దొరకని ఆచూకీ ఆగని కన్నీళ్లు | Patancher Pashamylaram Sigachi Factory Incident, Victims Families Suffering, Check Out More Details | Sakshi
Sakshi News home page

దొరకని ఆచూకీ ఆగని కన్నీళ్లు

Jul 3 2025 8:21 AM | Updated on Jul 3 2025 9:36 AM

Sigachi Factory Incident

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: అయినవారి కోసం ఆర్తనాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. సిగాచి పరిశ్రమ ఎదుట బాధిత కుటుంబసభ్యులు పడిగాపులు కాస్తున్నారు. చివరి చూపు దక్కక.. అంతిమ సంస్కారాలు సాగక దిక్కుతోచని స్థితికి గురవుతున్నారు. కనిపించిన వారినంతా.. ‘అయ్యా మా వాళ్లు ఏరీ? అంటూ దీనంగా వేడుకుంటున్నారు. ఈ పేలుడు ఘటన మిగిల్చిన విషాదం మూడు రోజులుగా కొనసాగుతుండటంతో బాధిత కుటుంబసభ్యులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఉపాధి కోసం వందల కిలోమీటర్ల దూరం నుంచి పొట్ట చేతపట్టుకుని వస్తే.. ఉపాధి దేవుడెరుగు.. ఉసురు పోయిందని బాధితులు కన్నీరు మున్నీరవుతుండటం అందరినీ కలిచివేస్తోంది. 

కుటుంబసభ్యులు మరణిస్తే వేదన అంతా ఇంతా కాదు.. మరణించాడని తెలిసి చివరి చూపు కోసం.. అంతిమ సంస్కారాలైనా చేసుకుందామంటే మృతదేహం లభించకపోతే.. ఆ శోకం రెట్టింపవుతుంది. సరిగ్గా ఇలాంటి ఆవేదనే సిగాచీ పరిశ్రమ పేలుడు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలు అనుభవిస్తున్నాయి.  తమ వారి జాడ చెప్పాలని, లేదంటే మృతదేహాన్ని అయినా అప్పగించాలని వారి కుటుంబసభ్యులు పడుతున్న యాతన అందరినీ కలిచివేస్తోంది. ఘటన జరిగిన సిగాచీ పరిశ్రమ వద్దకు తరలివస్తున్న బాధిత కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు.. తమ వారి ఆచూకీ కోసం అక్కడ ఉన్న అధికారులను వేడుకుంటున్నారు. హెల్ప్‌డెస్‌్కకు వెళ్లి ఆరా తీస్తున్నారు. మృతదేహాలను ఉంచిన పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రి మార్చురీ వద్ద అధికారులను సంప్రదిస్తున్నారు. గంటలు కాదు.. రోజులు గడుస్తున్నా తమ వారు కనిపించకపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. 

క్యాంపులో బిక్కుబిక్కుమంటూ... 
బాధిత కుటుంబాల కోసం అధికారులు పాశమైలారం ఐలా కార్యాలయం వద్ద ప్రత్యేక సహాయ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో బాధితులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తమ వారి ఆచూకీ కోసం అక్కడి హెల్ప్‌డెస్‌్కలో రక్త నమూనాలను ఇచ్చి తమ వారి మృతదేహాల కోసం వేచి చూస్తున్నారు. అధికారుల నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందోనని ఆవేదనతో వేచి చూస్తున్నారు. ఆచూకీ తెలియగానే సమాచారం ఇస్తామని అధికారులు దాటవేస్తుండటంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

స్నేహితుడి ఆచూకీ కోసం..   
పొట్టచేతపట్టుకుని ఉపాధి కోసం ఒడిశా నుంచి పటాన్‌చెరుకు వచ్చారు 28 సంవత్సరాల దీపక్‌. తన స్నేహితులతో కలిసి ఇస్నాపూర్‌లోని ఓ గదిని అద్దెకుంటున్నాడు. మూగ్గురు మూడు కంపెనీల్లో పనిచేసుకుంటున్నారు. మూడు నెలల క్రితమే దీపక్‌ ఈ సిగాచీ పరిశ్రమలో చేరారు. సోమవారం ఉదయమే పనికి వెళ్లిన దీపక్‌ ఆచూకీ లేకుండా పోయింది. దీంతో ఒక్కడే ఇక్కడ ఉండటంతో ఆయనకు సంబంధించిన కుటుంబసభ్యులు ఎవరూ ఇక్కడ లేరు. దీపక్‌తో పాటు అద్దె గదిలో ఉంటున్న తన స్నేహితులు సునాముద్దీన్, బవుజీలు ఇతర స్నేహితులు ఇప్పుడు దీపక్‌ ఆచూకీ కోసం పరిశ్రమ వద్దకు వచ్చి అధికారుల వద్ద గోడు వెల్లబోసుకున్నారు. పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రికి వెళ్లి అడిగితే అధికారుల నుంచి స్పందన లేదని సునాముద్దీన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఐలా కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సహాయక శిబిరం వద్ద కూడా ఆరా తీశారు. ఎక్కడా తన స్నేహితుడి జాడ కనిపించకపోవంతో వీరంతా తీవ్ర ఆవేదనతో కాలం వెల్లబోసుకుంటున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement