వందేభారత్‌లో త్వరలో స్లీపర్‌ బెర్తులు

Railways To Include Sleeper Berths In Vande Bharat Express Soon - Sakshi

ఆ వసతి లేనందున పగటి వేళ తిరుగుతున్న ‘సెమీబుల్లెట్‌’

మధ్యాహ్న ప్రయాణానికి మొగ్గుచూపని ప్రయాణికులు 

వందేభారత్‌లలో సగం సీట్లు ఖాళీ 

దీంతో స్లీపర్‌ కోచ్‌లు చేర్చాలని రైల్వే శాఖ నిర్ణయం 

సాక్షి, హైదరాబాద్‌: సెమీ బుల్లెట్‌ రైలుగా పరిగణిస్తున్న వందేభారత్‌ రైలు త్వరలో సరికొత్త మార్పులతో రాబోతోంది. ప్రస్తుతం చైర్‌ కార్‌కే పరిమితమైన ఈ రైల్లో.. స్లీపర్‌ బెర్తులు ఏర్పాటుచేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దీంతో ఈ రైళ్లను తయారుచేస్తున్న చెన్నైలోని ఇంటిగ్రేటెడ్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్‌)కి ఆదేశాలివ్వడంతో ఈమేరకు రూపకల్పన పనులు మొదలయ్యాయి.

ప్రస్తుతం వందేభారత్‌ 2.0 సిరీస్‌ నడుస్తోంది. మొదటిసిరీస్‌లో ఐదు రైళ్లు పట్టాలెక్కగా, రెండో విడతలో మూడు రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. సికింద్రాబాద్‌–విశాఖపట్నం మధ్య సోమవారం నుంచి (ఆదివారం లాంఛనంగా ప్రారంభంకానుంది) ప్రయాణికులకు అందుబాటులోకి రానున్న రైలు కూడా రెండో సిరీస్‌లో భాగం. తదుపరి లేదా ఆ పై సిరీస్‌ అందుబాటులోకి వచ్చే నాటికి స్లీపర్‌ బెర్తులతో కూడిన వందేభారత్‌ రైలు పట్టాలెక్కే అవకాశం ఉంది. 

ఆక్యుపెన్సీ రేషియో 50 శాతమే  
వందేభారత్‌ రైలుకు విపరీతమైన డిమాండ్‌ ఉన్నా, కొన్నిచోట్ల ఆక్యుపెన్సీ రేషియో 50 శాతమే ఉంటోంది. వీటిలో స్లీపర్‌ బెర్తులు లేకపోవటంతో అవి రాత్రి వేళ తిరగవు. దీంతో గమ్యం చేరేవరకు కూర్చునే ప్రయాణించాల్సి ఉంటుంది. దీనికి ప్రయాణికులు మొగ్గు చూపడం లేదు. గతంలో వందేభారత్‌ తరహాలో వచ్చిన ఏసీ డబుల్‌ డెక్కర్‌ రైలుకు ఎంతో డిమాండ్‌ ఉండేది.

ఐదేళ్ల క్రితం కాచిగూడ–తిరుపతి, సికింద్రాబాద్‌–విశాఖపట్నం మధ్య తిరిగేందుకు డబుల్‌ డెక్కర్‌ రైలు మంజూరైంది. బెర్తులు లేక పోవటంతో పూర్తిగా పగటివేళ తిరుగుతుండటంతో దీనిలో ఆక్యుపెన్సీ రేషియో 20 శాతం లోపే నమోదయ్యేది. క్రమంగా నష్టాలు పెరగటంతో దాన్ని ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు వందేభారత్‌ విషయంలోనూ ఈ ప్రమాదం పొంచి ఉండటంతో అందులో స్లీపర్‌ బెర్తులు ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. 

విశాఖకు కొంత మెరుగే.. 
హైదరాబాద్‌ నుంచి విశాఖకు వెళ్లే గోదావరి ఎక్స్‌ప్రెస్‌ సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరుతుంది. అదే వందేభారత్‌ రైలు మధ్యాహ్నం మూడింటికి బయలుదేరి రాత్రి 11.30 గంటలకల్లా గమ్యం చేరుతుంది. కానీ విశాఖ నుంచి ఆ రైలు ఉదయం 5.45 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.15కు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. అంటే పూర్తిగా పగటి వేళలోనే తిరుగుతుంది. దీంతో ఈ మార్గంలో ఆక్యుపెన్సీ రేషియో తక్కువగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కాగా, శనివారం సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ఏర్పాట్లను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తోపాటు కిషన్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం వందేభారత్‌లోనూ పరిశీలించారు.   

ధర ప్రభావం చూపుతుందేమో.. 
సికింద్రాబాద్‌–విశాఖ వందేభారత్‌లో ఎగ్జిక్యూటివ్‌ చైర్‌కార్‌ టికెట్‌ ధర రూ.3,120గా ఉంది. ఇందులో రూ.369 కేటరింగ్‌ చార్జి కలిసి ఉంది. అది వద్దనుకుంటే దాన్ని మినహాయించి టికెట్‌ జారీ చేస్తారు. అదే విశాఖకు వెళ్లే గోదావరిలో ఏసీ ఫస్ట్‌క్లాస్‌ టికెట్‌ ధర రూ.2,540 మాత్రమే. దురంతోలో రూ.2,795, ఫలక్‌నుమాలో రూ.2,465గా ఉంది. ఇవన్నీ స్లీపర్‌ బెర్తులుండే రైళ్లు.

వీటి కంటే చైర్‌కార్‌లో వెళ్లే వందేభారత్‌ రైలు టికెట్‌ ధర చాలా ఎక్కువగా ఉండటం కూడా కొంత ప్రభావం చూపుతుందంటున్నారు. వందేభారత్‌ ఎకానమీ క్లాస్‌ టికెట్‌ ధర రూ.1,665గా ఉంటే, గోదావరిలో థర్డ్‌ ఏసీ ధర రూ.1080, ఫలక్‌నుమాలో రూ.1,045 మాత్రమే. వాటిల్లో స్లీపర్‌ క్లాస్‌ ధర రూ.450 మాత్రమే కావటం గమనార్హం. అయితే మిగిలిన రైళ్లతో పోలిస్తే.. వందేభారత్‌ రైలు ప్రయాణ సమయం తక్కువగా ఉంటుంది.   

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top