మళ్లీ రాజ్‌భవన్‌లోనే గణతంత్ర వేడుక

Republic Day celebrations At Raj Bhavan Hyderabad - Sakshi

రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం.. రాజ్‌భవన్‌కు చేరిన సమాచారం 

వరుసగా రెండో ఏడాదీ రాజ్‌భవన్‌కే గణతంత్ర దిన వేడుకలు పరిమితం

రిపబ్లిక్‌ డే సందర్భంగా జనవరి 26న రాష్ట్ర స్థాయిలో అధికారికంగా నిర్వహించాల్సి ఉన్న వేడుకలను ఈ ఏడాది సైతం రాజ్‌భవన్‌కు పరిమితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం రాత్రి రాజ్‌భవన్‌కు సమాచారాన్ని అందించింది.

సాక్షి, హైదరాబాద్‌: దేశ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న రాష్ట్ర స్థాయిలో అధికారికంగా నిర్వహించాల్సి ఉన్న వేడుకలను ఈ ఏడాది సైతం రాజ్‌భవన్‌కు పరిమితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదివారం రాత్రి రాజ్‌భవన్‌కు సమాచారాన్ని అందించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి, గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం ఆనవాయితీగా వస్తోంది. గణతంత్ర దినోత్సవాన్ని పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుండగా,  తెలంగాణ వచ్చిన తర్వాత కొన్నాళ్లకు వేదికను నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌కు మార్చారు.

►తొలిసారిగా రాష్ట్ర స్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకలను గతేడాది రాజ్‌భవన్‌లో నిర్వహించారు. కోవిడ్‌–19 మహమ్మారి మూడో వేవ్‌ ప్రభావం ఉండడంతో వేడుకలను తక్కువ మంది అతిథుల సమక్షంలో రాజ్‌భవన్‌లో నిర్వహించాలని అప్పట్లో రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ప్రసంగం లేకుండానే సాదాసీదాగా ఉత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రసంగ పాఠాన్ని పంపకపోయినా,  గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మాత్రం ఓ అడుగు ముందుకేసి రాజ్‌భవన్‌ వేదికగా ప్రసంగించారు.  రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల దుస్థితిపై విమర్శలు చేశారు. కోవిడ్‌–19 వ్యాప్తి ఉన్న సమయంలో రాజకీయ సభలు, సమావేశాలు నిర్వహించారని, గణతంత్ర వేడుకలను  మాత్రం కోవిడ్‌–19 పేరుతో రాజ్‌భవన్‌లో సాదాసీదా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారని, తనను అవమానించడానికే అలా చేశారని అప్పట్లో విమర్శించారు.

►రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్‌ తమిళిసై మధ్య నెలకొన్న తీవ్ర విబేధాల నేపథ్యంలో వరుసగా రెండో ఏడాది కూడా గణతంత్ర దిన వేడుకలు రాజ్‌భవన్‌లో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది.  ప్రస్తుతానికి కోవిడ్‌–19 ప్రభావం లేకున్నా వేడుకలను రాజ్‌భవన్‌కు పరిమితం చేయడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల గవర్నర్‌ తమిళిసై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలిసింది. 

ఇంకా అందని ప్రసంగ పాఠం..: గణతంత్ర దిన వేడుకలకు మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండగా, ఇప్పటి వరకు గవర్నర్‌ ప్రసంగ పాఠాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపించలేదు. ప్రసంగం లేకుండానే ఈ ఏడాది సైతం వేడుకలను నిర్వహించాలని రాష్ట్ర ప్ర భుత్వం కోరనున్నట్టు సమా చారం. ఈ నేపథ్యంలో గ తేడాది తరహాలోనే ఈ సారి సైతం గవర్నర్‌ తమిళిసై తన సొంత ప్రసంగాన్ని చదివి వినిపించే అవకాశాలు న్నాయి.

సంప్రదాయం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పంపించే ప్రసంగాన్ని మాత్రమే గవర్న ర్లు చదవాల్సి ఉంటుంది. గతేడాది ఉత్సవాల్లో గవర్నర్‌ సొంత ప్రసంగం చేయడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా అభ్యంతరం తెలిపింది.  ఈ సారి సైతం గవర్నర్‌ తన ప్రసంగంలో ప్రభుత్వంపై విమర్శలు చేసే అవకాశాలున్నాయి. 

పల్లు బిల్లుల ఆమోదం నిలిపివేత 
రాష్ట్ర యూనివర్సిటీల కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు బిల్లుతో సహా రాష్ట్ర శాసనసభ ఆమోదించిన పలు బిల్లులను ఆమోదించకుండా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ గ త కొన్ని నెలలుగా రాజ్‌భవన్‌లో పెండింగ్‌లో ఉంచడం రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. గత స్వా తంత్య్ర దినోత్సవం సందర్భంగా పలువురు జీవిత ఖైదీ లకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సైతం గవర్నర్‌ తిరస్కరించారు. గవర్నర్‌ ఆమోదం లభించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినె న్స్‌ల(అత్యవసర ఉత్తర్వులు) జారీని పూర్తిగా మానేసింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top