దశాబ్దంన్నర తర్వాత పల్లెల్లో మళ్లీ బస్సులు
బస చేసేలా ఆర్టీసీ ఏర్పాట్లు
గ్రేటర్ హైదరాబాద్ మినహా మిగతా ప్రాంతాల్లో కసరత్తు
కనీసం 2 వేల బస్సులకు నైట్‌హాల్ట్ డ్యూటీ
‘స్మార్ట్ షెడ్యూలింగ్’ పేరుతో భారీ కార్యాచరణ
వచ్చే నెల నుంచి కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానున్న అధికారులు
సాక్షి, హైదరాబాద్: పల్లెలకు మళ్లీ ఆర్టీసీ ‘అతిథు’లు రాబోతున్నారు. దశాబ్దంన్నర క్రితం వరకు చాలా గ్రామాల్లో రాత్రి పూట ఆర్టీసీ బస్సులు బసే చేసేవి. వాటినే నైట్ హాల్ట్ సర్వీసులుగా పేర్కొంటారు. తర్వాతి కాలంలో ఈ నైట్‌హాల్ట్ బస్సులు దాదాపు అదృశ్యమయ్యాయి. ఇంతకాలం తర్వాత మళ్లీ పాత పద్ధతిని పునరుద్ధరించాలని ఆర్టీసీ నిర్ణయించింది. గతంలోలాగా అవసరమైన పల్లెల్లో ఆర్టీసీ బస్సులు నైట్‌హాల్ట్ చేయబోతున్నాయి. కనీసం 2 వేల బస్సులను అలా ఊళ్లల్లో రాత్రి బస చేసేలా ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అప్పట్లో నైట్‌హాల్ట్ బస్సు డ్రైవర్లు, కండక్టర్లను ఊరి జనం అతిథులుగా భావించేవారు. ఇప్పుడు మళ్లీ పల్లెలకు ఆ అతిథులు రాబోతున్నారు.
మూడో వంతు బస్సులకు ‘నైట్ డ్యూటీ’...
సమీపంలోని పట్టణాలకో, ఇతర ప్రాంతాల్లో వెళ్లే ఊరి ప్రయాణికులు చివరి బస్సు సర్వీసుకు తిరిగి ఊరికి చేరుకునేవారు. ఆ బస్సు తిరిగి వెళ్లే ప్పుడు దానికి పెద్దగా ప్రయాణికులు ఉండేవారు కాదు. ఖాళీగా తిరిగి వెళ్తే టికెట్ ఆదాయం వచ్చేది కాదు, డీజిల్ రూపంలో వృథా ఖర్చు మిగిలేది. దీంతో, అలాంటి బస్సులు చివరి ట్రిప్పు తర్వాత తిరిగి డిపోనకు రాకుండా, రాత్రి చివరి గ్రామంలో బస చేసి, ఉదయం పూట ఫస్ట్ సర్వీసుగా బయలుదేరేది. ఇందుకోసం ఆది నుంచి ఆర్టీసీ తన మొత్తం బస్సుల్లో మూడో వంతు సర్వీసులను ఇలా రాత్రి బసలో ఉంచటాన్ని ఓ విధాన నిర్ణయంగా మార్చుకుంది. ఆ పద్ధతి దశాబ్దన్నర క్రితం వరకు కూడా కొనసాగింది.
ఆ తర్వాత క్రమంగా నైట్‌హాల్ట్ బస్సులు మాయమవుతూ వచ్చాయి. ప్రస్తుతం కేవలం 500 బస్సులు మాత్రమే నైట్‌హాల్ట్‌లో ఉంటున్నాయి. దూర ప్రాంతాలకు రాత్రివేళ ప్రయాణిస్తూ వెళ్లి మరుసటి రోజు తిరిగి అక్కడి నుంచి బయలుదేరే నైట్ అవుట్ సర్వీసులను కూడా నైట్‌హాల్ట్ బస్సులుగా అధికారులు పరిగణిస్తున్నారు. ఆ లెక్కన చూసినా, ఆర్టీసీలో మొత్తం ఆపరేషనల్ షెడ్యూళ్లు 6,490 (గ్రేటర్ హైదరాబాద్ పరిధి మినహా) ఉంటే అందులో నైట్ అవుట్ షెడ్యూళ్లు 1,542 మాత్రమే. అంటే మొత్తం షెడ్యూళ్లలో 23.76% మాత్రమే ఉంటున్నాయి. వీటిల్లో ఊళ్లలో నైట్‌హాల్ట్ చేస్తున్నవి కేవలం 500 మాత్రమే.
పాత పద్ధతులకు స్వస్తి పలుకుతూ..
స్మార్ట్ (ఎస్‌ఎంఏఆర్‌టీ– షెడ్యూల్ మేనేజ్‌మెంట్ అకార్డింగ్ టూ రైడర్‌షిప్ ట్రెండ్స్) షెడ్యూలింగ్ పేరుతో తాజాగా ఆర్టీసీ పెద్ద కసరత్తు చేస్తోంది. ప్రయాణికులు లేని సమయాలు, ప్రయాణికులు తక్కువగా ఉన్న ప్రాంతాలలో చాలా బస్సులు అనవసరంగా తిరుగుతూ డీజిల్, మానవ వనరుల వృథాకు కారణమవుతున్నాయని అధికారులు గుర్తించి దాన్ని సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ’మహాలక్ష్మి’ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళా ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. దాంతో పాటు పట్టణాల విస్తరణ, పారిశ్రామిక అభివృద్ధి, విద్యాసంస్థల పెరుగుదల కారణాల వల్ల ప్రయాణికుల అలవాట్లు, రద్దీ వేళల్లో గణనీయమైన మార్పులొచ్చాయి.
ఈ నేపథ్యంలో పాత పద్ధతులకు స్వస్తి పలుకుతూ శాస్త్రీయ దృక్ఫథంతో కూడిన ‘స్మార్ట్ షెడ్యూలింగ్‘విధానాన్ని ప్రారంభిస్తోంది. సెప్టెంబరు 5 వరకు డిపోల వారీగా కసరత్తు చేసి కొత్త విధానాన్ని ప్రారంభించనున్నారు. ‘సరైన బస్సు – సరైన రూట్ –సరైన సమయం –ప్రయాణికుల నిజమైన అవసరమే ప్రామాణికం‘అనే సూత్రంతో ఈ స్మార్ట్ షెడ్యూలింగ్ రూపుదిద్దుకుంటోంది. ఇక రాత్రి వేళల్లో తిరుగు ప్రయాణంలో ప్రయాణికులు ఉండని రూట్లలో బస్సులను ఖాళీగా డిపోలకు తీసుకురాకుండా, రాత్రికి గమ్యస్థానాల్లోనే నిలిపి ఉంచి (నైట్‌హాల్ట్æ) మరుసటి రోజు ఉదయాన్నే అక్కడ నుంచి సర్వీసులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నారు. నైట్ హాల్ట్ డ్యూటీలో గ్రామాల్లో బస చేసే సిబ్బందికి ఆయా ఊళ్ల సర్పంచులు వసతులతో కూడిన రాత్రి బస కల్పించే బాధ్యత అప్పగించనున్నారు.


