వలస కార్మికులకు ‘ఖతర్‌’ కంపెనీ ఉచిత వీసాలు

Qatar Catering Company Provide Free Visas To Migrant Workers - Sakshi

మోర్తాడ్‌ (బాల్కొండ): వలస కార్మికులకు ఉచితంగా వీసాలు అందించేందుకు ఖతర్‌లోని ఒక క్యాటరింగ్‌ కంపెనీ ముందుకొచ్చింది. కరోనా విపత్కర పరిస్థితుల నుంచి తేరుకుంటున్న సమయంలో కార్మికులపై ఆర్థిక భారం పడకుండా వీసాలను ఉచితంగా జారీ చేసేందుకు ఆ కంపెనీ సిద్ధమైంది. తెలంగాణలోని ఒక లైసెన్స్‌డ్‌ రిక్రూటింగ్‌ ఏజెన్సీ ద్వారా వీసా ఇంటర్వ్యూలను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది.

ఖతర్‌లోని వివిధ కంపెనీలు, విమానయాన రంగానికి ఆహారం సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న సదరు కంపెనీ వలస కార్మికులతో ఖాళీలను భర్తీ చేసుకోవాలని నిర్ణయించింది. కిచెన్‌ క్లీనింగ్, వెయిటర్స్, కస్టమర్‌ సర్వీస్‌ ఉద్యోగాలకోసం ఈనెల 30న ఆర్మూర్‌లో, 31న సికింద్రాబాద్‌లో ఇంటర్వ్యూలను నిర్వహించనుంది. ఆకర్షణీయమైన వేతనంతో పాటు వసతి, భోజన సదుపాయాలను కల్పించనున్నారు.

21 నుంచి 35 ఏళ్ల వయస్సు గల వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ‘గతంలో వీసా కావాలంటే కార్మికులు రూ.60 వేల నుంచి రూ.70 వేలు ఖర్చు చేయాల్సి వచ్చేది. కార్మికులపై ఎలాంటి భారం పడకుండా ఖతర్‌ కంపెనీ ఉచిత వీసాలను జారీ చేయడం ఆహ్వానించదగ్గ పరిణామం’అని జీటీఎం ఇంటర్నేషనల్‌ సంస్థ అధినేత సతీశ్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. వలస కార్మికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top