మాస్క్‌.. సిరిసిల్ల మార్క్‌..!

Sircilla Women Stitching Colourful Face Masks to Fight COVID 19 - Sakshi

కాటన్‌ బట్టతో కలర్‌ఫుల్‌ మాస్క్‌లు

మాస్క్‌ల తయారీలో సిరిసిల్ల మహిళలు

నిత్యం ఐదు లక్షల వరకు తయారీ

హైదరాబాద్‌కు ఎగుమతి

‘‘జూకీ మిషన్‌పై మాస్క్‌లు కుడుతున్న ఈ అమ్మాయి పేరు దిడ్డి అనుప్రియ. సిరిసిల్ల పట్టణంలోని అనంతనగర్‌కు చెందిన అనుప్రియ డిగ్రీ చదివింది. ఏడాదిగా మాస్క్‌లు కుడుతోంది. నిత్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు 200 మాస్క్‌లు కుట్టగా.. ఒక్కో మాస్క్‌కు రూ.1.50 చొప్పున ఇస్తారు. ఈ లెక్కన నెలకు సగటున ఆరు వేల వరకు మాస్క్‌లు కుడుతూ.. రూ.9 వేలు సంపాదిస్తోంది. ఒక్క అనుప్రియనే కాదు.. సిరిసిల్ల కార్మిక క్షేత్రంలో మూడు వేల మంది యువతులు, మహిళలు మాస్క్‌లు కుడుతూ ఉపాధి పొందుతున్నారు.’’ 

సిరిసిల్ల: సిరిసిల్ల వస్త్రోత్పత్తి ఖిల్లా. ఇక్కడ అన్ని రకాల  వస్త్రాలు తయారు అవుతాయి. కరోనా కారణంగా గతేడాది మార్చి నుంచి మాస్క్‌ల తయారీకి శ్రీకారం చుట్టారు. 50 మంది హోల్‌సేల్‌ వ్యాపారులు నేరుగా వివిధ రంగుల్లో మాస్క్‌లను కుట్టిస్తున్నారు. నాణ్యమైన కాటన్‌ బట్టతో పాటు, మామూలు పాలిస్టర్‌ బట్టతోనూ మాస్క్‌లు కుడుతున్నారు. మెటీరియల్‌ అందిస్తూ.. జాబ్‌ వర్క్‌లాగా మహిళలు పని చేస్తున్నారు.

మూడు వేల మంది మహిళలు నిత్యం నాలుగు నుంచి ఐదు లక్షల మేరకు మాస్క్‌లు కుడుతున్నారు. నాణ్యతను బట్టి ఒక్కో మాస్క్‌ ధర రూ.6 నుంచి రూ.25 వరకు ధర ఉంటుంది. సిరిసిల్ల మాస్క్‌లకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రస్తుతం మాస్క్‌ల వాడకం తప్పని సరైంది. వినియోగం కూడా భారీగా పెరిగింది. సిరిసిల్ల నుంచి నేరుగా హైదరాబాద్‌కు ఎగుమతి చేస్తున్నారు. అక్కడి నుంచి దేశ వ్యాప్తంగా వివిధ కంపెనీలకు, వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతున్నాయి. 

కాటన్‌ మాస్క్‌లకు డిమాండ్‌  
కాటన్‌ మాస్క్‌లకు ఎక్కువ డిమాండ్‌ ఉంది. నా వద్ద 50 మంది మహిళలు జాబ్‌ వర్క్‌గా పని చేస్తారు. నేను హైదరాబాద్‌కు మాస్క్‌లు సరఫరా చేస్తాను. క్వాలిటీని బట్టి ధర ఉంది. సిరిసిల్లలో మాస్క్‌ల తయారీ భారీ ఎత్తున సాగుతోంది. మహిళలకు మంచి ఉపాధి లభిస్తుంది.
–గుంటుక కోటేశ్వర్, యజమాని, సిరిసిల్ల 

బీడీల పని కంటే బెటర్‌ 
నేను గతంలో బీడీలు చేశాను. రోజుకు 500 బీడీలు చేస్తే నెలకు రూ.1,000 నుంచి రూ.1,500 వచ్చేవి. నా భర్త సాంచాలు నడిపిస్తారు. ఇప్పుడు మాస్క్‌లు కుడుతున్న. ఏడాదిగా చేతి నిండా పని ఉంది. ఎన్ని మాస్క్‌లు కుడితే అంత కూలి వస్తుంది. నెలకు రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు వస్తుంది. బీడీల పని కంటే బెటర్‌. 
–దాసరి మాధవి, కార్మికురాలు 

నెలకు రూ.6 వేలు వస్తున్నాయి 
నేను మాస్క్‌లు, లంగాలు కుడుతూ.. నెలకు రూ.6 వేల వరకు సంపాదిస్తున్న. గతంలో నేను బీడీలు చేస్తే నెలకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు వచ్చేవి. ఇప్పుడు పని బాగుంది. ఎంత పని చేస్తే అంత కూలి వస్తుంది. నా భర్త గార్మెంట్‌ యూనిట్‌ నిర్వహిస్తాడు. ఆయనతో పాటు నేను పని చేస్తాను. 
–గాజుల జయలక్ష్మీ, కార్మికురాలు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top