శ్రీరాంసాగర్‌కు పూడిక సమస్య | Sriramsagar project water storage capacity has been drastically reduced | Sakshi
Sakshi News home page

శ్రీరాంసాగర్‌కు పూడిక సమస్య

Jan 31 2025 2:13 AM | Updated on Jan 31 2025 2:13 AM

Sriramsagar project water storage capacity has been drastically reduced

భారీగా తగ్గిపోయిన నీటి నిల్వ సామర్థ్యం 

భవిష్యత్తులో ఆయకట్టు తగ్గిపోయే పరిస్థితి

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: పద్దెనిమిది లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్న బృహత్తర శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో పూడిక సమస్య భవిష్యత్తులో పెద్ద అవరోధం కానుంది. ఈ జలాశయాన్ని 1978లో 112 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించారు. తరువాత 1996లో ‘ఏపీఈఆర్‌ఎల్‌’చేపట్టిన సర్వేలో.. జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలకు పడిపోయినట్లు నిర్ధారించారు. అప్పటి నుంచి 2024 వరకు.. అదే నీటి నిల్వ సామర్థ్యాన్ని అధికారులు చూపుతూ వచ్చారు. 

తరువాత కొన్ని నెలల క్రితం జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలకు పడిపోయినట్లు నీటిపారుదల శాఖ అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం శ్రీరాంసాగర్‌ జలాశయం నీటి నిల్వ 1,091 అడుగులు, 80.5 టీఎంసీల సామర్థ్యంతో ఉంది. జలాశయంలోకి ఎగువ మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదలతో.. ఏటా 0.8 టీఎంసీల పూడిక వచ్చి చేరుతున్నట్లు ప్రాజెక్ట్‌ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 
 
ఏటా వచ్చి చేరుతున్న పూడిక.. అధికారులు చెబుతున్న లెక్కల కంటే ఎక్కువ ఉంటుందని, జలాశయంలో నీటి నిల్వ సామర్థ్యం ప్రస్తుతం చెబుతున్న లెక్కల కంటే తక్కువ ఉంటుందని భావిస్తున్నారు. నీటి నిల్వ సామర్థ్యం కేవలం 70 టీఎంసీలు ఉంటుందని వాదనలున్నాయి. అధికారులు ప్రకటించిన 80.5 టీఎంసీలపై అనేక అనుమానాలున్నాయి. 

కాగా నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతున్నప్పటికీ.. ఆయకట్టు అలాగే ఉంటోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఆయకట్టుకు సాగునీరు అందించడమనేది గగనమే అని అర్థమవుతోంది. మూడేళ్లుగా జలాశయంలోకి 70 టీఎంసీల మేర నీరు చేరగానే.. వరద గేట్ల ద్వారా గోదావరి దిగువకు నీటిని వదిలేస్తున్నారు. 

ప్రాజెక్ట్‌ జలాశయంలో పూడిక తీసివేతకు ప్రపంచంలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పూడిక తొలగించకపోతే భవిష్యత్తులో తాగునీటి ప్రాజెక్టుగానే మిగిలిపోయే పరిస్థితి తలెత్తుతుందని నిపుణులు అంటున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement