కేజీ టు పీజీ ఆన్‌లైన్‌ బోధనే..: మంత్రి

Sabitha Indra Reddy: Online Classes Will Start From July 1 KG To PG - Sakshi

కరోనా నేపథ్యంలో ప్రత్యక్ష బోధనకు నో

జూలై 1 నుంచి తరగతుల ప్రారంభం

రోజూ 50శాతం సిబ్బంది హాజరైతే చాలు

ఉన్నతస్థాయి సమీక్షలో విద్యాశాఖ మంత్రి సబిత

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యక్ష బోధన చేపట్టే పరిస్థితి లేదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ప్రత్యామ్నాయంగా ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు డిజిటల్, ఆన్‌లైన్‌ బోధనను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని నష్టపోకుండా ఉండేందుకు డిజటల్, ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహించనున్నట్లు చెప్పారు. విద్యా సంవత్సరం ప్రారంభం, బోధన తదితర అంశాలపై సోమవారం తన కార్యాలయంలో మంత్రి సబిత అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 3వ తరగతి, ఆపై తరగతులను... ప్రైవేటు విద్యాసంస్థల్లో ఎల్‌కేజీ నుంచి ఆన్‌లైన్‌ బోధనను జూలై 1 నుంచి ప్రారంభించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి డిజిటల్‌ పాఠాలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆన్‌లైన్‌ తరగతులకు సంబంధించి ప్రైవేటు విద్యాసంస్థలు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి సబిత ఆదేశించారు. 

ప్రభుత్వ బడులకు పాఠ్యపుస్తకాలు... 
అనంతరం సబిత మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న దాదాపు 27 లక్షల మంది విద్యార్థులకు డిజిటల్, ఆన్‌లైన్‌ బోధన అందుతుందన్నారు. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల ఇళ్లలో టీవీలు లేకపోతే గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో, గ్రంథాలయాల్లోని టీవీలను వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించామన్నారు. విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలను పాఠశాలలకు పంపిణీ చేసే ప్రక్రియ 90 శాతం పూర్తయిందన్నారు. ఏదైనా కారణం వల్ల దూరదర్శన్, టీశాట్‌ పాఠాలను వీక్షించని వారికోసం ఆ డిజిటల్‌ పాఠాలను ప్రత్యేకంగా టీశాట్‌ యాప్‌లోనూ, దూరదర్శన్‌ యూట్యూబ్‌ చానల్‌లోనూ అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. డిజిటల్‌ క్లాసులు, వర్క్‌ షీట్లను కూడా రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి వెబ్‌సైట్‌లో (https://scert.telangana.gov.in) పొందవచ్చన్నారు. 

75 వేల వాట్సాప్‌ గ్రూపులు... 
పాఠశాలల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మధ్య అనుసంధానం కోసం దాదాపు 75 వేల వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేసినట్లు మంత్రి సబిత తెలిపారు. పాఠశాల స్థాయి నుంచి డిగ్రీ వరకు ఉపాధ్యాయులు, అధ్యాపకులు విడతలవారీగా ప్రతిరోజూ 50 శాతం హాజరైతే చాలన్నారు. డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, డిప్లొమా ఫైనలియర్‌ పరీక్షలను జూలైలో నిర్వహించేలా ఆయా యూనివర్సిటీలు కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాయన్నారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి, వైస్‌ చైర్మన్లు ప్రొఫెసర్‌ లింబాద్రి, వెంకట రమణ, విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, సాంకేతిక విద్య కమిషనర్‌ నవీన్‌ మిట్టల్, పాఠశాల విద్య డైరెక్టర్‌ దేవసేన తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీ అనంతరం జూలై 1 నుంచి స్కూళ్ల ప్రారంభంపై విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు.   

చదవండి: TS Inter Results 2021: ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు విడుదల

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top