ఎకో ప్రెస్సింగ్... సంకల్ప దీక్షతో ముందడుగు | Sankalpa Diksha | Sakshi
Sakshi News home page

ఎకో ప్రెస్సింగ్... సంకల్ప దీక్షతో ముందడుగు

Jul 8 2024 10:23 AM | Updated on Jul 8 2024 10:23 AM

Sankalpa Diksha

సంకల్ప దీక్షతో.. అంతా సన్నద్ధమై.. ఓ మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టారు. ముందుచూపుతో మొదలైన ప్రస్థానం నేడు మహానగరాన్ని కదిలిస్తోంది. మనకు తెలియకుండానే నగరం వాయు కాలుష్యమయంగా ఎలా అవుతుందో గమనించారు. నెలకు లక్షలాది క్వింటాళ్ల బొగ్గును కేవలం నగరంలోని ఇస్త్రీ వ్యాపారులే వినియోగిస్తున్నారంటే నమ్మగలరా.. ఇలా మనం ఎంత కాలుష్యంలో బతుకుతున్నామో గమనించారా.. బొగ్గురహిత ఇస్త్రీ నగరంలో విస్తరించాలనే సదుద్దేశంతో రోటరీ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌–ది లెజెండ్స్‌ శ్రీకారం చుట్టింది. అనుకున్నదే తడవుగా ఆచరణలో పెట్టి ఇస్త్రీ వ్యాపారులకు లాభాలతో పాటు సమయం, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతోంది. ప్రాజెక్ట్‌ ‘ఎకో ప్రెస్సింగ్‌’ పేరుతో ఈ ప్రాజెక్టును మొదలు పెట్టింది. ఈ ఉద్యమం ఎలా మొదలైంది? దీనికి సహకరించినవారెవరు? వంటి విషయాలు తెలుసుకుందాం... 
– శ్రీనగర్‌కాలనీ

బొగ్గు రహిత ఇస్త్రీ ఉద్యమం మొదట బెంగుళూరులో ‘ఉద్యమ్‌ వ్యాపార్‌’ ఎన్‌జీఓతో మొదలైంది. రోడ్లపై, అపార్టుమెంట్లలో వాచ్‌మెన్స్‌గా పనిచేస్తున్న వారు బొగ్గు ఇస్త్రీపెట్టెలతో ఇస్త్రీ చేసేవారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఈ బొగ్గు ఇస్త్రీపెట్టెలతో వారికి తగ్గ ఆదాయం సమకూరేదికాదు..పైగా వాటిని ఉపయోగించేందుకు ముందస్తుగా చాలా తతంగమే చేయాలి.. పైగా బొగ్గును మండించే క్రమంలో వచ్చే పొగకు ఆరోగ్య సమస్యలు తలెత్తేవి. సమయం కూడా చాలా వృథా అయ్యేది.. ఇదంతా గమనించిన ఓ ఎన్‌జీఓ సంస్థ ఎల్‌పీజీ ఇస్త్రీ పెట్టెలను అందించి వారికి తోడుగా నిలిచింది. బెంగుళూరులో సుమారు 5వేల మందికి, చెన్నైలో 3వేల మందికి ఎల్‌పీజీ ఇస్త్రీల వాడకాన్ని నేర్పింది. ఇలా బొగ్గు రహిత నగరాలుగా చేయడానికి పూనుకుంది. 

 భాగ్యనగరంలోనూ... గ్రేటర్‌ హైదరాబాద్‌లోని రోటరీ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ ది లెజెండ్స్‌ ఫౌండర్‌ ప్రెసిడెంట్‌ మోహనవంశీ ఆలూరి చేస్తున్న సేవా కార్యక్రమాలను గమనించిన ‘ఉద్యమ్‌ వ్యాపార్‌’ దీనికి సంబంధించిన  ప్రాజెక్టును వివరించారు. ఉద్యమ్‌ వ్యాపార్‌ ప్రతినిధులు కృష్ణన్, జూహీలు నగరానికి వచ్చి వారి ప్రాజెక్ట్‌ను వివరించి, క్లబ్‌ చేస్తున్న విస్తృత కార్యమాలకు ముగ్ధులై ఈ ప్రాజెక్ట్‌ను మీ క్లబ్‌ నుండే చేయాలని తెలిపారు. దీంతో ప్రాజెక్ట్‌ ‘ఎకో ప్రెస్సింగ్‌’ ఇస్త్రీ నగరంలో మోతీనగర్‌ నుండి ప్రారంభమై నేడు సుమారు 200 మందికిపైగా ఎల్‌పీజీ ఇస్త్రీలను అందించింది.

బొగ్గు ఇస్త్రీల వల్ల నష్టాలు
మహానగరంలో సుమారు 10 వేల మంది ఇస్త్రీ వ్యాపారులు ఉన్నారు. వీరిలో అధిక శాతం మంది ఇస్త్రీలకు ప్రధాన వనరుగా బొగ్గునే వాడుతున్నారు. ఒక్కొక్కరూ రోజుకు సుమారు రెండు కిలోల బొగ్గును వాడతారు. అంటే రోజుకు సుమారు 20వేల కేజీలు.. నెలకు 6లక్షలు, సంవత్సరానికి 72 లక్షల కిలోల బొగ్గును కేవలం ఇస్త్రీ వ్యాపారులే వినియోగిస్తున్నారంటే అతిశయోక్తికాదు.. నగరంలో వాయుకాలుష్యానికి ఇది కూడా ఒక సవాలుగా మారుతోంది. 

భారీగా పెరిగిన బొగ్గు ధరలు 
దీనికితోడు బొగ్గు ఖరీదుకూడా భారీగా పెరిగింది. బొగ్గు వినియోగానికి సుమారు నెలకు 2 నుండి మూడువేల వరకూ ఖర్చు చేస్తున్నారు. ఇస్త్రీ చేసేవారికి బొగ్గు మండా లంటే సుమారు గంటకు పైగా సమయం పడతుంది. పైగా మండించే క్రమంలో వచ్చే పొగ కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. బొగ్గు మండించడానికీ సమయం వృథా అవుతోంది. అంతేకాకుండా వీటికి ఉష్ణాన్ని అదుపుచేసే విధానం ఉండదు. దీంతో కొన్నిరకాల బట్టలు త్వరగా రంగుమారడం, ప్రధానంగా దుస్తులపైనున్న లోగోలు చెడిపోవడం, ఒక్కోసారి తెల్ల చొక్కాలపై మసి అంటి మరకలు పడటం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇంతా చేస్తే చివరికి మిగిలేది నామమాత్రమే 
అని పలువురు నిర్వాహకులు వాపోతున్నారు.

ఎల్‌పీజీ, ‘ప్రాజెక్ట్‌ ఎకో’తో లాభాలు
ఎల్‌పీజీ ఇస్త్రీలతో చాలా లాభాలున్నాయి. కమర్షియల్‌ సిలిండర్‌ 19 కేజీలు రెండు నుండి మూడు నెలలు వస్తుంది. పైగా దీని ధర  రెండు వేలలోపు మాత్రమే.. బొగ్గుతో పోలిస్తే... ఖర్చు తగ్గి లాభాలతో పాటు సమయం కూడా కలిసి వస్తుంది. పర్యావరణానికి ఎటువంటి హానీ కలగదు. వినియోగదారులకు సంతోషకరమైన పనిని అందించవచ్చు. ఎందుకంటే ఇందులో ఇస్త్రీ పెట్టె ఉషో్టగ్రతలను అదుపు చేసే వెçసులుబాటు ఉంటుంది.

వినియోగం చాలా సులువు
బొగ్గు ఇస్త్రీపెట్టెల కంటే ఎల్‌పీజీ ఇస్త్రీల వినియోగం చాలా సులువైనది. త్వరగా హీట్‌ అయి హెచ్చు, తగ్గులను కంట్రోల్‌ చేసుకోవచ్చు. ఆదాయం పెరిగి సమయం కలిసొస్తుంది. ఇస్త్రీ వ్యాపారులు రోటరీ క్లబ్‌ సహకారంతో ఎల్‌పీజీని వాడి పర్యావరణాన్ని కాపాడాలి. –ధర్మ, ఇస్త్రీ వ్యాపారి, మోతీనగర్‌

ప్రాజెక్ట్‌ ‘ఎకో ప్రెస్‌’ ఇలా..
రోటరీ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ లెజెండ్స్‌ వారు ‘ఉద్యమ్‌ వ్యాపార్‌’ ఆలోచనతో ప్రాజెక్ట్‌ ‘ఎకో ప్రెస్సింగ్‌’ను ముందుకు తీసుకెళుతున్నారు. వీరికి తోడుగా రోటరీక్లబ్‌ ఆఫ్‌ మద్రాస్, రోటరీ క్లబ్‌ జూబ్లీహిల్స్, సైనిక్‌పురి, గ్లోబర్‌ విజర్డ్స్, స్మార్ట్‌ హైదరాబాద్, సంస్కార్‌ స్కూల్స్‌తో పాటు పలు సంస్థలు సహకారాన్ని అందిస్తున్నాయి. ఎల్‌పీజీ ఇస్త్రీ ఏడువేలకు పైగా ఉంటుంది. కానీ వీరు వీటిని రూ. 2,500 మాత్రమే ఇస్తున్నారు. ఇందులో వాడే ఇత్తడి మెటీరియల్‌ ఖరీదుకు మాత్రమే వారు తీసుకుంటున్నారు. బొగ్గురహిత గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా పెట్టుకున్నామని, రెండు మూడు సంవత్సరాల్లో ప్రాజెక్ట్‌ పూర్తి చేయడానికి శ్రమిస్తామని ఎకో ఇస్త్రీ మేన్‌ ఆఫ్‌ హైదరాబాద్‌గా పేరున్న మోహనవంశీ తెలిపారు.

కోల్‌ఫ్రీ ఇస్త్రీ నగరంగా... 
కాలుష్యాన్ని తగ్గించి హైదరాబాద్‌ను బొగ్గురహిత ఇస్త్రీ నిలయంగా చేయాలన్నదే మా సదుద్దేశం. ఈ ఆలోచనకు నాంది ఉద్యమ్‌ వ్యాపార్‌ సంస్థ. వారి ఆలోచనను రోటరీ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌–ది లెజెండ్స్‌ పూర్తిస్థాయిలో నెరవేర్చడానికి పూనుకున్నాం. నగరంలోని అందరికీ ఈ ఎల్‌పీజీ ఇస్త్రీపెట్టెల వినియోగంపై అవగాహన కలి్పంచి వారికి అందజేస్తాం. కోల్‌ఫ్రీ ఇస్త్రీ నగరంగా హైదరాబాద్‌ నిలుపుతాం. 
– ఆలూరి మోహనవంశీ, రోటరీక్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ ది లెజెండ్స్‌ ఫౌండర్‌ ప్రెసిడెంట్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement