హ్యాట్సాఫ్‌ ఎస్‌ఐ: గోడెక్కిన చదువు

SI Educate Children With Wall paintings in Komaram Bheem Asifabad district - Sakshi

తిర్యాణి(ఆసిఫాబాద్‌): విద్యార్థికి, ఉపాధ్యాయులకు మధ్య కరోనా అడ్డుగోడగా నిలవగా.. అక్షరాలకు, విద్యార్థులకు మధ్య నేనున్నానంటూ ఓ ఎస్‌ఐ ముందుకు వచ్చారు. కరోనా కారణంగా బడికి తాళం పడితే, ఆయన వీధినే బడిగా మార్చారు. ఆయా గూడేల్లో ఉన్న ప్రహరీలపై అక్షరాలు, అంకెలు రాయించి వినూత్న బోధనకు శ్రీకారం చుట్టారు. గత విద్యాసంవత్సరం ప్రభుత్వం ఆన్‌లైన్‌ తరగతులకు అనుమతి ఇచ్చినా మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో చాలా గ్రామాలకు నెట్‌వర్క్‌ సిగ్నల్స్‌ లేక విద్యాబోధన సాగలేదు. తిర్యాణి మండలంలో 60 శాతానికిపైగా గ్రామాల్లో అదే దుస్థితి.

గతంలో నేర్చుకున్న అంశాలనూ విద్యార్థులు క్రమంగా మర్చిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని గ్రహించిన తిర్యాణి ఎస్సై రామారావు తన స్వంత ఖర్చుతో మండలంలోని 30 ఆదివాసీ గూడేల్లోని కూడళ్ల వద్ద గోడలపై తెలుగు, ఇంగ్లిష్‌ వర్ణమాల, గుణింతాలు, అంకెలు రాయించారు. పైతరగతి విద్యార్థులు కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ కింది తరగతి విద్యార్థులకు వీటిని నేర్పించే ఏర్పాటు చేశారు. ఆదివాసీ విద్యార్థుల కోసం పోలీసులు గోడలపై ఇలా రాయించడం అభినందనీయమని ఆయా గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హ్యాట్సాఫ్‌ ఎస్‌ఐ గారూ..!

చదవండి: Corona Vaccine: పోస్టాఫీసులో టీకా నమోదు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top