
జూన్ నాటికి రాష్ట్రానికి రావాల్సింది 5 లక్షల మెట్రిక్ టన్నులు
ఇప్పటివరకు వచ్చింది 2.19 లక్షల మెట్రిక్ టన్నులే
యూరియా కోసం మూడుసార్లు కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖలు
విదేశీ యూరియా కేటాయింపులతో సరఫరా సమస్య
మరమ్మతులతో రామగుండంలో ఆగిన ఉత్పత్తి
రెండుమూడు రోజులలో ఢిల్లీకి వ్యవసాయశాఖ డైరెక్టర్
సాక్షి, హైదరాబాద్: యూరియా కోసం అన్నదాతలు దుకాణాల ముందు క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి తప్పేలా లేదు. వానకాలం సీజన్‌కు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన యూరియాను సరఫరా చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వమే ఆందోళన వ్యక్తం చేస్తుండడంతో రైతులు దిక్కులు చూసే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరుగుతుండటంతో యూరియా కేటాయింపులు పెంచాలన్న రాష్ట్ర విజ్ఞప్తిని పట్టించుకోని కేంద్రం.. గత సీజన్‌లో మాదిరిగానే 9.80 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించింది.
ఈ మేరకు నెలవారీ సరఫరా ప్రణాళికను రాష్ట్రానికి పంపించింది. దాని ప్రకారం ఏప్రిల్ నుంచే కోటాను పంపించాలి. గత సంవత్సరం సీజన్ ప్రారంభానికి ముందే 5 లక్షల టన్నుల యూరియాను పంపింది. అదే తరహాలో ఈ ఏడాది కూడా సీజన్ ఆరంభానికి ముందే 5 ఎల్‌ఎంటీ యూరియాను నిల్వ ఉంచుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ చేసిన ప్రయత్నం ఫలించలేదు. జూన్ నాటికి రాష్ట్రానికి 5 ఎల్‌ఎంటీ యూరియా రావాల్సి ఉండగా, ఇప్పటివరకు వచ్చింది 2.19 ఎల్‌ఎంటీ మాత్రమే. మే, జూన్ నెలల్లో 3.70 ఎల్‌ఎంటీ రావాలి. కానీ, 1.14 ఎల్‌ఎంటీ కోత పడుతోందని అధికారులు తెలిపారు.
మంత్రి లేఖ రాసినా స్పందన కరువు
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆదేశంతో రాష్ట్రంలో యూరియా కొరతపై గత నెల 19న వ్యవసాయశాఖ అదనపు సంచాలకుడు విజయ్‌కుమార్ ఢిల్లీకి వెళ్లి ఉన్నతాధికారులతో చర్చించారు. జూన్‌లో కంపెనీలవారీ కేటాయింపులు జరిగే సమయంలో మే 26న మరోసారి ఢిల్లీకి వెళ్లి చర్చలు జరిపారు.
గత రెండు నెలల కేటాయింపులలో ఎక్కువభాగం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే యూరియా ఉండటం, అది సరైన సమయానికి రాకపోవడంతో సమస్య తలెత్తుతోంది. దీంతో జూన్ కోటాలో అయినా స్వదేశీ యూరియా సరఫరా చేయాలని మంత్రి తుమ్మల లేఖల ద్వారా కేంద్రాన్ని కోరారు. కేంద్రం జూన్‌లో కేటాయించిన 1.70 ఎల్‌ఎంటీలో 67 శాతం ఇంపోర్టెడ్ యూరియానే కేటాయించింది.
గత రెండు నెలల కేటాయింపులలో తక్కువగా సరఫరా చేసిన 1.14 ఎల్‌ఎంటీపై కూడా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో రెండుమూడు రోజుల్లో వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ను ఢిల్లీకి పంపిస్తున్నారు. నైరుతి రుతుపవనాలు ముందుగానే రావటంతో జూన్ వరకు కేటాయించిన మొత్తాన్ని నిర్ణీత సమయంలో సరఫరా చేయాలని కేంద్రానికి తుమ్మల మూడోసారి లేఖ రాశారు.
ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో నిలిచిన ఉత్పత్తి
రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్)లో వార్షిక మరమ్మతుల కారణంగా మే 6 నుంచి ఉత్పత్తి నిలిచిపోయింది. హీట్ ట్రాన్స్‌ఫర్ రిఫార్మర్, అమ్మోనియా పైప్‌లైన్లు, ఇతర యంత్రాల నిర్వహణ కోసం ఈ రిపేర్లు చేపట్టారు. జూన్ రెండో వారంలో ఉత్పత్తి పున:ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
గత ఏడాది ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో 11.94 ఎల్‌ఎంటీ యూరియా ఉత్పత్తి అయితే, రాష్ట్రానికి 4.68 ఎల్‌ఎంటీ సరఫరా చేసింది. మిగతాది నేషనల్ పూల్‌లో భాగంగా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసింది. ఈసారి ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఉత్పత్తి అయ్యే యూరియాను ఎక్కువగా తమకే ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరినప్పటికీ ఇంకా స్పందన రాలేదు.