బియ్యం.. భయం.. | Rice Prices Soar to Rs 90 per Kg in Telangana | Sakshi
Sakshi News home page

బియ్యం.. భయం..

Oct 20 2026 3:26 AM | Updated on Oct 20 2026 3:26 AM

Rice Prices Soar to Rs 90 per Kg in Telangana

దండిగా నిల్వలున్నా.. ధరలకు రెక్కలు!

దేశంలో బఫర్‌ను మించి దాదాపు 3 రెట్లు అధికంగా బియ్యం స్టాక్‌ 

అదనంగా అందుబాటులో మిల్లింగ్‌ చేసి బియ్యంగా మార్చాల్సిన 298 లక్షల టన్నుల ధాన్యం  

అయినా రాష్ట్రంలో కిలో సన్న బియ్యం రూ.80–90 పలుకుతున్న వైనం 

ఖరీఫ్‌ దిగుబడులపై ఆందోళన, రబీపై అనిశ్చితే కారణం 

వ్యాపారుల అక్రమ నిల్వలు.. తగ్గిన సన్న రకాల సరఫరా..   పెరిగిన ఇతర రాష్ట్రాల కొనుగోళ్లు 

భవిష్యత్తులో కొరత అంచనాలతో ధరలు పెంచేస్తున్న వ్యాపారులు 

సెంట్రల్‌ పూల్‌లో బియ్యం నిల్వలు అధికంగా ఉన్నందున బహిరంగ మార్కెట్‌ విక్రయ పథకం ద్వారా సరఫరాను పెంచాలంటున్న నిపుణులు 

రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక నిఘా పెట్టి, మార్కెట్‌లో సరఫరా, డిమాండ్‌ సమీక్షించాలని సూచన

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో బియ్యం నిల్వలు పుష్కలంగా ఉన్నా. సామాన్యుడి కంచంలో అన్నం ముద్ద ఖరీదవుతోంది. రాష్ట్రంలో సన్న బియ్యం ధరలు కిలో రూ.80–90కు చేరడంతో మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్‌ తలకిందులవుతోంది. కొన్నిరకాల బియ్యం 25 కిలోల బ్యాగు ధర రూ.2,100 దాటింది. వర్షాభావ పరిస్థితులతో ఖరీఫ్‌ దిగుబడులపై ఆందోళనలు, రబీ సాగుపై అనిశ్చితి, స్థానికంగా సన్న రకాల సరఫరా తగ్గడం, ఇతర రాష్ట్రాల కొనుగోళ్లు పెరగడం ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. భవిష్యత్తులో కొరత ఏర్పడుతుందన్న అంచనాతో వ్యాపారులు అక్రమ నిల్వలకు పాల్పడుతున్నారు. ముందుగానే ధరలు పెంచుతున్నారు.  

సెంట్రల్‌ పూల్‌లో 390 లక్షల టన్నుల నిల్వలు 
కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ గణాంకాల ప్రకారం 2026 మే 28న సెంట్రల్‌ పూల్‌లో 397 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం నిల్వలున్నాయి. అయితే జూలై 1 నాటికి నిర్దేశించిన బఫర్‌ పరిమాణం 135.40 లక్షల టన్నులు మాత్రమే కావడం గమనార్హం. అంటే నిర్దేశిత పరిమాణం కంటే దాదాపు 2.9 రెట్ల బియ్యం నిల్వలున్నాయి. దీనికి అదనంగా మిల్లింగ్‌ చేసి బియ్యంగా మార్చాల్సిన 298 లక్షల టన్నుల ధాన్యం కూడా ఉంది. 

ఈనెల 14న సవరించిన గణాంకాల ప్రకారం సెపె్టంబర్‌ 1 నాటికి కూడా కేంద్ర పూల్‌లో 390.53 లక్షల టన్నుల బియ్యం, 479.92 లక్షల టన్నుల గోధుమలు ఉన్నాయి. బియ్యం నిల్వలు బఫర్‌ పరిమాణానికి దాదాపు మూడు రెట్లు అధికంగా ఉన్నప్పటికీ..ఈ నిల్వల్లో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందించాల్సిన బియ్యం కూడా ఉన్నాయి. కాబట్టి మొత్తం నిల్వలన్నీ బహిరంగ మార్కెట్‌లో విక్రయానికి  సిద్ధంగా ఉన్నాయని భావించలేం. అయితే అవసరానికన్నా చాలా ఎక్కువగానే నిల్వలు ఉన్నాయన్నది స్పష్టమవుతోంది. 

మన సన్న బియ్యానికి డిమాండ్‌ 
    రాష్ట్రంలో సన్న బియ్యం ధరలు సెపె్టంబర్‌ నుంచి అక్టోబర్‌ మధ్య గణనీయంగా పెరిగాయి. ఈ నెల 9న ప్రచురితమైన మార్కెట్‌ నివేదిక ప్రకారం కిలో సన్న బియ్యం ధర రూ.70 నుంచి రూ.80–82కు చేరింది. 25 కిలోల బ్యాగు ధర రూ.1,800 నుంచి రూ.2,150కు పెరిగింది. హైదరాబాద్‌లో కొన్ని రకాల ధరలు రూ.85–90 వరకు నమోదయ్యాయి. మరో నివేదిక ప్రకారం గత 30–45 రోజుల్లో 25 కిలోల బ్యాగు ధర రూ.300–500 మేర పెరిగింది. 

తెలంగాణలో పండే సన్న రకాల ధాన్యానికి కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ వంటి పొరుగు రాష్ట్రాల నుంచి డిమాండ్‌ ఉండటం, వ్యాపారులు నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేయడం స్థానిక మార్కెట్‌లో లభ్యతపై ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. కొన్ని మిల్లులు.. రైతులకు ఎక్కువ నగదు చెల్లించి నేరుగా ఖరీఫ్‌ ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాయి. అధిక ధరలకు కొనుగోలు చేయడం వల్ల మార్కెట్‌లో మరింత అధిక రేటుకు విక్రయిస్తారు. 

గోదాముల్లో నిల్వల లెక్క తేల్చాలి.. 
    రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ, ఎఫ్‌సీఐ, ప్రైవేటు మిల్లుల వద్ద ఉన్న నిల్వలను వేర్వేరుగా వెల్లడిస్తే మార్కెట్‌లో నిజంగా ఎంత సరుకు అందుబాటులో ఉందో ఇంకా స్పష్టమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సన్న బియ్యం ధరల పెరుగుదలపై జిల్లా వారీగా పర్యవేక్షణ చేపట్టడంతోపాటు, రాష్ట్రంలోని మిల్లులు, టోకు గోదాముల్లో నిల్వల లెక్కలను తనిఖీ చేయాలి. సెంట్రల్‌ పూల్‌లో బియ్యం నిల్వలు అధికంగా ఉన్న నేపథ్యంలో అవసరమైతే బహిరంగ మార్కెట్‌ విక్రయ పథకం ద్వారా సరఫరాను పెంచడం, రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవడం వంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం సన్న బియ్యం ధరలపై ప్రత్యేక నిఘా పెట్టి, మార్కెట్‌లో సరఫరా–డిమాండ్‌ పరిస్థితులను సమీక్షించాలని నిపుణులు సూచిస్తున్నారు. అందుబాటులో ఉన్న నిల్వల లెక్కలను బహిర్గతం చేయడం, సరఫరా వ్యవస్థలో లోపాలను సరిదిద్దడం, అక్రమ నిల్వలపై చర్యలు తీసుకోవడం ద్వారా సామాన్యుడికి అందుబాటు ధరల్లో బియ్యం లభించేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని అంటున్నారు.  

ఖరీఫ్‌ దిగుబడులపై ఆందోళన
ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు, వరి సాగు విస్తీర్ణం తగ్గడం వల్ల రాబోయే పంట దిగుబడిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాయిటర్స్‌ నివేదిక ప్రకారం, 2026లో భారత బియ్యం ఉత్పత్తి గత ఏడాది 154 మిలియన్‌ టన్నుల నుంచి 144 మిలియన్‌ టన్నులకు తగ్గే అవకాశం ఉందని అంచనా. అంటే సుమారు 6.5 శాతం తగ్గుదల ఉంటుందన్న మాట. వర్షపాత లోటు, వరి సాగు విస్తీర్ణం తగ్గడం ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొంది. అయితే అదే నివేదిక ప్రకారం సెపె్టంబర్‌ 1 నాటికి దేశంలో మొత్తం బియ్యం నిల్వలు 59.6 మిలియన్‌ టన్నులుగా ఉండగా.. కొత్త పంట మార్కెట్‌లోకి వచ్చే సమయం, సన్న రకాల లభ్య త, కొనుగోళ్ల వేగం, మిల్లింగ్‌ సామర్థ్యం, రవాణా ఖర్చులు కూడా ధరలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement