సమస్యల పరిష్కారానికి ‘సాక్షి’ ఓ ముందడుగు

Sakshi Initiated Work Shops In Telangana For Problems Solve

రాష్ట్రవ్యాప్తంగా ‘సాక్షి’ చర్చా వేదికలు

జూమ్‌ ద్వారా డిబేట్‌లో పాల్గొన్న ప్రముఖులు, ప్రజాప్రతినిధులు

సిద్దిపేటలో నిర్వహించిన చర్చలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు

సాక్షి, నెట్‌వర్క్‌: స్థానిక సమస్యల పరిష్కారానికి సాక్షి మీడియా గ్రూప్‌ మరో అడుగు ముందుకేసింది. అన్ని వనరులున్నా కాసింత చొరవ, ముందుచూపు లేకపోవటంతో కొనసాగుతున్న సమస్య లకు చెక్‌ చెప్పే ప్రయత్నంలో భాగంగా పౌర సమాజాన్ని, ప్రజాప్రతినిధులు, అధికారులను ఒకే వేదిక మీదకు తీసు కువచ్చింది. శుక్రవారం జూమ్‌ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా చర్చా వేదికలు నిర్వహించింది. ఆయా పట్టణాలు ఎదుర్కొంటున్న వరద ముంపు, చెత్త వంటి సమస్యల పరిష్కారం దిశగా చొరవ తీసుకుంది. పట్టణాల సమగ్ర అభివృద్ధితో పాటు కొత్త ఉపాధి అవకా శాలపై చర్చలు నిర్వహించింది.

నిరుద్యోగుల ఉపాధికి ఇండస్ట్రియల్‌ పార్కులు: హరీశ్‌రావు
సిద్దిపేటలో నిర్వహించిన డిబేట్‌లో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. ‘వలసలు. కరువుల నుంచి బయటపడి సీఎం కేసీఆర్‌ ఆశీస్సులతో సస్యశ్యామల జిల్లాగా సిద్దిపేటను మార్చుకున్నాం. సమగ్రాభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్న జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి పై దృష్టి పెట్టాం. పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన నీరు, విద్యుత్, రవాణా లాంటి వసతులను ఒక్కొక్కటిగా కల్పిస్తున్నాం. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, చేర్యాల ప్రాంతాల్లో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇండస్ట్రియల్‌ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. అందుకు వెయ్యి ఎకరాల భూసేకరణ కూడా చేశాం. పరిశ్రమలకు ప్రత్యేక లేఔట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. వర్గల్‌లో 1,200 ఎకరాల్లో స్పెషల్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లు ఏర్పాటు చేస్తున్నాం..’ అని హరీశ్‌రావు తెలిపారు.

వరంగల్‌లో ‘ముంపు’పై ముందుచూపు
గతేడాది ఇదే సీజన్‌లో భారీగా వచ్చిన వర్షాల కారణంగా వరంగల్‌ నగరంలో 33 డివిజన్లు ముంపునకు గురయ్యాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్‌లో ఇలాంటి విపత్తులు సంభవించకుండా ఉండేందుకు వీలుగా ‘వరంగల్‌ ముంపు’పై శుక్రవారం చర్చ జరిగింది. న్యాయవాది పొట్లపల్లి వీరభద్రరావు, సామాజిక కార్యకర్తలు తిరునగర్‌ శేషు, పుల్లూరు సుధాకర్, రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ విజయచందర్‌ రెడ్డి, టీఎన్‌జీఓస్‌ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్, గ్రేటర్‌ వరంగల్‌ సీఎంహెచ్‌వో రాజిరెడ్డి, గ్రేటర్‌ వరంగల్‌ డీఎఫ్‌ఓ కిశోర్‌ పాల్గొన్నారు. ప్రధానంగా వరంగల్‌ మహానగరంలో నాలాలు, గొలుసుకట్టు చెరువులు ఆక్రమణకు గురై అక్రమ నిర్మాణాలు వెలియడం వల్ల చాలా కాలనీలు ముంపునకు గురవుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమైంది. నగరంలో ఉన్న సుమారు 32 చెరువులు కుదించుకుపోగా, 12 వరకు నామరూపాలు లేకుండా పోయాయని వీరభద్రరావు, పుల్లూరు సుధాకర్‌ తదితరులు పేర్కొన్నారు. వరదలు వచ్చినప్పుడు మాత్రమే ప్రభుత్వాలు స్పందించకుండా, ఆక్రమణలపై కఠినమైన చర్యలు తీసుకోవడంతో పాటు శాశ్యత ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ముంపునకు గురికాకుండా ఏమేమి చర్యలు చేపట్టాలో వెల్లడించారు. కాగా ముంపు ప్రాంతాల్లో గతేడాది ఎలాంటి చర్యల ద్వారా ప్రజలను ఆదుకున్నారు? ఎలాంటి ముందస్తు ప్రణాళికలు చేపడుతున్నారు? తదితర అంశాలను సీఎంహెచ్‌ఓ రాజిరెడ్డి, డీఎఫ్‌ఓ కిశోర్‌ వివరించారు.

మౌలిక వసతులపైనా..
నిజామాబాద్‌ నగరంలో మౌలికవసతులు, నల్లగొండలో భూగర్భ డ్రైనేజీ, భువనగిరిలో ప్రధాన రహదారి , సంగారెడ్డిలో చెత్త డంపింగ్‌ యార్డు అంశాలపై, మహబూబ్‌నగర్‌ పట్టణంలో ట్రాఫిక్‌ రద్దీ నియంత్రణ కోసం ఉద్దేశించిన భారత్‌ మాల రహదారి నిర్మాణ అవాంతరాలపై చర్చ జరిగింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top