నీటిపారుదల శాఖకు రూ.23,372 కోట్లు | Rs 23372 crore for Irrigation Department in Telangana Budget | Sakshi
Sakshi News home page

నీటిపారుదల శాఖకు రూ.23,372 కోట్లు

Published Thu, Mar 20 2025 4:48 AM | Last Updated on Thu, Mar 20 2025 4:48 AM

Rs 23372 crore for Irrigation Department in Telangana Budget

తిరిగి అప్పుల చెల్లింపులకే పోనున్న రూ.9,877 కోట్లు 

ప్రాధాన్య ప్రాజెక్టులకు రూ.7,120 కోట్లు కేటాయింపు 

కాంగ్రెస్‌ సొంత ప్రాజెక్టు ప్రాణహితకు మొండిచెయ్యే 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2025–26 బడ్జెట్లో  నీటిపారుదల శాఖకు రూ.23,372.7 కోట్లు కేటాయించింది. ఇందులో ప్రగతి పద్దు కింద రూ.11,786.77 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ.11,543.87 కోట్లు చూపించింది. చార్జ్‌డ్‌ మొత్తం కింద రూ.42.06 కోట్లు కేటాయించింది. అయితే ఈ కేటాయింపుల్లో సింహభాగం రుణాల తిరిగి చెల్లింపులకే పోనున్నాయి. 

ప్రాధాన్య ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తిచేస్తామన్న ప్రభుత్వ హామీకి తగ్గట్లుగా నిధుల కేటాయింపులు జరగలేదు. 2024–25 బడ్జెట్‌లో నీటిపారుదల శాఖకు రూ.22,301 కోట్లు కేటాయించగా, తాజా బడ్జెట్‌లో రూ.1,071 కోట్లు పెంచారు. ఈ శాఖకు 2022–23లో రూ.19,349.24 కోట్లు, 2023–24లో రూ.29,766 కోట్ల బడ్జెట్‌ కేటాయింపులు జరిగాయి.  

రుణమే పెనుభారం 
కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డితో పాటు ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి తీసుకున్న భారీ రుణాలు తిరిగి చెల్లించడానికి సాగునీటి శాఖ బడ్జెట్‌ కేటాయింపుల్లోని సింహభాగం నిధులు వెళ్లనున్నాయి. రుణాల తిరిగి చెల్లింపులకు రూ.9,877.01 కోట్లు అవసరమని బడ్జెట్‌లో ప్రభుత్వం తెలిపింది. 

మేజర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుల రుణాల తిరిగి చెల్లింపులకు రూ.2,962.47 కోట్లు, కాళేశ్వరం కార్పొరేషన్‌ రుణాల తిరిగి చెల్లింపులకు రూ.6,914.54 కోట్లు కేటాయించారు. ఇక తెలంగాణ జలవనరుల సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీడబ్ల్యూఆర్‌ఐడీసీఎల్‌)కు రుణం కింద రూ.2,962.47 కోట్లు ప్రతిపాదించింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణకు నిధులు రూ.385.38 కోట్లకు తగ్గాయి. 

ప్రాధాన్య ప్రాజెక్టులకు రూ.7,120 కోట్లు.. 
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి మూలధన పెట్టుబడుల కింద బడ్జెట్‌లో రూ.12,652 కోట్లు కేటాయించారు. ఇందులో ప్రాధాన్య ప్రాజెక్టులకు రూ.7120.27 కోట్లు ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టుల పూర్తితో 2024–25 ఆర్థిక సంవత్సరంలో 6,55,895 ఎకరాలు, 2025–26లో 9,42,778 ఎకరాలను సాగులోకి తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇలా 2025–26 నాటికి మొత్తం 15,98,673 ఎకరాల ఆయకట్టు సాగులోకి రావాల్సి ఉంది. 

అయితే, నిధులు అరకొరగానే కేటాయించటంతో గడువులోగా ఆయా ప్రాజెక్టులను పూర్తిచేయటం అనుమానంగా మారింది. ప్రాణహిత–చెవెళ్ల ప్రాజెక్టులో భాగంగా వచ్చే నెలలో తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్‌ నిర్మాణానికి సీఎం రేవంత్‌ శంకుస్థాపన చేస్తారని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. బడ్జెట్‌లో మాత్రం ఈ ప్రాజెక్టుకు నిధులను రూ.248.99 కోట్ల నుంచి రూ.32.22 కోట్లకు తగ్గించడం గమనార్హం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement