నత్తనడకన ‘స్కాలర్‌షిప్పు’!

Scholarship And Fee Reimbursement Application Process In Slow Progress - Sakshi

నెల రోజుల్లో వచ్చిన దరఖాస్తులు లక్ష మాత్రమే 

అవగాహన కల్పించడంలో కాలేజీ యాజమాన్యాలు విఫలం 

రెన్యువల్‌ విద్యార్థులు 7.99 లక్షలు ఉంటారని అంచనా 

ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న వారు 1.07 లక్షలు 

సాక్షి, హైదరాబాద్ ‌: పోస్టుమెట్రిక్‌ స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కాస్త నత్తనడకన సాగుతోంది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించి నెలరోజులు గడుస్తున్నా ఇప్పటివరకు 13 శాతానికి మించి రాలేదు. డిసెంబర్‌ 31వ తేదీతో దరఖాస్తు స్వీకరణ గడువు ముగియనుంది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే నిర్దేశించిన గడువులోగా పూర్తిస్థాయి విద్యార్థులు దరఖాస్తులు సమర్పించే అవకాశం కనిపించడం లేదు. 

యాజమాన్యాల పట్టింపేది..? 
ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలకు ఏటా సగటున 12.5 లక్షల దరఖాస్తులు వస్తున్నాయి. ఇందులో రెన్యువల్‌ విద్యార్థులు 7 లక్షలకుపైగా కాగా, ఫ్రెషర్స్‌ ఐదు లక్షలమంది ఉంటున్నారు. ఈ క్రమంలో 2020–21 విద్యాసంవత్సరంలో కూడా ఇదేస్థాయిలో విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటారని అధికారులు అంచనా వేశారు. ఇందులో భాగంగా అక్టోబర్‌ 14 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

డిసెంబర్‌ 31 వరకు గడువును నిర్దేశించిన ప్రభుత్వం ఈలోగా విద్యార్థులతో దరఖాస్తులు సమర్పించేలా అవగాహన కల్పించాలని కాలేజీ యాజమాన్యాలకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటల వరకు ఫ్రెషర్స్‌ విద్యార్థుల్లో కేవలం 1,07,679 మంది మాత్రమే దరఖాస్తులు సమర్పించారు. ఈ ఏడాది 7.99 లక్షల మంది ఫ్రెషర్స్‌ ఉన్నట్లు గణాంకాలు చెబుతుండగా అందులో కేవలం 13.4 శాతం మంది మాత్రమే స్పందించారు. మరో నెలన్నర గడువు మాత్రమే ఉండగా ఆలోపు విద్యార్థులంతా దరఖాస్తు చేసుకోవడంపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థులతో ఉపకార, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేయించడంలో కాలేజీ యాజమాన్యాలదే కీలకబాధ్యత. కోవిడ్‌–19 నేపథ్యంలో ప్రస్తుతం విద్యాసంస్థలు మూతబడ్డాయి. ఈ క్రమంలో ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా విద్యార్థులతో ఫోన్‌లో సంప్రదింపులు సాగిస్తున్న యాజమాన్యాలు ఉపకార, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ దరఖాస్తులపై కూడా అవగాహన కల్పించాలని సంక్షేమ శాఖ అధికారులు సూచిస్తున్నారు. కానీ, యాజమాన్యాలు ఈ అంశాన్ని పట్టించుకోవడం లేదని, తప్పనిసరిగా దర ఖాస్తు చేసుకోవాలనే నిబంధన విధిస్తే విద్యార్థులు స్పందిస్తారని గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. 

మొదలు కాని ఫ్రెషర్స్‌ దరఖాస్తులు 
ప్రస్తుతం రెన్యువల్‌ విద్యార్థుల దరఖాస్తులు మాత్రమే స్వీకరిస్తున్నారు. ఇంకా పలు కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుండడంతో ఫ్రెషర్స్‌ విద్యార్థుల దరఖాస్తుల స్వీకరణ ఇంకా ప్రారంభం కాలేదు. ఒకట్రెండురోజుల్లో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు. కాలేజీ యాజమాన్యాలు దరఖాస్తు నమోదుపై శ్రద్ధ తీసుకోవాలని ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top