ప్రభుత్వ అంచనాలకు తగ్గట్టు ఆదాయం...

Sales tax revenues are coming in line with government expectations - Sakshi

ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే 22.18 శాతం సేల్స్‌ ట్యాక్స్‌ వసూలు

గత ఏడాది తొలి మూడు నెలల్లో ఇది ఇది 9 శాతమే 

20 శాతం దాటిన ఎక్సైజ్‌ ఆదాయం.. 

గణనీయంగానే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల రాబడి 

మూడు నెలల్లో రాష్ట్ర ఖజానాకు రూ. 37,533 కోట్లు 

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అమ్మకపు పన్ను రాబడులు ప్రభుత్వ అంచనాలకు తగినట్టుగా వస్తున్నాయి. బడ్జెట్‌లో అంచనా వేసుకున్న మొత్తం సేల్స్‌ ట్యాక్స్‌ లక్ష్యంలో.. తొలి మూడు నెలల్లోనే 22.18 శాతం మేర ఖజానాకు చేరింది. ఈ మేరకు కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదికలో వెల్లడైంది. 2021–22 ఆర్థిక సంవత్సరానికిగాను అమ్మకపు పన్ను కింద రూ.26,500 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేయగా.. ఏప్రిల్, మే, జూన్‌ నెలల్లో కలిపి రూ.5,878.77 కోట్లు సమకూరినట్టు కాగ్‌ తెలిపింది. మొత్తంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్ను రాబడుల కింద రూ.1,06,900 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేయగా.. అందులో 19 శాతం అంటే రూ.20,225 కోట్లు తొలి త్రైమాసికంలో సమకూరాయి. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాíసికంలో 11.66 శాతమే ఆదాయం రావడం గమనార్హం. ఈసారి స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, జీఎస్టీ రాబడులు పెరిగే అవకాశముందని, కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంటే.. నిధుల కటకట నుంచి గట్టెక్కినట్టేనని ఆర్థికశాఖ వర్గాలు భావిస్తున్నాయి. 

ఇతర ఆదాయం కూడా.. 
► జీఎస్టీ రాబడులు కూడా గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 6 శాతం పెరిగాయి. ఆ ఏడాది జీఎస్టీ అంచనాల్లో మొదటి మూడు నెలల్లో 12.11 శాతమే సమకూరగా.. ఈసారి మొత్తం అంచనా (రూ.35,520 కోట్లు)లో 18.70 శాతం అంటే రూ.6,640.81 కోట్లు వచ్చాయి. 
► ఈసారి ఎక్సైజ్‌ రాబడులు కూడా ఆశాజనకంగానే ఉన్నాయని కాగ్‌ గణాంకాలు చెప్తున్నాయి. గత ఏడాది ఈ సమయానికి 15.82 శాతమే రాగా.. ఈసారి 20.74 శాతం వసూళ్లు జరిగాయి. అంటే ఈసారి మొత్తంగా రూ.17 వేల కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసుకోగా.. తొలి మూడునెలల్లో రూ.3,526 కోట్లు వచ్చాయి. 
► ఇక ఈసారి స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.1,668 కోట్లకుపైగా వచ్చింది. 
► కేంద్రపన్నుల్లో వాటా, ఇతర పన్నులు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ల రూపంలో రూ.6 వేల కోట్ల వరకు సమకూరాయి. 
► బడ్జెట్లో అంచనా వేసుకున్న అన్నిరకాల ఆదాయం కలిపి చూస్తే.. తొలి మూడు నెలల్లో పరిస్థితి ఆశాజనకంగానే ఉందని కాగ్‌ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. మొ త్తం ప్రభుత్వ అం చనాల్లో 17 శాతం అంటే.. రూ.37, 533 కోట్లు అందా యని పేర్కొంటున్నాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top