!

State Pollution Control Board Said That Pollution In Musi Rise - Sakshi

బాపూఘాట్‌–ప్రతాప సింగారం రూట్లో అత్యధిక కాలుష్యం

తక్షణం ఎస్టీపీలు నిర్మిస్తేనే విముక్తి

సిటీ ఆవల తగ్గిన మూసీ కాలుష్యం 

సాక్షి, సిటీబ్యూరో: ఓ వైపు మూసీ సుందరీకరణ పేరిట కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేస్తుండగా.. మరోవైపు మూసీ పరిధిలోని కొన్ని ఏరియాల్లో విపరీతంగా కాలుష్యం పెరుగుతోంది. ముఖ్యంగా మూసీనదికి బాపూఘాట్‌–ప్రతాప సింగారం (45 కి.మీ) మార్గం శాపంగా మారింది. సిటీలోకి బాపూఘాట్‌ వద్ద ప్రవేశిస్తున్న మూసీలో కాలుష్య మోతాదు పెరిగినట్లు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి తాజా నివేదికలో వెల్లడించింది. ఈ రూట్లో గృహ, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న మురుగునీటితో మూసీ జలాల్లో కరిగిన ఆక్సిజన్‌ మోతాదు అనూహ్యంగా తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. వివిధ రకాల జలచరాలు, వృక్ష జాతులు, జంతువుల మనుగడకు అవసరమైన కరిగిన ఆక్సిజన్‌ శాతం (డీఓ) లీటరు నీటిలో 4 మిల్లీ గ్రాములుగా ఉండాలి. కానీ నగరంలో పలు చోట్ల 0.3 శాతంగా నమోదవడం గమనార్హం. ఇక బయోలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ (బీవోడీ) లీటర్‌ నీటిలో 3 ఎంజీలను మించకూడదు. కానీ పలు చోట్ల 10 ఎంజీలకు పైగా నమోదైంది.  

సిటీలో మూసీ కాలుష్యం ఇలా.. 
మహానగరం పరిధిలో నిత్యం విడుదలవుతోన్న 1400 మిలియన్‌ లీటర్ల మురుగు జలాల్లో జలమండలి కేవలం 700 మిలియన్‌ లీటర్ల వ్యర్థజలాలను మాత్రమే శుద్ధి చేస్తోంది. మరో 700 మిలియన్‌ లీటర్ల వ్యర్థ జలాలు ఎలాంటి శుద్ధి ప్రక్రియ లేకుండానే మూసీలో కలుస్తున్నాయి. బల్క్‌ డ్రగ్, ఫార్మా, ఇంటర్మీడియెట్‌ కంపెనీల నుంచి వెలువడుతోన్న ప్రమాదకర పారిశ్రామిక, రసాయన వ్యర్థాలను శుద్ధి కేంద్రాలకు తరలించకుండా ట్యాంకర్ల ద్వారా మూసీలోకి డంప్‌ చేస్తున్నారు. బాపూఘాట్, మూసారాంబాగ్‌ వంతెన, నాగోల్, ఉప్పల్‌ నల్ల చెరువు, ఫీర్జాదిగూడా, ప్రతాపసింగారం వద్ద మూసీ జలాల్లో కరిగిన ఆక్సిజన్‌ మోతాదు తాజాగా 0.3 మిల్లీగ్రాములుగా నమోదైంది.  క సిటీ పరిధి దాటిన తరవాత..రుద్రవెల్లి వంతెన, వలిగొండ, కాసానిగూడా వద్ద కరిగిన ఆక్సిజన్‌ మోతాదు 5.6 పాయింట్లుగా నమోదవడం విశేషం. 

బయోలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ బాపూఘాట్‌ వద్ద 10, మూసారాంబాగ్‌ వద్ద 16, నాగోల్‌ వద్ద 15, ఉప్పల్‌ నల్ల చెరువు వద్ద 16, ఫీర్జాదిగూడ వద్ద 15, ప్రతాప సింగారం వద్ద 10 మిల్లీ గ్రాములుగా నమోదైంది. నగర పరిధి దాటిన తరవాత బయోలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ రుద్రవెల్లి వంతెన వద్ద 5, వలిగొండ వద్ద 4.5, కాసానిగూడా వద్ద 4 యూనిట్లుగా నమోదవడం విశేషం. మొత్తంగా నగరంలో బాపూఘాట్‌–ప్రతాపసింగారం మార్గంలో మూసీ జలాల్లో కరిగిన ఆక్సిజన్‌ మోతాదు తగ్గి, బయోలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ అనూహ్యంగా పెరిగినట్లు పీసీబీ తాజా నివేదికలో స్పష్టమైంది. మూసీకి ఆవల మాత్రం పరిస్థితిలో మార్పు వచ్చింది.  మూసీ నదిని కాలుష్యం కోరల నుంచి రక్షించాలంటే రెండోదశ ప్రక్షాళన పథకాన్ని తక్షణం పూర్తిచేయాలి. పలు చోట్ల ఎస్టీపీలను నిర్మించి మూసీలోకి చేరుతున్న వ్యర్థజలాలను శుద్ధిచేయాలి. 

ఎస్టీపీలు నిర్మించాల్సిన ప్రాంతాలివే.. 
అంబర్‌పేట్‌(142ఎంఎల్‌డి), నాగోల్‌(140ఎంఎల్‌డి), నల్లచెరువు(80ఎంఎల్‌డి), హైదర్షాకోట్‌(30), అత్తాపూర్‌(70ఎంఎల్‌డి), మీరాలం(6ఎంఎల్‌డి), ఫతేనగర్‌ (30ఎంఎల్‌డి), ఐడీపీఎల్‌ టౌన్‌షిప్‌ (59ఎంఎల్‌డి),నాగారం(29ఎంఎల్‌డి), కుంట్లూర్‌–హయత్‌నగర్‌ (24 ఎంఎల్‌డి) 

రీసైక్లింగ్‌ యూనిట్లు: ఫతేనగర్,ఐడీపీఎల్‌ టౌన్‌షిప్,నాగారం కాప్రా 

చదవండి: ‘మూసీ’ చుట్టూ అందరి ప్రదక్షిణం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top