Sakshi News home page

భోరుమన్న కంటోన్మెంట్‌.. శోకసంద్రంలో అభిమానులు

Published Sat, Feb 24 2024 7:07 AM

Secbad Cantonment People Heart Break with Lasya Nanditha Death - Sakshi

కంటోన్మెంట్‌/రసూల్‌పురా:  30 ఏళ్లుగా కంటోన్మెంట్‌తో విడదీయలేని బంధం ఏర్పరుచుకున్న దివంగత ఎమ్మెల్యే సాయన్న వారసురాలిగా లాస్య నందిత అనతికాలంలోనే రాజకీయాల్లో ప్రత్యేకత చాటుకున్నారు. 2016లో కార్పొరేటర్‌గా గెలిచిన ఆమె ఐదేళ్ల పాటు సేవలందించారు. నాటి నుంచి కంటోన్మెంట్‌ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తూ తండ్రికి చేదోడు వాదోడుగా కొనసాగుతూ వచ్చారు. సోదరి నివేదితతో కలిసి తండ్రికి అండగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలోనే సాయన్న తన తర్వాత లాస్యను ఎమ్మెల్యే చేయాలని తపించేవారు. అయితే, దురదృష్టవశాత్తూ గతేడాది సాయన్న తన పదవీకాలం ముగియక ముందే మరణించారు. సాధారణ ఎన్నికలు ఏడాదిలోపే గడువు ఉండటంతో ఉప ఎన్నికలు జరగలేదు. అయినప్పటికీ సాధారణ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ లాస్యకు టికెట్‌ ఇవ్వడడంతో పోటీ చేసి గెలిచారు.  

సాయన్న టీమ్‌తో కలసిమెలసి..
దివంగత ఎమ్మెల్యే సాయన్న నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా అభిమానులను సంపాదించుకున్నారు. లాస్య ఆయా వర్గాలను కలుస్తూ వారి మద్దతును కూడదీస్తూ గత ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించారు. ప్రజాసంఘాలు, కాలనీలు, బస్తీ సంక్షేమ సంఘాలతో ప్రత్యక్ష సంబంధాలు నెరుపుతూ వచ్చారు. ఆయా ప్రాంతాల్లోని సమస్యలపై దృష్టి సారిస్తూ దశల వారీగా పరిష్కారానికి చర్యలు చేపడుతూ వచ్చారు. ముఖ్యంగా తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి సారించారు. రెండునెలల్లోనే ప్రజాక్షేత్రంలోకి చొచ్చుకుపోతుండటంతో సాయన్న వర్గీయులు ఆనందం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇంతలోనే లాస్య నందిత మృత్యువాత పడటంతో కార్యకర్తలను కలిచి వేసింది. లాస్య మృతి వార్త వెలువడగానే నియోజకవర్గ వ్యాప్తంగా సాయన్న, లాస్య అభిమానులు కార్ఖానాకు పోటెత్తారు.  

ఒకే ఒక్క బోర్డు సమావేశానికి హాజరు 
కంటోన్మెంట్‌ బోర్డులో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొంటారు. లాస్య ఎమ్మెల్యేగా గెలిచిన రెండున్నర నెలల్లో రెండు బోర్డు సమావేశాలు జరిగాయి. గత నెలలో జరిగిన సమావేశానికి మాత్రమే ఆమె హాజరయ్యారు. అమ్ముగూడ రోడ్డుకు తన నియోజకవవర్గ అభివృద్ధి నిధుల్లో రూ.1 కోటి కేటాయిస్థానని హామీ ఇచ్చారు. గత బుధవారం బోర్డు కార్యాలయానికి వచి్చన ఆమె, బోర్‌వెల్స్‌ మీటర్లు పెట్టాలన్న బోర్డు ప్రతిపాదనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంతలోనే లాస్య మృతి చెందడంపై స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.  

2015లో రాజకీయ అరంగేట్రం..
దివంగత ఎమ్మెల్యే సాయన్న 1994 నుంచి వరుసగా మూడుసార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. 2009లో తొలిసారి ఓటమిపాలయ్యారు. తిరిగి 2014లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఎనిమిది నెలల వ్యవధిలోనే 2015 జనవరిలో జరిగిన కంటోన్మెంట్‌ బోర్డు ఎన్నికల్లో నాలుగో వార్డు నుంచి లాస్య నందితను రాజకీయ ఆరంగేట్రం చేయించారు. అయితే, ఈ ఎన్నికల్లో నళిని కిరణ్‌ చేతిలో లాస్య ఓటమి పాలయ్యారు. మరుసటి ఏడాది సాయన్న టీఆర్‌ఎస్‌లో చేరగా 2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ నుంచి బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇప్పించుకున్నారు. కాగా, 1986లో సాయన్న తొలిసారిగా కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓటమిపాలైన అదే ప్రాంతం(కవాడిగూడ) నుంచి 2015లో లాస్య గెలుపొందడం విశేషం. అయితే, 2021 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మరోసారి కవాడిగూడ నుంచి పోటీ చేసి లాస్య ఓటమి పాలయ్యారు. తాజాగా 2023 నవంబర్‌ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యరి్థగా పోటీ చేసి గెలుపొందారు. 
 
అభివృద్ధి పనులపై దృష్టి.. 
గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో సాయన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే వేసవిలో నీటి ఎద్దడి ఏర్పడకుండా అన్ని వార్డుల్లో పవర్‌ బోర్‌వెల్స్‌ వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆయన మరణంతో ఆయా పనులు పెండింగ్‌లో ఉండిపోయాయి. ఈక్రమంలో ఇటీవల ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య.. రసూల్‌పురా, ఇందిరమ్మనగర్, గన్‌ బజార్, మడ్‌ ఫోర్ట్, శ్రీరాంనగర్‌ డబుల్‌ బెడ్‌రూం గృహ సముదాయం, బోయిన్‌పల్లి తదితర ప్రాంతాల్లో పవర్‌బోర్లు వేయించారు. అదేవిధంగా బొల్లారంలో శిథిలావస్థలో ఉన్న జూనియర్‌ కళశాల భవనం స్థానంలో నూతన నిర్మాణానికి ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు పయనీర్‌ బజార్, ఆదర్శనగర్‌ బస్తీల్లో రోడ్లు, డ్రైనేజీ, పవర్‌ బోర్‌వెల్స్‌ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అదే విధంగా మడ్‌ఫోర్ట్‌ అంబేడ్కర్‌ హట్స్‌లో తాగునీటి పైపులైను పనులు పూర్తిలా చర్యలు తీసుకున్నారు. మడ్‌ఫోర్ట్‌ ప్రభుత్వ పాఠశాల్లో మన ఊరు మన బడి నిధులతో అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నారు. నారాయణ జోపిడి సంఘం డబుల్‌బెడ్‌ రూం ఇళ్లు త్వరగా పూర్తి అయ్యేలా రెవెన్యూ, గృహనిర్మాణ అధికారులను ఆదేశించారు.  

మార్చురీ వద్ద విషాదఛాయలు 
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున మార్చురీ వద్దకు చేరుకుని మృతురాలి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే లాస్య నందిత.. ఆమె తండ్రి, దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్నతో తమకున్న అనుబంధాలను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. 
 
ఎమ్మెల్యే ఒంటిపై 12 తాయిత్తులు.. 
రెండుసార్లు ప్రాణాలతో బయటపడిన ఎమ్మెల్యే లాస్య నందితను మృత్యువు మూడోసారి రోడ్డు ప్రమాద రూపంలో బలి తీసుకుంది. కంటోన్మెంట్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రి ప్రారంభోత్సవ సందర్భంగా లిఫ్ట్‌లో ఇరుక్కోవడం, ఇటీవల నల్లగొండ వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు కిందపడి ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లాస్య పలు ఆలయాలు, బాబాల వద్ద ప్రత్యేక పూజలు చేయించుకొని తాయిత్తులు కట్టించుకున్నట్టు తెలుస్తోంది. గాంధీ మార్చురీలో పోస్టుమార్టం నిర్వహిస్తున్న సమయంలో మృతదేహంపై సుమారు 12 తాయిత్తులు ఉన్నట్టు వైద్యులు గుర్తించి పోలీసులకు అప్పగించినట్టు తెలిసింది.  
 
తలకు గాయం కావడంతో.. 
ప్రమాదంలో తలకు తీవ్రగాయం కావడంతోనే ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందినట్టు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో తెలిసింది. ప్రమాదంలో ఎడమకాలు విరిగిపోవడంతో పాటు దంతాలు ఊడిపోయాయి.  గాంధీ ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ హెచ్‌ఓడీ కృపాల్‌సింగ్, ప్రొఫె సర్‌ లావణ్య కౌషిల్‌ నేతృత్వంలో ఆరుగురు వైద్యబృందం పోస్టుమార్టం నిర్వహించారు.
  
ఎమ్మెల్యేల నివాళి 
గాంధీ మార్చురీలో ఉన్న ఎమ్మెల్యే లాస్య మృతదేహానికి పలువురు ఎమ్మెల్యేలు నివాళులర్పించి, కుటుంబసభ్యులను ఓదార్చారు.గాంధీ ఆస్పత్రికి చేరుకున్న వారిలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాసయాదవ్, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, బండారి లక్ష్మారెడ్డి, ముఠా గోపాల్, మర్రి రాజశేఖర్‌రెడ్డి, వాకాటి శ్రీపతి, కోవా లక్ష్మీ, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, జీహెచ్‌ఎంసీ ఫ్లోర్‌ లీడర్‌.. లింగోజిగూడ కార్పొరేటర్‌ దరిపల్లి రాజశేఖర్‌రెడ్డి తదితరులున్నారు. లాస్య అకాల మృతిపై సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావు గౌడ్‌ సంతాపం వ్యక్తం చేశారు.   

మంచి భవిష్యత్తు ఉన్న నాయకురాలు: మంత్రి కోమటిరెడ్డి
బంగారు భవిష్యత్తు ఉన్న ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో తాను దిగ్భ్రాంతికి గురయ్యానని, ఇది అత్యంత బాధకరమైన విషయమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గాంధీ మార్చురీ వద్ద లాస్య నందిత మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలకు ఆమె ఇచి్చన హామీలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్నతో తనకు 15 ఏళ్ల అనుబంధం ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement