
ఈ నెలలో అప్పు కోసం మరోసారి సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం
ఈ నెలలో ఇప్పటికే రెండు విడతల్లో రూ. 7 వేల కోట్ల సమీకరణ
23న మరో రూ. 5 వేల కోట్లను సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా పొందేందుకు సన్నద్ధం
2025–26 రుణ లక్ష్యం రూ. 64,539 కోట్లలో ఇప్పటికే రూ. 41,400 కోట్ల సేకరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అప్పు కోసం మరోసారి సిద్ధమైంది. ఆర్‌బీఐ చేపట్టే సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా ఈ నెలలో ఇప్పటికే రూ. 7 వేల కోట్లు సమకూర్చుకున్న ప్రభుత్వం.. ఈ నెల 23న ఇంకో రూ. 5 వేల కోట్ల రుణం కోసం ఆర్‌బీఐకి ఇండెంట్ పెట్టింది. ఈ మొత్తం కలిపితే ఈ ఒక్క నెలలోనే రూ. 12 వేల కోట్లను ఆర్‌బీఐ ద్వారా బహిరంగ మార్కెట్ రుణాల రూపంలో రాష్ట్ర ఖజానాకు సమకూరనున్నాయి.
ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 64,539 కోట్లను బహిరంగ మార్కెట్ రుణాల రూపంలో సమకూర్చుకుంటామని ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదనల్లో పేర్కొంది. అందులో తొలి ఐదు నెలల్లో సేకరించిన రూ. 29,400 కోట్లు, ఈ నెలలో సేకరించే మొత్తం రూ. 12 వేల కోట్లు కలిపితే తొలి ఆరు నెలల కాలానికి రాష్ట్ర అప్పు రూ. 41,400 కోట్లు చేరుకుంది. అంటే ఏడాది కాలంలో తీసుకోవాల్సిన అప్పులో 65 శాతానికిపైగా ఆరు నెలల్లోనే ప్రభుత్వం తీసేసుకుంది.
గత మూడేళ్ల గణాంకాలను పరిశీలిస్తే 2023–24 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం తీసుకున్న మొత్తం అప్పు రూ. 49,618 కోట్లు. అంటే 2025–26 సంవత్సరానికిగాను ఆరు నెలల్లో తీసుకున్న దాని కంటే కేవలం రూ. 8 వేల కోట్లు అధికం. అలాగే 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ. రూ. 56,940 కోట్లను బహిరంగ మార్కెట్ రుణాల రూపంలో ప్రభుత్వం తీసుకుంది. అంటే అంతకుముందు ఏడాది కంటే రూ. 7 వేల కోట్లు ఎక్కువగా సేకరించింది.
ఇప్పడు ఆరు నెలల కాలంలోనే రూ. 41,400 కోట్లు తీసుకున్న నేపథ్యంలో ఈ ఏడాది అప్పు కనీసం రూ. 70 వేల కోట్లకు చేరుతుందనేది ఆర్థిక నిపుణుల అంచనా. అంటే గత ఏడాది కంటే ఈ ఏడాది రూ. 14 వేల కోట్ల మేర అప్పులు పెరిగే అవకాశాలున్నాయి. ఈ విధంగా ఏటేటా అప్పుల పద్దు పెరగడం ఖజానాను ఆందోళనకర పరిస్థితుల్లోకి నెడుతోంది. అప్పులు పెరిగేకొద్దీ చెల్లింపులు గుదిబండగా మారుతున్నా యని.. అయినా ప్రభుత్వ మనుగడ కోసం అప్పులు అనివార్యమవుతున్నాయని ఆర్థిక శాఖ వర్గాలే అంటున్నాయి.
