ఇక ఇంధన సంరక్షణ తప్పనిసరి!

Rajya Sabha Passes Energy Conservation Amendment Bill 2022 - Sakshi

రాజ్యసభ ముందు ఎనర్జీ కన్జర్వేషన్‌ చట్ట సవరణ బిల్లు 

ఇక ‘బిల్డింగ్‌ కోడ్‌’ప్రకారమే భారీ భవనాల నిర్మాణం  

భవనం విద్యుత్‌ లోడ్‌ 100 కేడబ్ల్యూ దాటితే కోడ్‌ తప్పనిసరి 

బిల్లు పరిధిలో పరికరాలు, వాహనాలు, నౌకలు, భారీ భవనాలు  

శిలాజయేతర ఇంధనాల వినియోగం సైతం తప్పనిసరి 

నాణ్యతలు అందుకోని పరిశ్రమలు రెండేళ్ల తర్వాత మూత 

ఉల్లంఘనలకు పాల్పడితే రూ.10లక్షల వరకు జరిమానా 

పునరావృతమైతే రోజుకు రూ.10వేలు చొప్పున ఫైన్‌ 

కర్బన ఉద్గారాల తగ్గింపు కోసం కేంద్రం కఠిన చర్యలు 

సాక్షి, హైదరాబాద్‌: కర్బన ఉద్గారాల నియంత్రణలో భాగంగా ఇకపై నిర్దేశిత వాటాలో గ్రీన్‌ హైడ్రోజన్, గ్రీన్‌ అమోనియా, బయోమాస్, ఇథనాల్‌ వంటి శిలాజయేతర ఇంధనాల వినియోగం తప్పనిసరి కానుంది. పరికరాలు, వాహనాలు, నౌకలు, పరిశ్రమలు, వ్యాపార సముదాయాలతో పాటు భారీ భవనాలు సైతం ఇంధన సంరక్షణ చట్టంలోని నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉండాల్సిందే. లేనిపక్షంలో భారీ మొత్తంలో జరిమానాలు చెల్లించక తప్పదు. ఈ మేరకు ఎనర్జీ కన్జర్వేషన్‌ చట్ట సవరణ బిల్లు–2022ను కేంద్రం అమల్లోకి తీసుకురాబోతోంది. గత ఆగస్టులోనే ఈ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లోనే ఈ బిల్లును రాజ్యసభలో ఆమోదించే అవకాశాలున్నాయి. 

ఉల్లంఘిస్తే నిషేధం... 
ఈ చట్ట సవరణ అమల్లోకి వచ్చిన తేదీ నుంచి ఆరు నెలల తర్వాత ఇందులో పేర్కొన్న నాణ్యతాప్రమాణాలు లేని పరికరాలు, వాహనాలు, నౌకలు, భారీ భవనాల తయారీ, ఎగుమతులు, దిగుమతులపై నిషేధం వర్తింపజేయనున్నారు. పరిశ్రమలను రెండు ఏళ్లలోగా మూతవేయాల్సి ఉంటుంది. నాణ్యతలను ఉల్లంఘించే వాహనాలు, నౌకలను ఉత్పత్తి చేయడం, ఎగుమతి చేయడం, దిగుమతి చేయడంపై నిషేధం. రెండేళ్లలోపు ఇంధన పరిరక్షణ నాణ్యతల అమలుకు పరిశ్రమలు చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో ఈ మేరకు చర్యలు తీసుకునే వరకు వాటిపై సైతం నిషేధం విధిస్తారు.  

అపార్ట్‌మెంట్లకు బిల్డింగ్‌ కోడ్‌ తప్పనిసరి... 
ఎనర్జీ కన్జర్వేషన్‌ అండ్‌ సస్టైనబుల్‌ బిల్డింగ్‌ కోడ్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత నిర్మించిన భారీ భవనాలకు ఇంధన సంరక్షణ చట్ట సవరణ నిబంధనలు వర్తిస్తాయి విద్యుత్‌ పొదుపు, సంరక్షణ, పునరుత్పాదక విద్యుత్‌ వినియోగం, ఇతర గ్రీన్‌ బిల్డింగ్‌ ఆవశ్యకతల కోసం పాటించాల్సిన ప్రమాణాలు, నిబంధనలు ఈ కోడ్‌లో ఉంటాయి. విద్యుత్‌ కనెక్టెడ్‌ లోడ్‌ 100కేడబ్ల్యూ లేదా కాంట్రాక్ట్‌డ్‌ లోడ్‌ 120 కేవీఏకి మించి ఉన్న భవనాలు తప్పనిసరిగా ఎనర్జీ కన్జర్వేషన్‌ అండ్‌ సస్టైనబుల్‌ బిల్డింగ్‌ కోడ్‌ను అమలు చేయాల్సి ఉంటుంది.

నివాస, వాణిజ్య, కార్యాలయాలు అనే తేడా లేకుండా అన్ని భారీ భవనాలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. 50 కేడబ్ల్యూకి మించిన కనెక్టెడ్‌ లోడ్‌ ఉన్న భవనాలను సైతం వీటి పరిధిలోకి తీసుకువచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లభించనుంది. ఒక అపార్ట్‌మెంట్‌లో 25 ఫ్లాట్లు ఉండి.. ఒక్కో ఫ్లాట్‌ సగటున 4కేడబ్ల్యూ లోడ్‌ కలిగిన విద్యుత్‌ కనెక్షన్‌ ఉంటే ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిందే. అయితే, బిల్డింగ్‌ కోడ్‌ ప్రకటించిన తర్వాత నిర్మించిన భవనాలకు మాత్రమే వర్తిస్తాయి. పాత భవనాలకు మినహాయింపు ఉంటుంది. 

కార్బన్‌ క్రెడిట్‌ సర్టిఫికెట్ల వ్యాపారం.. 
కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు కార్బన్‌ క్రెడిట్‌ ట్రేడింగ్‌ స్కీంను కేంద్రం అమలు చే యనుంది. నిర్దేశించిన వాటా కంటే తక్కువగా శిలాజయేతర ఇంధనాలను వినియోగిస్తే, లోటును భర్తీ చేయడానికి కార్బన్‌ క్రెడి ట్‌ సర్టిఫికెట్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కేంద్రం లేదా అది నియమించే ఏ దైనా సంస్థ ఈ సర్టిఫికెట్లను జారీ చేస్తుంది.  

ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు... 
►పైన పేర్కొన్న నిబంధనలను ఎవరైన వ్యక్తి ఉల్లంఘిస్తే రూ.10లక్షలకు మించకుండా జరిమానాలు విధిస్తారు. మళ్లీ ఉల్లంఘనలు పునరావృతమైతే ప్రతి రోజుకు రూ.10వేలు వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఆయా ఉపకరణాల విషయంలో ఈ ఉల్లంఘనలకు పాల్పడితే ఒక్కో ఉపకరణానికి రూ.2 వేల నుంచి రూ.5వేల లోపు అదనపు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.  

►పరిశ్రమలు, నౌకలు ఉల్లంఘనలకు పాల్పడిన పక్షంలో అవి వినియోగించిన ప్రతి మెట్రిక్‌ టన్ను ఇంధనం ధరకు రెండు రెట్ల జరిమానాను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. 

►వాహనాల తయారీ కంపెనీలు నాణ్యత లేని వాహనాలను తయారు చేసి విక్రయిస్తే ప్రతి వాహనానికి దాని రకం ఆ ధారంగా రూ.25వేలు, రూ.50వేల లో పు జరిమానా విధించాల్సి ఉంటుంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top