సికింద్రాబాద్, లింగంపల్లి రైల్వే స్టేషన్ల వద్ద శాస్త్రీయ అధ్యయనం
డ్రోన్లు, ఏఐ కెమెరాలతో రంగంలోకి ఐఐటీ హైదరాబాద్
ఒప్పందం చేసుకున్న ఇరు సంస్థలు
స్టేషన్ల బయటఉన్న పరిస్థితులపైనా ఫోకస్
రైల్వే–ఆర్టీసీ–మెట్రో వ్యవస్థల అనుసంధానంపైనా దృష్టి
భవిష్యత్ రద్దీకి అనుగుణంగా దిశానిర్దేశనం
ప్రభుత్వం ముందుకు రైల్వేశాఖ పరిష్కారమార్గాలు
సాక్షి, హైదరాబాద్: దాదాపు రూ.750 కోట్లతో ప్రపంచ స్థాయి స్టేషన్‌గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నా, దాని చుట్టుపక్కల నెలకొన్న అస్తవ్యస్త ట్రాఫిక్ వ్యవస్థ ప్రయాణికులను బెదరగొడుతూనే ఉంది. ప్రధాన రైల్వే స్టేషన్లపై భారాన్ని తగ్గించేందుకు విస్తరించిన లింగంపల్లి స్టేషన్‌కు నిత్యం సగటున 35 వేల మంది ప్రయాణికులు వస్తున్నా...అక్కడికి చేరుకోవడానికి ప్రయాణికులకు ఎదురవుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అత్యున్నత సాంకేతికతను ఉపయోగించి ఈ సమస్యలకు పరిష్కారమార్గాలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ముందుంచాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది.
పరిష్కార మార్గాలను కనుగొనేందుకు విశ్వసనీయ సంస్థగా గుర్తింపు పొందిన ఐఐటీ హైదరాబాద్ రంగంలోకి దిగుతోంది. ఈ రెండు కీలక స్టేషన్లలో సమ గ్ర ట్రాఫిక్ అంచనా అధ్యయనం చేపట్టేందు కు దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్, ఐఐటీ–హైదరాబాద్‌లు ఒప్పందం చేసుకున్నాయి. రైల్వేస్టేషన్ లోపలే కాకుండా స్టేషన్ చుట్టుపక్కల రోడ్లు, జంక్షన్లు, సిగ్నళ్లు, పా ర్కింగ్ ప్రాంతాలు, పాదచారుల రాకపోక లు, రైల్వే–ఆర్టీసీ–మెట్రో వ్యవస్థల అనుసంధానాన్ని కూడా అధ్యయనం చేయనున్నారు.
డ్రోన్లు.. ఏఐ కెమెరాలతో నిఘా
కేవలం క్షేత్రస్థాయి పరిశీలనతో ట్రాఫిక్ సమస్యలను అంచనా వేసే విధానానికి భిన్నంగా ఈ సారి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు. డ్రోన్ల ద్వారా వాహనాలు, పాదచారుల కదలికలను తెలుసుకోవడం, ఏఐ/మెషీన్ లెర్నింగ్ ఆధారిత సీసీటీవీ ఫుటేజీ విశ్లేషణ చేయనున్నారు. ట్రాఫిక్ సిమ్యులేషన్లు, వాహనాల రాకపోకలపై డేటా సేకరణ, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలు గుర్తించనున్నారు.
ఈ డేటా ఆధారంగా ఎక్కడ ట్రాఫిక్ ఆగుతోంది? ఎందుకు ఆగుతోంది? ఏ సమయంలో ఎక్కువ రద్దీ ఉంటోంది? వాహనాలు, పాదచారుల కదలికలను ఎలా క్రమబదీ్ధకరించాలి? అనే అంశాలకు శాస్త్రీయ పరిష్కార మార్గాలను గుర్తించనున్నారు.ఈ అధ్యయనంలో కేవలం రోడ్డు ట్రాఫిక్‌కే పరిమితం కాకుండా ప్రయాణికుల మొత్తం రాకపోకల తీరును పరిశీలించనున్నారు.
స్టేషన్ ప్రాంగణంలోకి, బయటకు వాహనాల రాకపోకలు, పాదచారుల కదలికలు, వాహనాల పార్కింగ్‌లో ఎదురవుతున్న ఇబ్బందులు, సికింద్రాబాద్ స్టేషన్ చుట్టూ ఆర్టీసీ బస్టాపులతో ఎదురవుతున్న రద్దీ, స్టేషన్ చుట్టూ ట్రాఫిక్ సిగ్నళ్లు, వాటిల్లో నెలకొంటున్న లోపాలపై సమగ్ర వివరాలు సేకరించనున్నారు.
స్టేషన్ల పునరాభివృద్ధికి అనుకూలంగా...
సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి పనులు తుది దశలో ఉన్నాయి, లింగంపల్లి స్టేషన్‌ను అమృత్‌భారత్ లో భాగంగా త్వరలో అభివృద్ధి చేయనున్నారు. ఇప్పుడు ఐఐటీ హైదరాబాద్ ఇచ్చే అధ్యయన నివేదికలోని అంశాలను స్టేషన్ల అభివృద్ధి చర్యలతో అనుసంధానించి తదనుగుణంగా ప్రణాళికల్లో మార్పులు చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. రద్దీని తగ్గించడమే కాకుండా రాబోయే సంవత్సరాల్లో పెరిగే ప్రయాణికులు, వాహనాల సంఖ్యకు అనుగుణంగా స్టేషన్ పరిసరాలను ఎలా అభివృద్ధి చేయాలన్న దానిపైనా ఈ అధ్యయనం దిశానిర్దేశం చేయనుంది. ఈ అధ్యయనం సిఫారసులు అమల్లోకి వస్తే... భవిష్యత్తులో స్టేషన్‌కు చేరుకునే సమయం తగ్గడం, వాహనాల రద్దీ తగ్గడం, మెరుగైన పార్కింగ్ నిర్వహణ, పాదచారులకు సురక్షితమైన మార్గాలు, క్యాబ్–ఆటో–బస్–మెట్రో వంటి రవాణా వ్యవస్థల మధ్య మెరుగైన అనుసంధానం పెరుగుతుంది.
ఇతర స్టేషన్లకూ విస్తరణ యోచన
ప్రస్తుత ట్రాఫిక్ సవాళ్లకు సమర్థవంతమైన, డేటా ఆధారిత పరిష్కారాలు కనుగొనడంలో ఈ అధ్యయనం కీలకంగా నిలుస్తుంది. అధ్యయనం ద్వారా లభించే పరిష్కారాలను భవిష్యత్తులో ఇతర ప్రధాన రైల్వే స్టేషన్లలోనూ అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నాం.
– డాక్టర్ ఆర్.గోపాలకృష్ణన్, సికింద్రాబాద్ డివిజన్ డీఆర్‌ఎం


