తెలంగాణలో నిరుద్యోగం పెరిగింది.. రైతులకు గిట్టుబాటు లేదు.. జడ్చర్ల జోడో యాత్రలో రాహుల్‌

Rahul Gandhi Speech At Bharat Jodo Yatra Mahbubnagar Jadcherla - Sakshi

సాక్షి, మహబూబ్ నగర్: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ నేతృత్వంలో భారత్‌ జోడో యాత్ర తెలంగాణలో నాల్గవ రోజు ముగిసింది. ముగింపు సందర్భంలో శనివారం జడ్చర్ల సెంటర్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బీజేపీ-టీఆర్ఎస్‌లపై విమర్శనాస్త్రాలు సంధించారాయన. 

టీఆర్‌ఎస్‌, బీజేపీ రెండూ ఒక్కటే. కలిసే పని చేస్తున్నాయని రాహుల్‌ విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ పార్లమెంట్‌లో నల్లచట్టాలు తీసుకొస్తే.. టీఆర్‌ఎస్‌ మద్ధతు ఇస్తూ వచ్చింది. తెలంగాణలో బీజేపీపై యుద్ధం చేప్తూ.. ఢిల్లీలో మాత్రం ఇద్దరూ కలిసే నడుస్తున్నారు. బీజేపీ,టీఆర్ఎస్ పార్టీలు రాజకీయపార్టీల్లా కాకుండా కార్పోరేటు పార్టీలుగా పనిచేస్తున్నాయి అని మండిపడ్డారాయన.

పాదయాత్రలో తెలంగాణ ప్రజల గొంతు వింటున్నాం. అన్ని వర్గాల వాళ్లను కలుస్తున్నాం. ముఖ్యంగా రైతులు, విద్యార్థులను కలుస్తున్నాం.  తెలంగాణలో రైతులకు గిట్టుబాటు ధరలు దక్కక ఆగం అవుతున్నారు. రైతులతో పాటు చేనేత కార్మికులకు మేం అండగా నిలబడతాం. అధికారంలోకి వస్తే కాంగ్రెస్‌ తరపున పరిహారం చెల్లిస్తాం. మన డబ్బు మనకు చేరడం లేదు..దేశంలో ముగ్గురు వ్యాపారుల దగ్గరే డబ్బు చేరుతుంది. మూడు,నాలుగు కార్పోరేటు శక్తుల కోసం ప్రధాని మోదీ పని చేస్తున్నారు.

బీజేపీ విద్వేషాలు,హింసను ప్రేరేపిస్తోంది. తెలంగాణలో ప్రభుత్వం అన్ని రంగాలను నిర్లక్ష్యం చేస్తోంది. నీటిపారుదల ప్రాజెక్టుపై పేరుచెప్పి కేసీఆర్ దండుకుంటున్నారు. నిరుద్యోగుల సంఖ్య పెరిగి ఇంజనీరింగ్ పట్టభద్రులు జొమాటోలో పని చేస్తున్నారు. తెలంగాణలో విద్యా వ్యవస్దను ప్రైవేటు పరం చేస్తున్నారు. నిరుపేదలకు తీవ్ర నష్టం జరుగుతోంది. రాష్ట్రంలో విద్యపై బడ్జెట్ తక్కువ పెడుతోంది. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే.. నిధులు పెంచి నిరుపేద విద్యార్దుల కలను సాకారం చేస్తాం. విద్యతో పాటు వైద్యంపైనా అధిక నిధులు కేటాయిస్తాం. దళితులు,గిరిజనుల వద్ద లాక్కున్న భూములను.. తిరిగి వారికి ఇస్తాం అని ప్రకటించారాయన.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top