కొనసాగుతున్న సిట్‌ విచారణ | SIT Investigation In Moinabad Farm House Drugs Case: Telangana | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న సిట్‌ విచారణ

Mar 21 2026 4:43 AM | Updated on Mar 21 2026 4:43 AM

SIT Investigation In Moinabad Farm House Drugs Case: Telangana

నాలుగో రోజూ డ్రగ్స్‌ పార్టీ కేసు నిందితులను విచారించిన అధికారులు 

కస్టడీ పిటిషన్‌ తీర్పు సోమవారానికి వాయిదా

మొయినాబాద్‌/శంషాబాద్‌ రూరల్‌: ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సిట్‌ అధికారుల విచారణ కొనసాగుతోంది. నాలుగో రోజు శుక్రవారం శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో సిట్‌ అధికారులు నిందితులను విచారించారు. స్టేషన్‌ బెయిల్‌ పొందినవారిలో ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్‌యాదవ్‌ మినహా మిగిలిన ఏడుగురు అర్జున్‌రెడ్డి, కౌశిక్‌ రవి, శరత్‌కుమార్, విజయ కృష్ణ, రమేష్, శ్రావణ్‌కుమార్, ప్రియాంకరెడ్డి విచారణకు హాజరయ్యారు.

సిట్‌ అధికారులు ఒక్కొక్కరిని వేర్వేరుగా విచారించి వారి నుంచి డ్రగ్స్‌కు సంబంధించిన వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్‌ యాదవ్‌ లోక్‌సభ సమావేశాలు ఉన్నందున వచ్చే నెల 4 వరకు విచారణకు హాజరు కాకుండా మినహాయింపు తీసుకున్నారు. ఎంపీతోపాటు జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి, రితీష్ రెడ్డి, నమిత్‌ శర్మలను కస్టడీకి తీసుకొని విచారిస్తేనే ఈ కేసులో అసలు విషయాలు బయటకొస్తాయని ఓ పోలీసు అధికారి తెలిపారు. 

శంషాబాద్‌కు సీపీ సు«దీర్‌బాబు
డ్రగ్స్‌ కేసు విచారణను ఫ్యూచర్‌ సిటీ కమిషనర్‌ సుధీర్‌బాబు పరిశీలించారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన శంషాబాద్‌ పీఎస్‌కు చేరుకొని సిట్‌ అధికారులతో చర్చించారు. డ్రగ్స్‌ సరఫరా ఎక్కడి నుంచి జరుగుతోంది. పెడ్లర్లు ఎక్కడి నుంచి తెచ్చి ఎవరికి విక్రయిస్తున్నారనే విషయాలను రాబట్టాలని సూచించారు. ఈ వివరాలు తెలిస్తేనే డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టు రట్టు చేయొచ్చని పోలీసులు భావిస్తున్నారు.  

మరోసారి వాయిదా.. 
డ్రగ్స్‌ పార్టీలో గన్‌ ఫైరింగ్‌ చేసి జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, అతని తమ్ముడు రితీష్‌రెడ్డి, ఢిల్లీకి చెందిన రియల్‌ వ్యాపారి నమిత్‌ శర్మలను ఏడు రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వాలని పోలీసులు ఈ నెల 17న రాజేంద్రనగర్‌ కోర్టులో కస్టడీ పిటిషన్‌ వేశారు. దీనిపై 18న కోర్టులో వాదనలు జరిగాయి. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును 20కి వాయిదా వేసింది. 20న శుక్రవారం కోర్టుకు సెలవు ఉండటంతో తీర్పు సోమవారానికి వాయిదా పడింది.

పాత రికార్డుల పరిశీలన
వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌ను సీజ్‌ చేసే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు ఫాంహౌస్‌ భూమికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని రెవెన్యూ అధికారులను కోరినట్టు తెలిసింది. రెవెన్యూ అధికారులు సైతం ఫాంహౌస్‌ భూమికి సంబంధించిన రికార్డుల దుమ్ము దులుపుతున్నారు. అజీజ్‌నగర్‌ సర్వేనంబర్‌ 177/33లోని 2.20 ఎకరాల్లో రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌ ఉంది. 2006లో రోహిత్‌రెడ్డి తండ్రి విఠల్‌రెడ్డి పేరుతో ఈ భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఇది అసైన్డ్‌ భూమి కావడంతో రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటికీ అసైని అంతంగారి జంగయ్య పేరే వస్తోంది.

అసైన్డ్‌ భూమి ఎలా రిజి్రస్టేషన్‌ జరిగింది ? అసలు పాత రికార్డుల్లో ఎవరి పేర్లు ఉన్నాయనే విషయాలను తెలుసుకునేందుకు రెవెన్యూ అధికారులు పాత దస్త్రాలను పరిశీలిస్తున్నారు. ఫామ్‌హౌస్‌ను సీజ్‌ చేయాల్సి వస్తే న్యాయపరమైన చిక్కులు రాకుండా పాత రికార్డులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఫామ్‌హౌస్‌ను సీజ్‌ చేయాల్సి వస్తే అసైన్డ్‌ భూముల్లో ఉన్న మిగతా ఫామ్‌హౌస్‌లు, కబ్జాదారులపైనా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీనిని కూడా దృష్టిలో పెట్టుకుని రెవెన్యూ అధికారులు అసైన్డ్‌ భూముల్లో ఉన్న ఫామ్‌హౌస్‌లు, నిర్మాణాలు, కబ్జాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement