పది చోట్ల ఆటోమెటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలు
నాలుగు చోట్ల హీలియం బెలూన్లలో డ్రోన్ కెమెరాలు
30 ప్రాంతాల్లో పీటీజెడ్ కెమెరాలు
ములుగు/ఏటూరునాగారం/తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మలను దర్శించుకునే భక్తులకు పటిష్టమైన పర్యవేక్షణ, వారి కదలికలు, వాహనాల రాకపోకలను నిశితంగా గమనించేందుకు ఈ జాతరలో ఏఐ (ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్)తో కూడిన ప్రత్యేక కెమెరాలను ఏర్పాటు చేశారు. సక్సెస్ సీసీటీవీ సేల్స్ అండ్ సరీ్వస్ నిర్వాహకుడు వాసాల మహేశ్ ద్వారా పోలీసులు ఈ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆటోమెటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను (ఏఎన్‌పీఆర్) పదిచోట్ల అమర్చారు. భక్తుల రద్దీ, తొక్కిసలాట, ప్రమాదాలను ముందే హెచ్చరించి పోలీసులు, వలంటీర్లను అలర్ట్ చేస్తారు.
మేడారం జాతరకు వచ్చే ప్రత్యేక రహదారుల వద్ద వీటిని అమర్చారు. ఎస్పీ సు«దీర్ రాంనాథ్ కేకన్ ఆధ్వర్యంలో మేడారం గద్దెల పక్కనే ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్‌లో పెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్‌లను అమర్చి 24/7 నిరంతర పర్యవేక్షణ చేసేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. డీజీపీ, ఐజీ, డీఐజీలతోపాటు ఎస్పీలు సైతం ఈ కంట్రోల్ రూమ్ ఆధారంగా ప్రతినిత్యం పర్యవేక్షణ చేయనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మేడారం పర్యటనలో భాగంగా మంత్రులతో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించారు. కెమెరాల పనితీరు, పర్యవేక్షణను అధికారులు ఆయనకు వివరించారు.
ఎన్‌పీఆర్ కెమెరాలు ఎక్కడెక్కడ అంటే...
సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద రెండు, చిన్నబోయినపల్లి, కామారం ఆర్చి, బయ్యక్కపేట, పస్రా, ములుగు, కాల్వవల్లి, మేడారం జంపన్నవాగు వద్ద, బస్టాండ్ ప్రాంతాల్లో ఆటోమెటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను అమర్చారు. ఈ కెమెరాలు వాహనాల నంబర్లు, వాహనాలు, ప్రజలు ఎక్కడ ఉన్న ఎంతమంది ఉన్నారో ముఖచిత్రాలు చిత్రీకరిస్తాయి. ప్రతి వ్యక్తి ముఖచిత్రం, వీడియోలు రికార్డు అవుతాయి. రాత్రివేళలో సైతం రికార్డు అవుతుంది. ప్రతీ వాహన నంబర్ ప్లేట్ కూడా రికార్డు చేయడం దీని ప్రత్యేకత. దీని ఆధారంగా వాహనాలు ఎంట్రన్స్, ఎగ్జిట్ ఎన్ని అవుతున్నాయి.. ఎంతమంది భక్తులు వచ్చిపోతున్నారో రోజువారీగా లెక్క తెలుస్తుంది.
హీలియం బెలూన్లలో 4 డ్రోన్ కెమెరాలు
జాతరకు కొంతమంది దొంగలు, అపరిచిత వ్యక్తులు వచ్చే అవకాశం ఉండడంతో వారిని గుర్తించడానికి ఈసారి హీలియం బెలూన్‌లను నాలుగు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వాటిలో డ్రోన్ కెమెరాలను అమరుస్తున్నారు. ఈ డ్రోన్‌ల ద్వారా అప్పటికే సర్వర్‌లో అనుమానిత, అపరిచిత వ్యక్తుల వివరాలను పొందుపర్చారు. భూమి నుంచి 300 మీటర్ల ఎత్తులో ఈ హీలియం బెలూన్ డ్రోన్ కెమెరాలు ఉంటాయి. ఈ కెమెరాలు అపరిచిత వ్యక్తులు, దొంగలు రాగానే పసిగట్టి ఫొటో తీసి కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అతడి ముఖచిత్రాన్ని పంపిస్తుంది. దీంతో పోలీసులు అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకునే అవకాశాలున్నాయి.
రద్దీ ప్రాంతాల్లోనూ...
అధిక రద్దీ ఉన్న ప్రాంతాలు, వివరాల సేకరణ, ట్రాఫిక్, పార్కింగ్ మానిటరింగ్‌లతోపాటు డ్రోన్‌ల కంటే ఎక్కువ సమయం ఒకే స్థలంలో నిలిచే సామర్థ్యం ఈ హీలియం బెలూన్ కెమెరాలకు ఉంది. మేడారం జాతర భక్తుల విడిదికి అటవీ ప్రాంతాలు ఉండడంతో హీలియం బెలూన్ కెమెరాలు కంట్రోల్ రూమ్‌కు నిరంతరం లైవ్ ఫీడ్ ఇస్తాయి. దీంతో భద్రత, నిర్వహణ మరింత సమర్థవంతంగా గుర్తించే ఆస్కారముంది. ఇవేకాకుండా పీటీజెడ్ కెమెరాలు 30 ప్రాంతాల్లో అమర్చారు. ఈ కెమెరాలు 360 డిగ్రీల చుట్టూ తిరిగి చిత్రీకరిస్తాయి. సాధారణమైన ఫోర్ మెగా పిక్సల్ కెమెరాలు 450 అమర్చారు. ఇలా కెమెరాలు అమర్చడంతో ఒక్కో కెమెరా చేసే పని వందమంది పోలీసులకు సమానంగా ఉంటుంది. జాతరలో ఎటు చూసినా సీసీ కెమెరాలు ఉండడంతో పర్యవేక్షణ సులభతరంగా మారింది.
జియోట్యాగ్ బేస్డ్ మిస్సింగ్ పర్సన్స్ ట్రాకింగ్
జాతరకు మూడు కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్న క్రమంలో భక్తులెవరూ తప్పిపోకుండా చర్యలను చేపడుతున్నారు. గత జాతరలో దాదాపు 30 వేల మంది వరకు తప్పిపోయిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి జియోట్యాగ్ బేస్డ్ మిస్సింగ్ పర్సన్స్ ట్రాకింగ్’వ్యవస్థను తీసుకొస్తున్నారు. వొడాఫోన్–ఐడియా సహకారంతో ఈ విధానం అందుబాటులో ఉంటుంది. పస్రా, ఎస్‌ఎస్ తాడ్వాయి మార్గాల్లోని కౌంటర్లలో వృద్ధులు, పిల్లల వివరాలను నమోదు చేసి వారికి క్యూఆర్ కోడ్ గల జియోట్యాగ్‌లను కడతారు. దీంతో వారు ఎవరైనా తప్పిపోయినా ఈ ట్యాగ్‌ను స్కాన్ చేయటం ద్వారా వారి పూర్తి వివరాలు తెలుస్తాయి. శబరిమలలో విజయవంతమైన ఈ విధానాన్ని ఇప్పుడు మేడారంలో అమలు చేయటానికి అధికారులు రంగం సిద్ధం చేశారు.


