వ్యాక్సిన్‌ వేయించుకున్న స్పీకర్‌, శాసన మండలి చైర్మన్‌!

Speaker Pocharam Srinivas Reddy  Council Chairman Gutha Sukender Reddy Takes Covid Vaccine - Sakshi

వ్యాక్సిన్‌ వేయించుకున్నా అప్రమత్తంగా ఉండాలి

శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి సూచన

నిమ్స్‌లో సెకండ్‌ డోస్‌ టీకా వేయించుకున్న గుత్తా, అసెంబ్లీ స్పీకర్‌ పోచారం

హైదరాబాద్‌: కరోనా సెకండ్‌ వేవ్‌ చాలా భయంకరంగా ఉందని తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. ఈ పరిస్థితుల్లో వ్యాక్సిన్‌ తీసుకున్నప్పటికీ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.బుధవారం నిమ్స్‌లో కరోనా వ్యాక్సిన్‌ రెండవ డోస్‌ను వేయించుకున్నారు. ఆయనతో పాటు సభాపతి సతీమణి పుష్ప, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, ఆయన సతీమణి అరుంధతిలు కూడా టీకా వేయించుకున్నారు. వీరంతా మార్చి 3న కోవిడ్‌ టీకా మొదటి డోస్‌ వేయించుకున్నారు. కార్యక్రమంలో నిమ్స్‌ డైరెక్టర్‌ కె.మనోహర్, నిమ్స్‌ డిప్యూటీ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లక్ష్మీ భాస్కర్, లెజిస్లేటివ్‌ సెక్రటరీ డా. వి.నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ... కరోనా వ్యాక్సిన్‌ విషయంలో అపోహలు వద్దని..టీకా వేసుకోవడం అన్ని విధాలుగా శ్రేయస్కరమని చెప్పారు. ఇప్పుడు రెండో డోస్‌గా కొవాగ్జిన్‌ను తీసుకున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నియమనిబంధనలకు అనుగుణంగా 45 ఏళ్లు పూర్తయిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలన్నారు. అయితే కరోనా వైరస్‌ మళ్లీ ప్రబలుతున్న తరుణంలో ప్రభుత్వం సూచించిన విధంగా ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. మాస్కు లేకుండా ఎవరు కూడా బయటకు రాకూడదన్నారు. మాస్క్‌ ధరించకపోతే రూ.1,000 జరిమానా, 2 ఏళ్ల కారాగార శిక్ష విధిస్తారన్నారు. ఈ కఠిన నిబంధనలు ప్రజల మేలు కోసమేనని, ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలన్నారు. కరోనాను కట్టడి చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రశంసనీయమన్నారు. దేశ సగటు కంటే తెలంగాణ రాష్ట్రంలో కరోనా మరణాలు అతి తక్కువ శాతంలో ఉన్నాయని చెప్పారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top