
హైదరాబాద్: స్నేహితుల చేతిలో ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురైన సంఘటన ఆదివారం రాత్రి కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అల్లాపూర్, పండిట్ నెహ్రూ నగర్‌లో రౌడీషీటర్ సయ్యద్ సాహెద్ (24) నివాసం ఉంటున్నాడు. గతంలో ఓ హత్య కేసులో జైలుకు వెళ్లిన అతను ఇటీవలే బయటికి వచ్చాడు.
ఆదివారం రాత్రి కూకట్‌పల్లిలో పవన్ అనే వ్యక్తి పుట్టిన రోజు సందర్భంగా పాపారాయుడు నగర్‌లోని ఖాళీ స్థలంలోని ఇచి్చన విందుకు సయ్యద్ సాహెద్, సాజిద్, సమీర్, మున్నా, పవన్ హాజరయ్యారు. అయితే గతంలో సాహెద్, సాజిద్‌ను డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. అందరూ కలిసి మద్యం తాగిన అనంతరం డబ్బుల విషయమై వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహానికి లోనైన సాజిద్ బీరు బాటిల్ పగలగొట్టి సాహెద్ గొంతులో పొడిచాడు. మరో రెండు బీరు బాటిళ్లు తలపై పగులగొట్టడమేగాక బండరాయితో తలపై మోదటంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడు సాహెద్‌పై అల్లాపూర్ పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీట్ ఉందని, అల్లాపూర్, సనత్‌నగర్, బోరబండ పోలీస్‌స్టేషన్ పరిధిలో పలు కేసులు ఉన్నట్లు తెలిపారు. యూ ట్యూబర్‌గా పని చేస్తున్న నిందితుడు సాజిద్‌పై కూడా రౌడీ షీట్ ఉన్నట్లు తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు తెలిపారు. ఈ హత్య కేసులో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.