
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం పుష్కర శోభ సంతరించుకుంది. ఉదయం 5 గంటల 44 నిమిషాలకు మాధవానంద సరస్వతీ చేతుల మీదుగా మొదటి పుష్కర స్నానం లాంఛనంగా ప్రారంభమైంది. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలు మొదటిసారిగా జరుగుతున్నాయి. నేటి నుంచి మే 26 వరకు 12 రోజుల పాటు పుష్కరాలు జరుగనున్నాయి.

ఇవాళ కాళేశ్వరంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు పర్యటించారు. 17 అడుగుల సరస్వతీదేవి ఏకశిలా విగ్రహాన్ని నదీ తీరంలో సీఎం ఆవిష్కరించారు. అనంతరం సీఎంతో పాటు మంత్రుల పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సరస్వతీ నది పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం కాళేశ్వర-ముక్తీశ్వరుణ్ని దర్శించుకున్నారు. అనంతరం సరస్వతీ హారతి కార్యక్రమానికి హాజరయ్యారు.

పుష్కరాల నిర్వహణ కోసం రూ.35 కోట్లతో ఏర్పాట్లు చేశారు. తెలంగాణా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. పుష్కర ఘాట్లు, మంచినీటి వసతి, రోడ్ల మరమ్మతులు, పార్కింగ్, పారిశుధ్యానికి ప్రాధాన్యతనిచ్చిన దేవాదాయశాఖ.. ఎండల తీవ్రత ఉన్నందున టెంట్లు, పందిర్లతో భక్తులకు సకల ఏర్పాట్లు చేసింది. సరస్వతీ పుష్కరాలతో కాళేశ్వరం త్రివేణి సంగమ శోభ సంతరించుకుంది.