
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న పొంగులేటి. చిత్రంలో పొన్నం, అడ్లూరి లక్ష్మణ్ తదితరులు
పథకాల ఫలాలు పేదలకు చేరేలా పటిష్ట చర్యలు తీసుకోవాలి
సంక్షేమ హాస్టళ్లలో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలి
వారంలో ఒకరోజు అధికారులంతా హాస్టళ్లలో బస చేయాలి
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రుల ఆదేశం
సమీక్షలో పాల్గొన్న మంత్రులు పొంగులేటి, పొన్నం, కొండా, అడ్లూరి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు ప్రధానపాత్ర పోషించాలని మంత్రులు చెప్పారు. ఆయా సంక్షేమ పథకాల ఫలాలు పేదలకు చేరేలా చర్యలు తీసుకోవాలని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు.. వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, విభాగాధిపతులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, భూభారతి, రెసిడెన్షియల్ స్కూళ్లలో భోజన, మౌలిక వసతుల ఏర్పాటు, వన మహోత్సవంలో మొక్కలు నాటడం, మహాలక్ష్మి పథకం తదితర అంశాలపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిందని, వాటిని అర్హులకు చేరేలా కలెక్టర్లు, అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. దానికనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు.
హాస్టళ్లలో నాణ్యమైన భోజనం
సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని కలెక్టర్లను మంత్రులు ఆదేశించారు. హాస్టళ్ల నిర్వహణపై ఎప్పుటికప్పుడు తనిఖీలు నిర్వహించి వారంలో ఒకరోజు అధికారులందరూ ఆ హాస్టళ్లలో బస చేసేలా చూడాలన్నారు. పెంచిన డైట్ చార్జీలకు అనుగుణంగా నాణ్యమైన భోజన వసతి కల్పించాలని చెప్పారు. హాస్టళ్లలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు కల్పించాలని, వారి నుంచి ఎలాంటి ఫిర్యాదులు రావొద్దన్నారు. ఈ సందర్భంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ జిల్లా కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులతో నెలకోసారి పేరెంట్స్ కమిటీ మీటింగ్‌లను ఏర్పాటు చేయాలని చెప్పారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ప్రగతి సాధించాలి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ లక్ష్యాల మేరకు అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జిల్లా కలెక్టర్లను కోరారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణంలో ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని, లబి్ధదారునికి ఎలాంటి భారం కలగకుండా చూడాలని ఆదేశించారు. భూభారతిలో నమోదైన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్లను ఆదేశించారు.
వన మహోత్సవంలో భాగంగా విరివిగా మొక్కలు నాటాలని అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో ముఖ్యకార్యదర్శులు నదీమ్, ఎన్.శ్రీధర్, దానకిషోర్, నవీన్‌మిట్టల్, యోగితా రాణా, క్రిస్టినా చొంగ్తూ, కార్యదర్శులు లోకేశ్‌కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.