రూ.21 వేల కోట్లతో సీతారామ–సీతమ్మసాగర్‌! | Sakshi
Sakshi News home page

రూ.21 వేల కోట్లతో సీతారామ–సీతమ్మసాగర్‌!

Published Thu, May 18 2023 2:53 AM

Sitarama Seethammasagar with Rs 21 thousand crores - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్మిస్తున్న సీతారామ ఎత్తిపోతల– సీతమ్మసాగర్‌ ఉమ్మడి ప్రాజెక్టు విస్తరణలో భాగంగా కొత్తగా ఇల్లందు కాల్వను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సవరించిన సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను అనుమతుల కోసం తాజాగా ఢిల్లీలో కేంద్ర జల సంఘాని (సీడబ్ల్యూసీ)కి సమర్పించింది.

రూ.13,700 కోట్ల అంచనాలతో సీతారామ ఎత్తిపోతల పథకం, రూ.5,200 కోట్ల అంచనాలతో సీతమ్మసాగర్‌ బ్యారేజీ, రూ.2,200 కోట్ల అంచనా వ్యయంతో ఇల్లందు కాల్వ కలిపి మొత్తం రూ.21,100 కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నట్టు డీపీఆర్‌లో ప్రభుత్వం ప్రతిపాదించింది.  

1.13 లక్షల కొత్త ఆయకట్టు 
సీతారామ ఎత్తిపోతల ద్వారా సాగునీరు అందని ఎగువ ప్రాంతాల్లోని 1.13 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించడానికి ఇల్లందు కాల్వను నిర్మించనున్నారు. ఇల్లందు నియోజకవర్గానికి అధిక ప్రయోజనం కలగనుండగా, మధిర, డోర్నకల్, మహబూబాబాద్‌ నియోజకవర్గాలకు సైతం ప్రయోజనం చేకూరనుంది. 6.74 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో సీతారామ ఎత్తిపోతలను నిర్మిస్తుండగా, కొత్తగా ప్రతిపాదించిన ఇల్లందు కాల్వతో సీతారామ ప్రాజెక్టు కింద మొత్తం ఆయకట్టు 7.84 లక్షల ఎకరాలకు పెరగనుంది.  

సీడబ్ల్యూసీకి రెండో సవరణ డీపీఆర్‌ 
విద్యుదుత్పత్తి అవసరాలకు 37 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో చేపట్టిన సీతమ్మ బ్యారేజీ పనులు 70 శాతం పూర్తయ్యాయి. 70.4 టీఎంసీల గోదావరి జలాల తరలింపునకు చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పనులు సైతం 55 శాతం వరకు పూర్తయ్యాయి. దీనికి దాదాపుగా అన్ని రకాల అనుమతులను ఇప్పటికే సీడబ్ల్యూసీ ఇచ్చేయగా, అపెక్స్‌ కౌన్సిల్‌ తుది అనుమతులు ఇవ్వాల్సి ఉంది. సీతమ్మసాగర్‌ బ్యారేజీ నుంచే సీతారామ ఎత్తిపోతలకు నీళ్లను తరలిస్తున్న నేపథ్యంలో బ్యారేజీని సైతం సీతారామ ఎత్తిపోతల పథకంలో కలిపేసి ఒకే ప్రాజెక్టుగా అనుమతులు పొందాలని గతంలో సీడబ్ల్యూసీ సూచించింది.

పర్యావరణ అనుమతుల కోసం రెండు ప్రాజెక్టులను కలిపేసి ఒకే ప్రాజెక్టుగా కేంద్ర పర్యావరణ శాఖకు ప్రతిపాదనలు సమర్పించిన రాష్ట్ర ప్రభుత్వం.. సీడబ్ల్యూసీకి వేర్వేరు ప్రాజెక్టులుగా ప్రతిపాదించడం పట్ల అప్పట్లో అభ్యంతరం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో రెండు ప్రాజెక్టులను కలిపేసి ఒకే ప్రాజెక్టుగా ప్రతిపాదిస్తూ మళ్లీ సీడబ్ల్యూసీకి నాలుగు నెలల కింద రాష్ట్ర ప్రభుత్వం కొత్త డీపీఆర్‌ను సమర్పించింది. తాజాగా ఇల్లందు కాల్వ నిర్మాణం పనులను సైతం డీపీఆర్‌లో చేర్చి సవరించిన డీపీఆర్‌ను మరోసారి సీడబ్ల్యూసీకి ఇచ్చింది.

ప్రాజెక్టుకు అనుమతుల ప్రక్రియ చివరి దశలో ఉందని, మరో నెల రోజుల్లో సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలోని టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) ముందుకు డీపీఆర్‌ వెళ్లే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి. గోదావరిలో సీతారామ–సీతమ్మసాగర్‌ ప్రాజెక్టుకు నీటి లభ్యతతోపాటు పలు సందేహాలను వ్యక్తం చేస్తూ ఇటీవల గోదావరి బోర్డు సీడబ్ల్యూసీకి లేఖ రాసింది. సీతారామ ప్రాజెక్టుకు ఇప్పటికే సీడబ్ల్యూసీ నుంచి హైడ్రాలజీ అనుమతులు లభించిన నేపథ్యంలో గోదావరి బోర్డు లేఖతో ఇబ్బందులు ఉండవని అధికారవర్గాలు చెబుతున్నాయి.  

Advertisement
Advertisement