
సాక్షి, హైదరాబాద్/విశాఖపట్నం: నగరంలోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో జరిగిన ఓ దారుణ ఘటన కలకలం రేపుతోంది. పిల్లలు పుట్టలేదని సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్లిన మహిళకు భర్త శుక్ర కణాలతో కాకుండా వేరే వ్యక్తి శుక్ర కణాలతో సంతానం కలిగించిన ఘటన సికింద్రాబాద్‌లో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతతో పాటు ఐదుగురు సిబ్బందిని గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి.. జడ్జి ముందు ప్రవేశపెట్టారు. కాగా, విజయవాడలో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఆగడాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. డాక్టర్ కరుణ ఆధ్వర్యంలో విజయవాడ సెంటర్ నిర్వహణ సాగిస్తుండగా, పలు కీలక విషయాలను పోలీసులు గుర్తించారు. వ్యాపార అభివృద్ధి కోసం.. బీహార్ నుంచి పూజారులను పిలిపించిన డాక్టర్ నమ్రత.. 9 రోజుల పాటు.. ఆసుపత్రిలో హోమాలు నిర్వహించినట్లు పోలీసులు నిర్థారించారు.
విశాఖపట్నంలోని పలు ఫెర్టిలిటి సెంటర్లలో పోలీసులు సోదాలు జరిపారు. మహారాణిపేట పోలిస్ స్టేషన్ పరిధిలో ఉన్న సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఇప్పటికే మేనేజర్ కళ్యాణిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కీలక రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. రెండు ఫ్లోర్‌లలో అనధికారంగా ఐవీఎఫ్ సెంటర్లు నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 2023లో లైసెన్సు ముగిసినప్పటికీ అనధికారంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
మోసం బయటపడింది ఇలా..
నగరానికి చెందిన ఓ జంట పెళ్లై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టక పోవడంతో రెండేళ్ల క్రితం సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వహిస్తున్న డాక్టర్ నమ్రతను ఆశ్రయించారు. అక్కడ ఐవీఎఫ్ ప్రక్రియ అనంతరం వారికి మగబిడ్డ పుట్టడు. అయితే ఇటీవల బాబు అనారోగ్యానికి గురికావడంతో వైద్యులను సంప్రదించారు. వివిధ రకాల పరీక్షల తర్వాత బాబుకు క్యాన్సర్ ఉందని తేలడంతో ఆ దంపతులు నిర్ఘాంతపోయారు.
తమ తల్లిదండ్రులతో పాటు కుటుంబీకులు ఎవరికీ క్యాన్సర్ చరిత్ర లేకపోవడంతో, అనుమానం వచ్చి డాక్టర్ నమ్రతను గట్టిగా నిలదీశారు. ఆమె సరైన సమాధానం చెప్పకపోవడంతో బాబుకు డీఎన్‌ఏ టెస్టులు చేయించగా.. ఆ దంపతుల డీఎన్‌ఏతో మ్యాచ్ కాలేదు. దీంతో డాక్టర్ నమ్రత తమను మోసం చేసిందని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. విషయం తెలిసి పరారీలో ఉన్న డాక్టర్ నమ్రతను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

విశాఖ కేసులో లైసెన్సు రద్దు చేసినా..
డాక్టర్ నమ్రత హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో సంతాన సాఫల్య కేంద్రాలను నిర్వహిస్తున్నారు. పదేళ్ల క్రితం విశాఖపట్నంలో పేద మహిళలకు డబ్బు ఆశ చూపి సరోగసికి ఒప్పించి, పిల్లలు లేని వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది.
డాక్టర్ నమ్రతను పోలీసులు అరెస్టు చేయడంతో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమె లైసెన్సును రద్దు చేసినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం ఇక్కడ నడుస్తున్న టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో ఇతర డాక్టర్ల లైసెన్సుల ద్వారా వైద్యం అందిస్తున్నట్లు తెలిసింది. కాగా కేపీహెచ్‌బీలోని టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్‌లో కూడా ఇలాగే అక్రమ సరోగసీ కేసు నమోదైనట్లు సమాచారం.