ఫాంహౌస్ డ్రగ్స్ పార్టీ కేసు విచారణలో నిందితుల తీరిది
మొయినాబాద్: ఫాంహౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. శంషాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఆరో రోజు ఆదివారం సిట్ విచారణ జరిగింది. స్టేషన్ బెయిల్ పొందిన వారిలో ఏడుగురు నిందితులు విచారణకు హాజరయ్యారు. వారిని వేర్వేరుగా విచారించారు. విచారణలో కొందరు నిందితులు పొంతనలేని సమాధానాలు చెబుతుండడంతో వారిని పదేపదే విచారించి అసలు విషయాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రధానంగా డ్రగ్స్ సరఫరా, పెడ్లర్లపై దృష్టి సారించిన సిట్ అధికారులు ఆ కోణంలోనే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, అతని తమ్ముడు రితేష్‌రెడ్డి, ఢిల్లీకి చెందిన రియల్ వ్యాపారి నమిత్ శర్మను కస్టడీకి తీసుకొని విచారిస్తే కీలక విషయాలు బయటకొస్తాయని.. కేసు దర్యాప్తు వేగవంతంగా ముందుకు వెళ్తుందని పోలీసులు భావిస్తున్నారు.
కస్టడీ పిటిషన్‌పై నేడు తీర్పు
డ్రగ్స్ పార్టీ కేసులో ప్రధాన నిందితులు పైలెట్ రోహిత్‌రెడ్డి, రితేష్‌రెడ్డి, నమిత్‌శర్మ కస్టడీ పిటిషన్‌పై రాజేంద్రనగర్ కోర్టు సోమవారం తీర్పు వెలువరించనుంది. నిందితులను ఏడు రోజులు పోలీసు కస్టడీకి అనుమతివ్వాలని పోలీసులు పిటిషన్ వేయడంతో కోర్టులో వాదనలు జరిగాయి. కోర్టుకు వరుస సెలవులు ఉండటంతో కస్టడీ పిటిషన్‌పై తీర్పును వాయిదా వేసింది.


