పల్లెకొచ్చిన సాఫ్ట్‌వేర్‌..!

Software Employees Perform Their Job Duties From villages Due To Corona - Sakshi

లాక్‌డౌన్‌తో స్వగ్రామాలకు టెకీలు

పల్లెబాట పట్టిన వేలాదిమంది ఉద్యోగులు

వర్క్‌ఫ్రంహోంతో ప్రాజెక్టు పనులు పూర్తి  

వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు చేదోడుగా..

సాక్షి, కోటపల్లి(చెన్నూర్‌): కరోనా మనిషి జీవన విధానంలో పెనుమార్పులు తీసుకొచ్చింది. ఊహించని పరిణామాలు రోజువారీ జీవితంలోకి వచ్చిచేరాయి. ప్రధానంగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ కలిసొచ్చింది. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కార్యాలయాలను మూసివేశారు. దీంతో వేలాదిమంది టెకీలు సొంత ఊళ్లకు చేరి ఇంటి నుంచే విధులు నిర్వర్తిసున్నారు. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతూ ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తున్నారు. కరోనా దెబ్బకు సాఫ్ట్‌వేర్‌ రంగం నగరాల నుంచి పల్లెటూరు చేరడంతో వర్క్‌ ఫ్రం ఆఫీస్‌ కాస్తా వర్క్‌ ఎట్‌ హోంగా మారింది. అద్దాల మేడలు, ఏసీ గదులు వదిలి ఉద్యోగులు పచ్చని పల్లెలకు చేరుకున్నారు.

కొందరు ఇంట్లో ఉంటూ పనిచేస్తుండగా మరికొందరు పంట పొలాల మధ్య కూర్చుని విధులు నిర్వర్తిస్తున్నారు. వారాంతంలో మాత్రమే భార్యపిల్లలతో గడిపేవాళ్లు లాక్‌డౌన్‌ పుణ్యమా అని మొత్తం కుటుంబంతో కలిసి ఉంటునే హాయిగా పనిచేసుకుంటున్నారు. చిన్ననాటి స్నేహితులతో కబుర్లు చెప్పుకొంటూ కంప్యూటర్లలో వర్క్‌ కానిచ్చేస్తున్నారు. పట్నం, పల్లె అనే తేడా లేకుండా ప్రతిచోటా ఇంటర్నెట్‌ సదుపాయం ఉండటంతో ఇంటి నుంచి పనిని సులభం చేసింది. లాక్‌డౌన్‌తో హైదరాబాద్, ముంబయి, చెన్నై, బెంగళూరు వంటి మహా నగరాల నుంచి జిల్లాకు దాదాపు 10వేల మందికి పైగా వచ్చి సొంతూళ్లలో పనిచేసుకుంటున్నారని అంచనా. (‘వర్క్‌ ఫ్రం హోం’ కోసం తెగ సెర్చింగ్‌!)

పొలం పనులతో పాటు ప్రాజెక్టు వర్క్
సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు గ్రామగ్రామన ఇంటర్నెట్‌ సదుపాయం ఉండటం కలిసివచ్చింది. వ్యవసాయ సీజన్‌ కావడంతో కొందరు పొలాల వద్దకు ల్యాప్‌టాప్‌లు తీసుకెళ్లి అటుపొలం పనులు, ఇటు కంపెనీ ఇచ్చిన ప్రాజెక్టు వర్క్‌ కానిచ్చేస్తున్నారు. కార్యాలయాల్లో ఎలాగైతే సమావేశాలు నిర్వహించుకున్నారో ఇప్పుడూ అలాగే వీడియో కాలింగ్‌లో గ్రూప్‌ డిస్కషన్స్‌ నడుస్తున్నాయి. వాట్సప్, స్కైప్, జూమ్, ఫేస్‌బుక్‌లలో వీడియో కాలింగ్స్‌తో టచ్‌లోకి వస్తున్నారు. కొన్నిసంస్థలకు సొంత యాప్స్‌ ఉండటం కలిసి వచ్చింది. టీం లీడర్స్‌ ఎప్పటికప్పుడు ప్రాజెక్టుల గురించి చెబుతూ సూచనలు చేస్తున్నారు. 

పల్లెల్లో టెకీల సందడి
సామాన్యంగా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ల వృతి అనుక్షణం కత్తిమీద సాములా ఉంటుంది. మానసిక ఒత్తిడికి గురవుతూ ప్రాజెక్టు వర్క్‌ చేస్తుండడంతో నిత్యం ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. రోజూ నాలుగు గోడల మధ్య ల్యాప్‌టాప్‌లపై, డెస్క్‌టాప్‌లపై కోడింగ్‌తో కుస్తీ పట్టే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లకు కరోనా వైరస్‌ మూలంగా కొంగొత్త అనుభూతి వచ్చింది. ఐటీ ఉద్యోగుల్లో సగానికిపైగా గ్రామీణ నేపథ్యం నుంచి మహానగరాలకు వెళ్లిన వారే ఉన్నారు. ఇప్పుడు వారంతా స్వస్థలాలకు చేరుకున్నారు. నాలుగు నెలలుగా సాగుతున్న వర్క్‌ ఫ్రం హోంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒత్తిడికి దూరంగా ఉంటూ పనిచేసుకుంటున్నారు.

ప్రశాంత వాతావరణంలో..
నేను హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ కంపనీలో ఉద్యోగం చేస్తున్నా. కరోనా కారణంగా ఆఫీసు వారు ఇంటివద్దే ఉండి పనిచేయాలని సూచించారు. గతంలో క్షణం తీరిక లేకుండా రోజు గడిచిపోయేది. ఇప్పుడు ఖాళీ సమయం దొరుకుతోంది. తీరిక వేళల్లో కుటుంబం, స్నేహితులతో గడుపుతున్నా. ప్రశాంత వాతావరణంలో పనిచేసుకుంటున్నా.
– దర్వాజ మౌనిక, వేంపల్లి, మంచిర్యాల

స్నేహితుల మధ్య ఆనందంగా..
కరోనా కారణంగా ఆఫీసు వారు ఇంటి వద్దే ఉండి చేయాలని సూచిస్తున్నారు. గతంలో క్షణం తీరిక లేకుండా రోజు గడిచిపోయేది. ఇప్పుడు ఖాళీ సమయం దొరుకుతున్నది. తీరిక వేళల్లో కుటుంబం, స్నేహితులతో గడుపుతున్నా. రోటీన్‌కు భిన్నంగా రోజులు గడిచిపొతున్నాయి. ఆఫీస్‌ వారు ఇచ్చిన అసైన్‌మెంట్‌ పూర్తి చేస్తూ.. కుటుంబం, స్నేహితుల మధ్య ఉండటం ఆనందంగా ఉంది. మూడు నెలలుగా ఇంటి వద్ద ఉండి పనిచేస్తున్నా. ప్రశాంత వాతావరణంలో పని చేసుకుంటున్నా. – మేడం శ్రీధర్, కిష్టంపేట

మరిచిపోలేని రోజులు
నేను 9నెలలుగా హైదరాబాద్‌లోని ఓ కంపనీలో సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నా. లాక్‌డౌన్‌తో సొంత ఊరికి వచ్చి వర్క్‌ప్రం హోంలో భాగంగా విధులు నిర్వహిస్తున్నా. తీరిక సమయంలో వ్యవసాయ పనుల్లో మానాన్నకు సహాయపడుతున్నా. స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడపడం జీవితంలో మరిచిపోలేని రోజులుగా మిగిలిపోతాయి. – ప్రకాశ్, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్, ఆలుగామ

ఆనందంగా ఉంది
నేను హైదరాబాద్‌లోని ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపనీలో పనిచేస్తున్నా. మార్చిలో ఇంటికి వచ్చాను. కరోనా వైరస్‌ వల్ల లాక్‌డౌన్‌ ప్రకటించారు. అప్పటి నుంచి ఇంటి వద్ద నుంచి పనిచేసుకుంటున్నా. ప్రశాంత వాతవరణంలో హాయిగా ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి ఉంటూనే విధులు నిర్వహించడం ఆనందంగా ఉంది. – విజయ్, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్, అన్నారం

పదేళ్ల తర్వాత కుటుంబసభ్యులతో..
వర్క్‌ఫ్రం హోంతో పదేళ్ల తర్వాత కుటుంబసభ్యులతో కలిసి ఉండటం ఆనందంగా ఉంది. మార్చి 22నుంచి ఇంటివద్దే పనులు చేస్తున్నాం.ప్రశాంత జీవితంలో పనిచేయడం మరిచిపోలేని అనుభూతి.  ఎక్కువ పనిగంటలు ఉన్నా.. అలసట లేకుండా చేస్తున్నాం.   –పనకంటి కపిల్, కోటపల్లి

ఇంటినుంచే ఆఫీస్‌ పని
నేను సంవత్సరం నుంచి ఆదిత్య బిర్లా సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నా. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో ఇంటి వద్దే ఉంటూ ఆఫీస్‌ పనిచేయడం ఆనందంగా ఉంది. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఇంటిల్లి పాదితో కలిసి ఆవకాశం దొరకలేదు. బిజిబిజీగా ఉండే నాకు కరోనా సమయంలో ఇంటినుంచి పని చేసే ఆవకాశం రావడంతో ఇక్కడి నుంచే ఆఫీసు పనులు చేస్తున్నా.  – ముల్కల్ల చేతన్‌రెడ్డి, షట్‌పల్లి   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top