Roads: రోడ్లకు వాన దెబ్బ.. గాలికొదిలేసిన ప్రభుత్వం

Roads Damaged In Telangana Due To Heavy Rains - Sakshi

రెండేళ్లుగా భారీ వర్షాలతో దెబ్బతిన్న రహదారులు

ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపట్టని ప్రభుత్వం

మళ్లీ వానలు కురిసే వేళ పనులకు శ్రీకారం

6,617 కిలోమీటర్ల మేర పునరుద్ధరణకు నిర్ణయం

2,852 కోట్లతోపనులకు గ్రీన్‌ సిగ్నల్‌

ఇప్పటివరకు పూర్తయిన పనులు 20 శాతమే.. 

గత నెల రోజులుగా కురుస్తున్న వానలు

మరో నెల రోజుల్లో వానాకాలం షురూ..

గోతుల రోడ్లపై వరద పోటెత్తితే పూర్తిగా ధ్వంసమయ్యే అవకాశం

ప్రమాదాలు జరుగుతాయనే ఆందోళన 

గత రెండు మూడేళ్లుగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. భారీ, అతి భారీ వానలతో వరద పోటెత్తడంతో చాలా ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. తీవ్రంగా దెబ్బతిన్న చోట పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాల్సి ఉన్నా ప్రభుత్వం అందుకు తగ్గ ఏర్పాట్లు చేయలేదు. పలుచోట్ల నామ్‌కేవాస్తేగా పైపైన సాధారణ మరమ్మతులు చేసినా.. ఇటీవలి వర్షాలకు మరింతగా పాడయ్యాయి. చాలా చోట్ల గతుకులు, గుంతలు పడ్డాయి. కొన్నిచోట్ల పైన తారు కొట్టుకుపోయి.. మట్టిరోడ్లలా మారిపోయాయి. దీనితో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా కనిపిస్తోంది. మరో నెల రోజుల్లో వానాకాలం ముంచుకొస్తుండగా.. ఇప్పటికీ రోడ్ల మరమ్మతు అంశం కొలిక్కి రాలేదు. రోడ్ల పీరియాడికల్‌ రెన్యువల్స్‌కు సంబంధించి నిర్ధారించుకున్న నిడివిలో కేవలం 20 శాతమే పూర్తయింది. వానాకాలం మొదలైతే పనులు ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. 

రోడ్ల పీరియాడికల్‌ రెన్యువల్స్‌ తీరు ఇదీ.. 

మొత్తం ఎంపిక చేసిన రోడ్ల నిడివి:    6,617 కి.మీ.
ఇందుకు మంజూరు చేసిన నిధులు:    రూ.2,852 కోట్లు 
ఇప్పటివరకు పూర్తయిన రెన్యువల్‌:   1,400 కి.మీ.

ఇంకా పనులు జరుగుతున్న రోడ్లు:    1,350 కి.మీ.
పనులు ప్రారంభం కావాల్సిన నిడివి:    2,263 కి.మీ.
టెండర్లు కూడా ఖరారు కాని రోడ్లు:    1,190 కి.మీ. 

భారీ వర్షాలు పడితే ఇబ్బందే.. 
గత రెండు వానాకాలాల్లో కలిపి దాదాపు రూ.2 వేల కోట్ల మేర రోడ్లకు నష్టం జరిగినట్టు అంచనా. ఎప్పటికప్పుడే రోడ్లను మెరుగుపరిస్తే.. తదుపరి వరదకు అంతగా నష్టం ఉండదు. అదే మరమ్మతులు చేయని పక్షంలో.. మళ్లీ వరద పోటెత్తితే ఆ రోడ్లు పూర్తిగా కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు రోడ్లను పూర్తిగా పునరుద్ధరించాల్సిన పరిస్థితి వస్తుంది. ఖర్చు భారీగా పెరుగుతుంది. రాష్ట్రంలో గత రెండేళ్లుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గుంతలు, దెబ్బతిన్న రోడ్ల కారణంగా ప్రమాదాలు జరుగుతాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
పనులు మొదలుపెట్టినా.. 
2021 వానాకాలంలో భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు దాదాపు రూ.800 కోట్లు అవసరమని అంచనా వేశారు. గతేడాది భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్లకు రూ.1,200 కోట్లు అవసరమని నిర్ధారించారు. 2021లో దెబ్బతిన్న రోడ్లను సకాలంలో బాగు చేయకపోవటంతో.. వాటి పటుత్వం తగ్గి 2022లో మరింతగా దెబ్బతిన్నాయి. అయినా సకాలంలో పునరుద్ధరణ చేపట్టలేదు. గతేడాది చివరలో రోడ్ల పీరియాడికల్‌ రెన్యూవల్స్‌ చేపట్టాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. రూ.2,852 కోట్లను మంజూరు చేసింది. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించేసరికి ఫిబ్రవరి వచ్చేసింది. ఏప్రిల్‌ రెండో వారం నాటికి 20 శాతం పనులు పూర్తి చేశారు. కానీ అప్పటి నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో పనులు నిలిచిపోయాయి. 

పదేళ్ల తర్వాత రెన్యూవల్స్‌.. 
ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ నిబంధనల ప్రకారం.. ప్రతి ఐదేళ్లకోసారి రోడ్లకు రెన్యూవల్స్‌ జరగాలి. అంటే పైన దెబ్బతిన్న తారు పూతను పూర్తిగా తొలగించి కొత్తగా వేయాలి. దీనికి భారీగా వ్యయం అవనున్నందున.. ఐదేళ్లకు బదులు కనీసం ఏడేళ్లకోసారి కొత్తగా వేసినా సరిపోతుందని నిపుణులు పేర్కొంటున్నారు. కానీ తెలంగాణ ఏర్పడ్డాక అసలు పీరియాడికల్‌ రెన్యూవల్స్‌ చేపట్టలేదు. దాదాపు పదేళ్ల తర్వాత తొలిసారి ఇప్పుడు పనులకు శ్రీకారం చుట్టారు. 6,617 కిలోమీటర్ల మేర రోడ్లను పునరుద్ధరించాలని నిర్ణయించి.. వరదలతో దెబ్బతిన్న రోడ్లను ఇందులో చేర్చి పనులు ప్రారంభించారు. కానీ అనుమతులు, నిధుల విడుదలలో జాప్యంతో పనులు ఆలస్యంగా చేపట్టారు. మరో నెలలో వానాకాలం మొదలవుతుండటంతో.. గతంలో రోడ్లు మరింతగా పాడైపోయే పరిస్థితి నెలకొందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 

  • జడ్చర్ల–వనపర్తి మధ్య బిజినేపల్లి ప్రాంతంలో రోడ్డు కనీస మరమ్మతులు కూడా లేక వానలకు దెబ్బతిని ఇలా గోతులమయంగా మారింది. ఈ మార్గంలో పెద్ద సంఖ్యలో టిప్పర్లు తిరుగుతుండటంతో గోతులు మరింత పెరిగి వాహన దారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గతంలో బిజినేపల్లి–జడ్చర్ల మధ్య ప్రయాణ సమయం అరగంట అయితే... ఇప్పుడు గోతుల వల్ల గంటకుపైగా పడుతోంది. 
  • బిజినేపల్లి సమీపంలోని నల్లవాగుపై నిర్మిస్తున్న వంతెనపై రోడ్డుమీద రెండు చిన్న వంతెనల నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పక్కన నిర్మించిన తాత్కాలిక రోడ్డు వానలకు పాడైపోయింది. ఇటీవల ఈ రోడ్డుమీద అదుపుతప్పిన ఓ టిప్పర్‌ కరెంటు స్తంభాన్ని ఢీకొంది. తెగిన కరెంటు వైరు ఆ పక్కగా వస్తున్న ఆర్టీసీ బస్సుపై పడింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో విద్యుత్‌ సరఫరాను నిలిపివేసి ఉండటంతో.. బస్సులో ఉన్న 70 మంది పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. 
  • నల్గొండ జిల్లా యాద్గార్‌పల్లి– కేశవాపురం మధ్య ఉన్న సింగిల్‌ రోడ్డు కాస్తా భారీ వర్షాలకు ధ్వంసమైంది. వరదలతో దెబ్బతిన్న రోడ్లను బాగుచేసే క్రమంలో ఇలా పునరుద్ధరించారు. ఇప్పుడు ప్రయాణాలు సాఫీగా సాగుతున్నాయి. 

  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top