
ఖరీఫ్ పూర్తి కావొచ్చినా ఇంకా కొనసాగుతున్న వైనం
ఇప్పటివరకు అధికారికంగా 60 శాతం మించని పంటల నమోదు
ఏ రైతు ఎంత విస్తీర్ణంలో, ఏ పంట వేశారో తేల్చడంపై వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం
గత ఏడాది గణాంకాలతో పని కానిచ్చేస్తున్నారనే విమర్శలు
లెక్కలు సరిగా ఉంటేనే ఎరువులు, మద్దతు ధర, కొనుగోళ్లపై సరైన అంచనాలకు చాన్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు పండించే పంటలకు సంబంధించి ప్రతి సీజన్‌లో అనుసరించే క్రాప్ బుకింగ్ (పంటల నమోదు) విధానం లోపభూయిష్టంగా మారిందనే విమర్శలు విన్పిస్తున్నాయి. శాస్త్రీయ పద్ధతిలో, జియో ట్యాగింగ్ ద్వారా పంటలు నమోదు చేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం ఏడాదిన్నర క్రితం ప్రకటించినప్పటికీ..ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం జరగలేదు. క్రాప్ బుకింగ్‌తో పాటు వివిధ పంటలకు ఆశించే తెగుళ్లు, నివారణ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు సెక్టార్ల వారీగా నియమించిన వ్యవ సాయ విస్తరణాధికారులు (ఏఈవోలు) ఇచ్చే నివేదికల పైనే ప్రభుత్వం ఆధారపడుతోంది.
రైతు పంటలు వేసినప్పుడే ఎన్ని ఎకరాల్లో ఏ పంట వేశారనే వివరాలను నమోదు చేసి ప్రభుత్వానికి పంపిస్తే, కచ్చితమైన సాగు విస్తీర్ణం, సాగైన పంటల వివరాలు తెలుస్తాయి. తదనుగుణంగా ఎరువుల పంపిణీ, మద్దతు ధరకు కొనుగోళ్లు, అందుకయ్యే నిధులు సమకూర్చుకోవడం వంటి ప్రక్రియ సజావుగా జరిగే వీలుంటుంది. కానీ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. క్రాప్ బుకింగ్ అంతా కాకి లెక్కలతో సరిపెడుతున్నారని, ఎరువుల పంపిణీ మొదలుకొని పంటల సేకరణ వరకు అంతా లోపభూయిష్టంగానే సాగుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ సీజన్‌లో 60శాతం మించని క్రాప్ బుకింగ్
రాష్ట్రంలో ఖరీఫ్ (వానాకాలం) సీజన్ గత నెల 30వ తారీఖుతో పూర్తయింది. ఆనాటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 133.25 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయినట్లు వ్యవసాయ శాఖ నివేదిక చెబుతోంది. ఇవి కాకుండా ఎర్ర మిర్చి, పసుపు 1.34 లక్షల ఎకరాల్లో సాగయినట్లు చెపుతున్నారు. అయితే అధికారికంగా పంటల నమోదు మాత్రం సెప్టెంబర్ 30 నాటికి 70 లక్షల ఎకరాల (53 శాతం) మేరకే పూర్తయింది. సెప్టెంబర్ 30 నుంచి ఈనెల 7 వరకు వారం రోజుల్లో మరో ఏడు శాతం క్రాప్ బుకింగ్ అయిందనుకున్నా, 60 శాతం మించలేదు. ఒకవైపు వరి కోతలు ప్రారంభం కాగా, మరోవైపు పత్తి ఏరడం కూడా ప్రారంభమైంది. అయితే ఇప్పటివరకు వరి క్రాప్ బుకింగ్ 53 శాతం, పత్తి పంట నమోదు 57 శాతం మాత్రమే పూర్తయింది.
చేతులు దులుపుకొంటున్నారా?
ఒక గ్రామంలో ఒక ఖరీఫ్ సీజన్‌లో సాగైన పంటల విస్తీ ర్ణం ఆధారంగా మరుసటి సంవత్సరం పంట నమోదును కొంత అటు ఇటుగా నమోదు చేస్తున్నారనే విమర్శలు వ్యవసాయ శాఖలోనే ఉన్నా యి. గత ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో యూరియా కొరత అత్యంత తీవ్ర రూపం దాల్చడానికి సరైన క్రాప్ బుకింగ్ డేటా లేకపోవడమే కారణమ నే అభి ప్రాయం వ్యక్తమైంది. రైతులు పంటలు సాగు చేసి నప్పుడే ఆయా పంటలను కచ్చితమైన విస్తీర్ణంతో నమోదు చేస్తే, ఏ గ్రామానికి ఏ పంటలకు ఎంత యూరియా, ఇతర ఎరువులు అవ సరమవుతాయనే అంచనాలకు అవకాశం ఉంటుంది. కానీ అది జర గడం లేదు. అలాగే వరి ధాన్యం విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు రైతులు వచ్చినప్పుడు కూడా ఈ సమస్య ఉత్పన్నమవుతోంది.
పత్తి, జొన్నలు విక్రయించే సమయాల్లో వేసే లెక్కలకు పొంతన ఉండడం లేదు. పంటల నమోదు ప్రక్రియ శాస్త్రీయ పద్ధతిలో ఉంటే ఈ పరిణామాలు ఉత్పన్నం కావని వ్యవసాయ, మార్కెటింగ్‌అధికారులు చెపుతున్నారు. వ్యవ సా య విస్తరణాధికారులకు జిల్లా, మండల స్థాయిలో చేయాల్సిన వ్యవసాయ పనులు అప్పగించడం వల్ల పంట నమోదు కాకుండా ఇతర పనులపైనే ఎక్కు వ సమయం గడిపే పరిస్థితి ఉందంటున్నారు. ఈ కారణంగానే గత ఏడాది అదే సీజన్‌లో నమోదు చేసిన పంటలకు కొంత ఎక్కువ, తక్కు వగా నమోదు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి.