3డీ మ్యాపింగ్‌.. ‘గుండె’ నార్మల్‌

Rare Heart Surgery At Nims In Hyderabad - Sakshi

నిమ్స్‌లో అరుదైన శస్త్రచికిత్స 

మూసుకుపోయిన కవాటాన్ని తెరిచిన వైద్యులు

లక్డీకాపూల్‌(హైదరాబాద్‌): గుండె కవాటం మూసుకుపోయి బాధపడుతున్న 56 ఏళ్ల మహిళకు నిజాం వైద్య విజ్ఞాన సంస్ధ (నిమ్స్‌) వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. ప్రమాదకర స్థాయిలో కొట్టుకుంటున్న గుండెలో సమస్యను 3డీ మ్యాపింగ్, బెలూన్‌ వాల్వ్‌ సాంకేతికత సాయంతో పరిష్కరించారు. ఖరీదైన ఈ శస్త్రచికిత్సను ఆరోగ్యశ్రీ కింద నిర్వహించడం గమనార్హం. 

నిమిషానికి 250 సార్లు గుండె కొట్టుకుని..
కామారెడ్డి జిల్లాలోని రెడ్డిపేటకు చెందిన బాలమణి పొలం పనులు చేసుకుంటూ జీవిస్తోంది. మూడు నెలల క్రితం ఆమె ఒక్కసారిగా అనారోగ్యానికి గురైంది. గుండె దడదడలాడడం, కడుపు ఉబ్బరం, ఆయాసం మొదలయ్యాయి. నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లినా ఏమీ తేలలేదు. చివరికి నిమ్స్‌ ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. ఆమెకు పరీక్షలు చేసిన నిమ్స్‌ వైద్యులు..

ఆమె గుండె నిమిషానికి 250 సార్లు కొట్టుకుంటోందని, గుండె నుంచి ఊపిరితిత్తులకు రక్తం పంప్‌ చేసే కవాటం మూసుకుపోయిందని గుర్తించారు. ఈ నెల 17న 3డీ మ్యాపింగ్, బెలూన్‌ వాల్వ్‌ విధానంలో శస్త్రచికిత్స చేశారు. తొడ భాగంలోని రక్త నాళం నుంచి ప్రత్యేక పరికరాల ద్వారా బెలూన్‌ను గుండె వద్దకు పంపి.. మూసుకుపోయిన కవాటాన్ని తెరిచారు. కార్డియాలజీ ప్రొఫెసర్‌ సాయి సతీశ్‌ ఆధ్వర్యంలో వైద్యులు హేమంత్‌ హరీశ్, అర్చన, మణికృష్ణ తదితరుల బృందం ఈ క్లిష్టమైన చికిత్సను పూర్తి చేసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top