
స్ట్రీట్ డాగ్స్ ఇక పెట్ డాగ్స్
పార్కుల్లో కుక్క పిల్లల దత్తత కార్యక్రమాలు
త్వరలో జీహెచ్‌ఎంసీ కార్యాచరణ
వీధికుక్కల సమస్య పరిష్కారమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: వీధి కుక్కల సమస్య పరిష్కారానికి బల్దియా చర్యలు చేపట్టనుంది. ఎంపిక చేసిన పెద్ద పార్కుల్లో వీధికుక్క పిల్లల ప్రదర్శన.. దత్తత కార్యక్రమాలకు సిద్ధమవుతోంది. గతంలో ‘మా ఇంటి నేస్తం’ పేరిట నిర్వహించిన కార్యక్రమానికి మెరుగులు దిద్ది, కొత్త విధానంలో చేపట్టేందుకు రెడీ అవుతోంది. డా.బి.జనార్దన్‌రెడ్డి కమిషనర్‌గా ఉన్న సమయంలో ‘మా ఇంటి నేస్తం’ కింద కుక్క పిల్లలను పెంచుకోవాలని ముందుకొచ్చేవారికి వాటిని అందజేసేవారు.
సదరు కార్యక్రమానికి మెరుగులు దిద్ది, వాటిని స్ట్రీట్ డాగ్స్‌లా చూడకుండా అందమైన పెట్‌డాగ్స్‌గా పెంచుకునేందుకు కుక్క పిల్లలకు వైద్య పరీక్షలు, టీకాలు తదితరాలు పూర్తయ్యాక పెంపకంపై తగిన అవగాహన వంటివి సైతం కల్పించి దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చే వారికి అందజేయనున్నారు. ఎంపిక చేసిన పార్కుల్లో కెన్నెల్స్‌లో కుక్కపిల్లలను ఉంచి ప్రదర్శన ఏర్పాటు చేసి, అధికారులతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించి, నిబంధనలకనుగుణంగా నడచుకునేలా అవగాహన కలి్పంచి దత్తత తీసుకునేందుకు ఆసక్తి చూపే వారికి కుక్కపిల్లలను అందజేయనున్నారు.
కుక్కకాట్లు తగ్గేందుకు..
హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా దేశంలోని పలు నగరాల్లో వీధి కుక్కల సమస్యలున్నాయి. వాటి బారిన పడి ఎందరో.. ముఖ్యంగా చిన్నపిల్లలు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. కోర్టులు సైతం ఈ సమస్యను తీవ్రంగా పరిగణిస్తూ ఆయా మున్సిపల్ కార్పొరేషన్లను ప్రశి్నస్తున్నాయి. ఎంతగా శస్త్రచికిత్సలు చేసినప్పటికీ, కుక్కల సంతతిని అరికట్టడం సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో వీధికుక్కలుగా ఉంటే జనాన్ని కరుస్తుండటంతో వాటిని పెంపుడు జంతువులుగా మారిస్తే సమస్య తగ్గుతుందనే తలంపుతో
జీహెచ్‌ఎంసీ ఈ కార్యక్రమానికి సిద్ధమైంది.
పార్కుల్లో ప్రదర్శనలు
ఇందులో భాగంగా తొలుత బంజారాహిల్స్‌లోని జలగం వెంగళరావు పార్కులో, తర్వాత కేబీఆర్ పార్కులో కెన్నెల్స్‌లో ప్రదర్శనలు నిర్వహించనున్నారు. తద్వారా డాగ్ లవర్స్ కుటుంబాలతో సహ వచ్చి ప్రదర్శనలోని కుక్కపిల్లల్లో నచ్చిన దానిని ఎంచుకునేందుకు వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రదర్శనకు అవసరమైన కెన్నెల్స్ ప్రైవేట్ ఏజెన్సీ సహకారంతో సమకూర్చుకోనున్నారు. జీహెచ్‌ఎంసీ వెటర్నరీ విభాగం సిబ్బందితో పాటు స్వచ్ఛంద సేవల సిబ్బంది దత్తత ఇచ్చేందుకు కుక్కపిల్లలకు తగిన వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్యకరంగా ఉన్నవాటినే ప్రదర్శనలో ఉంచుతారు.
తల్లిపాలు మరచిన, నులిపురుగులు వంటివి లేకుండా తగిన మందులతోపాటు అవసరమైన టీకాలు వేసిన రెండునెలల వయసు దాటిన కుక్కపిల్లలను ప్రదర్శనల్లో ఉంచుతారు. ప్రదర్శన సమయంలో కుక్కపిల్లల్ని దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చేవారికి అక్కడే దరఖాస్తులు అందజేస్తారు. ముఖాముఖి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ప్రజల సందేహాలకు సమాధానాలిస్తారు. ప్రజలు కుక్కకాట్ల బారిన పడకుండా ఉండేందుకు వీధికుక్కల సంఖ్యను తగ్గించే చర్యల్లో భాగంగా, ఎక్కువమంది ప్రజలు కుక్కల్ని దత్తత తీసుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపకరిస్తాయని అధికారులు భావిస్తున్నారు.
ఆరోగ్యంపై వాకబు..
దత్తత తీసుకునేవారికి కుక్కల పెంపకంపై తగిన అవగాహనతో పాటు జంతు సంరక్షణకు సంబంధించిన అంశాల వంటివి వివరించనున్నారు. దత్తత ఇచి్చన కుక్కలకు అవసరమైన వైద్య పరీక్షలకు జీహెచ్‌ఎంసీ సహకరించనుంది. నిరీ్ణత వ్యవధిలో దత్తత తీసుకున్న ఇళ్లకు వెళ్లడం లేదా ఫోన్ ద్వారా సంప్రదించి దత్తత కుక్కల ఆరోగ్యాన్ని వాకబు చేయనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ప్రజారోగ్యం, జంతు సంరక్షణల దృష్ట్యా యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలకు అనుగుణంగా దత్తత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.