సవరించిన భూముల విలువల నమోదులో రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం
రాష్ట్రవ్యాప్తంగా 2,152 గ్రామాల్లో తప్పులు చేసిన తహసీల్దార్లు
గుర్తించిన ఎన్‌ఐసీ... తప్పులను సవరిస్తున్న సిబ్బంది
తప్పులన్నీ సవరించాక విలువల అప్‌లోడ్
మరి గుర్తించనివి ఎన్నో... రిజిస్ట్రేషన్‌కు వెళ్తేనే బయటపడే అవకాశం
ఈనెల 10లోపు సవరించిన విలువలు అమల్లోకి...
సాక్షి, హైదరాబాద్: భూముల విలువలను సవరించే ప్రక్రియలో పెద్దఎత్తున తప్పులు దొర్లాయని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ) గుర్తించింది. రెవెన్యూ సిబ్బంది అవగాహన లోపం, తహసీల్దార్ల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలోని 2,152 గ్రామాల్లో వ్యవసాయ భూముల విలువల నమోదులో తప్పులు జరిగినట్టు వెల్లడైంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఆ తప్పులను సవరించే పనిలో పడింది. జిల్లా రిజిస్ట్రార్ల సహకారంతో ఈ తప్పులను సరిచేస్తున్నారు. గ్రామాలు, సర్వే నంబర్ల వారీగా తప్పులను సవరించి జాగ్రత్తగా విలువలన్నింటినీ నమోదు చేస్తున్నారని, మంగళవారం రాత్రికల్లా వ్యవసాయ భూముల విలువలను అప్‌లోడ్ చేసే ప్రక్రియ పూర్తవుతుందని సమాచారం.
ఇంకా ఎన్నో...?
ఎన్‌ఐసీ గుర్తించిన గ్రామాల మాటెలా ఉన్నా గుర్తించని తప్పుల పరిస్థితి ఏంటనే చర్చ ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో గుబులు పుట్టిస్తోంది. ఒకవేళ ఇంకా తప్పులు దొర్లి ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని, భూమి విలువ కంటే పదుల రెట్లు ఎక్కువగా.. లేదంటే తక్కువగా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి వస్తుందని, తద్వారా ప్రభుత్వ ఖజానాపై కూడా భారం పడే అవకాశం లేకపోలేదనే చర్చ జరుగుతోంది. అయితే, ఈ తప్పొప్పుల గుర్తింపు ఇప్పుడు సాధ్యమయ్యే పని కాదని, రిజిస్ట్రేషన్ల సమయంలో మాత్రమే ఈ సమస్య తెలుస్తుందని ప్రభుత్వ వర్గాలే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తప్పు జరిగిన విషయం వెల్లడైన దాన్ని బట్టి మాన్యువల్‌గా విలువను నిర్ధారించి ఫీజు కట్టించుకునేందుకు కూడా వీలుపడదని, ఇలాంటి తప్పులు సరిచేయకుండా సవరించిన విలువలు అమల్లోకి రావడం చాలా ప్రమాదమని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులే చెబుతుండటం గమనార్హం.
అమల్లోకి ఎప్పుడు?
వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం సవరించిన విలువలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయనే దానిపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అదనపు పనివేళలను ఈనెల 3 వరకే ప్రకటించారు కాబట్టి 4వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని, శనివారం అమల్లోకి వస్తే తప్పొప్పులు సరిచేసుకునేందుకు, సర్వర్లు చెక్ చేసుకునేందుకు ఆదివారం సమయం దొరుకుతుంది కాబట్టి 6వ తేదీ నుంచి, లేదంటే 8వ తేదీ సోమవారం నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. మొత్తంమీద ఈనెల 10 లోపు సవరించిన విలువలు అమల్లోకి వస్తాయని తెలుస్తోంది.


