రూ.5 వేల కోట్ల స్కామ్‌కు స్కెచ్‌! | Sketch for a Rs 5000 crore scam | Sakshi
Sakshi News home page

రూ.5 వేల కోట్ల స్కామ్‌కు స్కెచ్‌!

Jun 12 2026 3:33 AM | Updated on Jun 12 2026 3:33 AM

Sketch for a Rs 5000 crore scam

ఈసారి ఇగ్నైట్‌ రూపంలో వచ్చిన క్యూనెట్‌ కంపెనీ

రిజిస్టర్‌ చేసిన 18 రోజుల్లోనే కనిపెట్టిన సిటీ పోలీసులు

నాలుగు రాష్ట్రాల్లో దాడులు.. ఆరుగురి అరెస్టు

హైదరాబాద్‌ సీపీ సజనార్‌ వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: గోల్డ్‌క్వెస్ట్, క్వెస్ట్‌నెస్ట్, క్యూనెట్‌–విహాన్‌ డైరెక్ట్‌ సెల్లింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేర్లతో దేశ వ్యాప్తంగా 25 ఏళ్లు మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ దందా చేసి, లక్షల మంది నుంచి రూ.వేల కోట్లు కాజేసిన సంస్థ ఈసారి ఇగ్నైట్‌ పేరుతో వచ్చింది. చండీగఢ్‌లోని ఆర్వోసీ (రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌)లో ‘ఇండి కనెక్ట్‌ వెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో గత నెల 18న రిజిస్టర్‌ చేసుకుని, డైరెక్ట్‌ సెల్లింగ్‌ పేరుతో రూ.5 వేల కోట్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా కుట్ర పన్నింది.

ఇది రిజిస్టరైన 18 రోజులకే మూలాలు కనిపెట్టిన హైదరాబాద్‌ పోలీసులు నాలుగు రాష్ట్రాల్లో దాడులు చేసి ఆరుగురు కీలక నిందితు లను అరెస్టు చేసినట్లు కొత్వాల్‌ విశ్వనాథ్‌ చన్నప్ప సజ్జనార్‌ తెలిపారు. అదనపు, సంయుక్త సీపీలు ఎం.శ్రీనివాసులు, ఎస్‌.చైతన్యకుమార్, ఎస్‌ఎం విజయ్‌కుమార్‌లతో కలిసి తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. 

హాంగ్‌కాంగ్‌ కేంద్రంగా..
ఇగ్నైట్‌ హాంగ్‌కాంగ్‌ కేంద్రంగా నడుస్తోంది. దీని వ్యవస్థాపకుడు తమిళనాడు గోల్డ్‌క్వెస్ట్‌ కేసులో ప్రధాన నిందితుడు, ఇగ్నైట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అడ్లీ హసన్‌ గతంలో క్యూనెట్‌ సంస్థ తరఫున పని చేశాడు. ఇందులో పని చేస్తున్న వాళ్లూ క్యూనెట్‌కు సంబంధించిన వాళ్లే. కంపెనీ అధికారికంగా రిజిస్టర్‌ కావడానికి తొమ్మిది రోజుల ముందే దాని వెబ్‌సైట్‌ డొమైన్‌లో రిజిస్టరైంది. 

ఈ సంస్థ చర్మాన్ని బిగుతుగా మార్చి యవ్వనంగా కనిపించేలా చేస్తుందని చెప్పే ‘సిమెట్రా’ అనే అయస్కాంత పెన్, శరీరంలో శక్తిని సమతుల్యం చేస్తుందని నమ్మించే ‘యాక్టివా’ అనే చతురస్రాకార గాజు ముక్క, భారతీయ రిటైల్‌ మార్కెట్లో రూ.600 కంటే తక్కువ ధరకే లభించే ఎలక్ట్రిక్‌ టూత్‌బ్రష్‌ ’బ్రష్‌–ఓ’లను విక్రయిస్తోంది. గరిష్టంగా రూ.వెయ్యి ఉండే వీటిని 680 అమెరికన్‌ డాలర్లకు (సుమారు రూ.60 వేలు) విక్రయిస్తున్నారు. తమ సంస్థలో చేరాలంటూ ఆన్‌లైన్‌లో ప్రచారం చేస్తున్న ఇగ్నైట్‌ జూమ్‌ మీటింగ్‌ల ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తోంది. 

నగరవాసుల ఫిర్యాదుతో..
ఇగ్నైట్‌ మాటలు నమ్మి రూ.1.87 లక్షలు మోసపోయిన ముగ్గురు పంజగుట్ట, ఎస్సార్‌నగర్, కాచిగూడల్లో ఫిర్యాదు చేశారు. ఈ ముగ్గురిలో ఒకరిని ఆఫ్రికాకు చెందిన వాట్సాప్‌ నంబర్‌ ద్వారా, మరొకరిని జూమ్‌ ప్రెజెంటేషన్, ఇంకొకరిని హైదరాబాద్‌ సెంట్రల్‌ మాల్‌లో ముఖాముఖిగా కలిసి నమ్మించారు. ముగ్గురు చెల్లించిన డబ్బు మాత్రం ఒకే బ్యాంకు ఖాతాలోకి వెళ్లింది. 

కోల్‌కతాలోని భవానీపూర్‌ శాఖకు చెందిన ‘పారస్‌నాథ్‌ మెర్కంటైల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’కు చేరింది. అలా వచ్చిన సొమ్ము అట్నుంచి బెంగళూరుకు చెందిన జ్ఞానేష్‌ పీఎన్‌ అనే వ్యక్తికి, ఆపై ఢిల్లీ, చండీగఢ్‌లకు బదిలీ అవుతోందని గుర్తించారు. అక్కడ నుంచి హవాలా మార్గంలో మలేసియాకు తరలించి, ఆపై ఆఫ్రికా ద్వారా ఈ నిధులను యూఎస్‌డీటీ క్రిప్టో కరెన్సీ రూపంలోకి మారుస్తున్నారు. చివరగా ఏడో దశలో ఈ సొమ్ము హాంగ్‌కాంగ్‌లోని ఇగ్నైట్‌ ప్రధాన నిర్వాహకుల ఈ–వాలెట్‌కు చేరుకుంటోంది.

ఇది వ్యవస్థీకృత నేరమని నిర్థారించిన పోలీసులు ఈ మూడు కేసుల్నీ సీసీఎస్‌కు బదిలీ చేశారు. ఏసీపీలు నర్సింహారెడ్డి, హరీశ్‌ లోతుగా దర్యాప్తు చేసి కేరళ, వెస్ట్‌ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో సిబ్బందితో దాడులు చేశారు. ఒనియల్‌ గుప్తా (ఇగ్నైట్‌ టీమ్‌ లీడర్‌ / రిక్రూటర్‌), దినేశ్‌ కుమార్‌ సాహిల్‌ (డైరెక్టర్‌), ప్రియాన్షు సక్సేనా (డైరెక్టర్‌), ప్రవీణ్‌ కుమార్‌ దకాలియా (డైరెక్టర్‌), పరితోష్‌ కుమార్‌ దకాలియా (డైరెక్టర్‌), రియాజ్‌ (ఫీల్డ్‌ రిక్రూటర్‌)లను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement