
మూడు నెలల్లో రావాల్సిన మొత్తం 5 ఎల్‌ఎంటీ యూరియాలో జూన్ వరకు 1.90 ఎల్‌ఎంటీ లోటు
దేశీయ యూరియా ఇవ్వాలని కోరుతున్న రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ఓవైపు నాట్లు..మరోవైపు పత్తి, మక్కల సాగుతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ జూలై నెలలో 2.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుంది. అయితే నిండుకుంటున్న నిల్వలను చూసి వ్యవసాయ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తుంది. రాష్ట్రానికి ఈ వానాకాలం సీజన్‌లో కేటాయించిన 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాలో సగానికిపైగా విదేశాల నుంచి దిగుమతి అయిన యూరియానే కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖ కేటాయిస్తుండడం ఇబ్బందిగా మారింది. రాష్ట్రానికి కేటాయించిన యూరియాలో జూన్ వరకు 5 లక్షల మెట్రిక్ టన్నులు రావాల్సి ఉండగా, ఇందులో విదేశీ దిగుమతి యూరియా 2.60 ఎల్‌ఎంటీ.
ఇందులో 1.36 లక్షల మెట్రిక్ టన్నులు కోత విధించగా, మరో 60 వేల మెట్రిక్ టన్నుల మేర దేశీయ తయారీ యూరియాలో కోత విధించింది. ఈ నేపథ్యంలో జూలై నెలలోనైనా యూరియా కేటాయింపులు సక్రమంగా జరపాలని ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. జూలై నెల కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 1.60 మెట్రిక్ టన్నుల యూరియాలో 60 శాతం మేర 0.97 లక్షల మెట్రిక్ టన్నులు విదేశీ దిగుమతి యూరియానే ప్రభుత్వం కేటాయించింది.
దిగుమతి చేసుకునే యూరియాను నౌకాశ్రయాల ద్వారా వెంటనే సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. ఆర్‌ఎఫ్‌సీఎల్ (రామగుండం ఫెర్టిలైజర్స్, కెమికల్స్ లిమిటెడ్) కర్మాగారం నుంచి రాష్ట్ర కోటా కింద కేవలం 30,800 మెట్రిక్ టన్నులు మాత్రమే కేంద్రం పంపిస్తోంది. వ్యవసాయ శాఖ ఈ కోటాను అత్యవసర పరిస్థితుల్లో రోడ్డు మార్గంలో జిల్లాలకు పంపించుకునేందుకు వినియోగించుకుంటోంది.
కేంద్ర మంత్రి నడ్డాకు తుమ్మల లేఖ
రాష్ట్ర కోటా కింద కేటాయించిన యూరియాలో కోతలను అరికట్టి, జూలై నెలలో పూర్తిస్థాయిలో యూరియా సరఫరా చేయాలని కేంద్రమంత్రి జేపీ నడ్డాను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు ఆయన కేంద్రమంత్రికి లేఖ రాశారు. రాష్ట్రానికి విదేశీ దిగుమతి యూరియా కాకుండా దేశీయ ఉత్పత్తి ఎరువునే పంపించాలని కోరారు.
ఆర్‌ఎఫ్‌సీఎల్ నుంచి యూరియా కేటాయింపును 60,000 మెట్రిక్ టన్నులకు పెంచాలని, ఏప్రిల్–జూన్ మధ్యలో వచ్చిన లోటును పూడ్చడానికి అదనపు సరఫరా ప్రణాళిక మంజూరు చేయాలని తుమ్మల డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం యూరియా కేటాయింపుల్లో తెలంగాణ పట్ల వివక్షతో వ్యవహరిస్తుందని సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేశ్‌రెడ్డి ఆరోపించారు.