ఒమిక్రాన్‌పై ఆందోళనొద్దు.. మరిపిల్లల సంగతేంటీ ?

Public Health Foundation of India President Srinath Reddy Comments On Omicron Variant - Sakshi

వైరస్‌ మ్యుటేట్‌ అవడం సాధారణమే

డాక్టర్‌ కె.శ్రీనాథ్‌ రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: ఒమిక్రాన్‌ వేరియెంట్‌ గురించి మరీ ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా(పీహెచ్‌ఎఫ్‌ఐ) అధ్యక్షుడు డాక్టర్‌ కె.శ్రీనాథ్‌రెడ్డి అన్నారు. ఒమిక్రాన్, బూస్టర్‌ డోస్‌లు వంటి అంశాలపై ఆయన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఆ వివరాలు..

‘ఒమిక్రాన్‌’ఆందోళనకరమేనా?
జవాబు: దక్షిణాఫ్రికాలోని ఒమిక్రాన్‌ వేరియెంట్‌కు 32 మ్యుటేషన్లు వచ్చాయి. వాటి గురించిన ఆందోళన ఇక్కడ అవసరంలేదు. వైరస్‌లనేవి మ్యుటేట్‌ అవుతాయి. రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాలిక రోగులు, వృద్ధులు వంటివారిలో వైరస్‌ వివిధ రకాలుగా మ్యుటేట్‌ అయ్యేందుకు తగిన సమయం దొరుకుతుంది. అందువల్ల అది పెద్దసంఖ్యలో పునరుత్పత్తి చెందుతుంది. బోట్‌స్వానా తదితర దక్షిణాఫ్రికా దేశాల్లో హెచ్‌ఐవీ–ఎయిడ్స్‌ కేసులు కూడా తగిన సంఖ్యలో ఉన్నందున వైరస్‌ బాగా మ్యుటేట్‌ అయ్యేందుకు అనుకూల పరిస్థితులున్నాయి.

బూస్టర్‌డోస్‌లపై ఏమంటారు?
జవాబు: బూస్టర్‌ డోస్‌లు వేసే విషయంలో మన ప్రాధామ్యాలు ఏమిటనేది ముందు నిర్ణయించుకోవాలి. అందుబాటులో ఉన్న టీకాలు, సరఫరా, వ్యాక్సిన్లు వేసే బృందాలను బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. 

భారత్‌లో మొదటగా బూస్టర్‌ డోస్‌లు ఎవరికివ్వాలి?
జవాబు: ఈ ఏడాది జనవరి–ఏప్రిల్‌ల మధ్య దేశంలో ముందుగా టీకాలు తీసుకున్న హెల్త్‌ వర్కర్లు, వృద్ధులు, రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు, తీవ్ర అనారోగ్య పీడితులను గుర్తించి వారికి తొలుత బూస్టర్‌ డోస్‌లు వేయాలి. భారత్‌ జనాభాలోని కొన్నివర్గాల వారికి బూస్టర్‌ డోస్‌లు వేసేందుకు ముందు సంసిద్ధం కావాలి. 

మరిపిల్లల సంగతేంటీ ?
జవాబు: ప్రపంచవ్యాప్తంగా చూస్తే పిల్లలపై వైరస్‌ తీవ్ర ప్రభావం చూపడం లేదనేది స్పష్టమైంది. అందువల్ల ఇప్పుడు పిల్లలకు డోస్‌లు అవసరం లేదు.

మరి పిల్లలకు రక్షణ ఎలా?
జవాబు: పెద్దలతోపాటు పిల్లలను సైతం కరోనా సోకడంతో (తీవ్ర జబ్బుగా మారకపోయినా) పాటు వైరస్‌ వాహకులుగా మారుతున్నారు. ఆ ప్రమాదాన్ని నివారించేందుకు పిల్లలు మాస్క్‌లు ధరించేలా చూడాలి. పెద్దలందరికీ టీకాలు వేయడం ద్వారా పిల్లలకు వైరస్‌ సోకకుండా జాగ్రత్త పడాలి. 

వ్యాక్సిన్ల ప్రభావం ఎప్పుడు తగ్గుతుంది?
జవాబు: కొన్ని నెలల తర్వాత టీకాల ప్రభావం కొంత తగ్గిపోతుందని వివిధ అధ్యయనాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఐనప్పటికీ ఆ తర్వాత కూడా వ్యాక్సిన్ల వల్ల రక్షణ అనేది 50 శాతం దాకా ఉండొచ్చని అంచనా వేసున్నారు. ఏది ఏమైనా ముందుగా ఇన్ఫెక్షన్‌ సోకకుండా అన్ని జాగ్రత్తలు, నియంత్రణ చర్యలు తీసుకోవడం ఎంతో ముఖ్యం,   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top