President Murmu to visit Telangana as Part of Winter Retreat - Sakshi
Sakshi News home page

HYD: 26న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాక.. పర్యటన వివరాలు ఇవే..

Dec 15 2022 2:30 AM | Updated on Dec 15 2022 3:43 PM

President Droupadi Murmu Come To Telangana As Part Of Winter Retreat - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్ర పర్యటనకు రానున్నారు. శీతకాల విడిదిలో భాగంగా ఈనెల 26 నుంచి 30వ తేదీ వరకు ఆమె బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 26న మధ్యా హ్నం శ్రీశైలం దేవస్థానాన్ని సందర్శించి అక్కడ జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన నున్నారు. అనంతరం తెలంగాణ పర్యటనకు బయలుదేరనున్నారు. 

అదే రోజు మధ్యాహ్నం 3.05 గంటల నుంచి 3.15 వరకు బొల్లారంలో యుద్ధస్మారకాన్ని సందర్శించి నివాళి అర్పించడంతో పాటు వీరనారులను సన్మానించనున్నారు. సాయంత్రం 7.45 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఇచ్చే విందుకు హాజరు అవుతారు. 27న ఉదయం 10.30 గంటలకు నారాయణగూడలోని కేశవ మెమోరియల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీని సందర్శించి విద్యార్థులతో సంభాషించనున్నారు. మధ్యాహ్నం 3 నుంచి 4గంటల వరకు సర్దార్‌ వల్లభాయ్‌ జాతీయ పోలీసు అకాడమీని సందర్శించి శిక్షణలో ఉన్న ఐపీఎస్‌ అధికారులతో మాట్లాడనున్నారు. 

భద్రాచలం, రామప్ప ఆలయాల సందర్శన 
ఈ నెల 28న ఉదయం 10.40 నుంచి 11.10 గంటల వరకు భద్రాచలం ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. కేంద్ర పర్యాటక శాఖకి సంబంధించిన ‘ప్రశాద్‌’ అనే ప్రాజెక్టును ఈ సందర్భంగా ఆమె ప్రారంభిస్తారు. మిధాని ఏర్పా టు చేసిన ‘వైడ్‌ ప్లేట్‌ మిల్‌ ప్లాంట్‌’ను అక్కడి నుంచే వర్చువల్‌గా ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3 నుంచి 3.30 గంటల వరకు వరంగల్‌ జిల్లాలోని రామప్ప ఆలయాన్ని సందర్శించి అక్కడ సైతం ప్రశాద్‌ ప్రాజెక్టును ప్రారంభించడంతో పాటు కేంద్ర సాంస్కృతిక శాఖకి సంబంధించిన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. 

ఆశ, అంగన్‌వాడీలతో సమావేశం
29న ఉదయం 11 నుంచి 12 గంటల వరకు షేక్‌పేట్‌లోని నారాయణమ్మ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ను రాష్ట్రపతి సందర్శించి విద్యార్థులతో మాట్లాడనున్నారు. సాయంత్రం 5–6 గంటల వరకు శంషాబాద్‌లోని శ్రీరామా నుజాచార్యుల విగ్రహాన్ని సందర్శిస్తారు. 30న ఉదయం 10–11 గంటల వరకు రంగారెడ్డి జిల్లా శాంతివనంలోని శ్రీరామచంద్ర మిషన్‌ను సందర్శించి అక్కడ జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఏపీ, తెలంగాణకు చెందిన అంగన్‌వాడీ, ఆశ వర్కర్లను ఉద్దేశించి మాట్లాడ తారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ‘హర్‌ దిల్‌ ధ్యాన్‌..హర్‌ దిన్‌ ధ్యాన్‌’ అనే నినాదాన్ని ఆవిష్కరిస్తారు. శ్రీరామచంద్ర మహారాజ్‌ 150వ జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు రాష్ట్రపతి నిలయంలో భోజనం చేసి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement